TG ICET 2026 Counselling Updates : టీజీ ఐసెట్ (TG ICET) - 2026 మొదటి విడత కౌన్సెలింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కాలేజీల్లోని కోర్సులకు సంబంధించి మంగళవారం విద్యార్థులకు సీట్లను కేటాయించారు. తొలి విడత కౌన్సెలింగ్ ముగిసే సమయానికి మొత్తం సీట్లలో 54 శాతం భర్తీ అయినట్లు అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో కలిపి మొత్తం 36,241 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో 19,526 సీట్లలో విద్యార్థులు చేరగా, ఇంకా 16,715 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 309 ఎంబీఏ కళాశాలల్లో మొత్తం 29,457 సీట్లు ఉంటే.. అందులో 16,896 సీట్లు భర్తీ అయ్యాయి.
- ఎంసీఏ కోర్సు: 92 కళాశాలల్లో అందుబాటులో ఉన్న 6,784 ఎంసీఏ సీట్లలో 2,630 సీట్లు మాత్రమే కేటాయింపు పూర్తి చేసుకున్నాయి.
ఆగస్టు 14 చివరి తేదీ…..
టీజీ ఐసెట్ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు తమ అడ్మిషన్‌ను ఖరారు చేసుకోవడానికి నిబంధనల ప్రకారం ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి. ఆగస్టు 14వ తేదీ వరకు మాత్రమే దీనికి గడువు ఇచ్చారు. నిర్దేశిత సమయం లోపు ఫీజు చెల్లించకపోయినా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా అభ్యర్థి పొందిన సీటు కేటాయింపు రద్దవుతుంది.
అలాట్ మెంట్ డౌన్లోడ్ ఇలా….
- ముందుగా తెలంగాణ ఐసెట్ అధికారిక పోర్టల్ https://tgicet.nic.in/default.aspx ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలో కనిపిస్తున్న 'Candidate Login' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మీ లాగిన్ ఐడీ (Login ID), హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number), పాస్‌వర్డ్, పుట్టిన తేదీ, స్క్రీన్‌పై ఉన్న క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి లాగిన్ అవ్వండి.
- లాగిన్ అయిన తర్వాత మీకు సీటు కేటాయింపు జరిగి ఉంటే, అలాట్‌మెంట్ ఆర్డర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా మీ అలాట్‌మెంట్ కాపీని సేవ్ చేసుకోవచ్చు.
- కాలేజీలో చేరే సమయంలో ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ కాపీ అత్యంత కీలకం.