...
...
Next Story

TGSPDCL Mobile App : కొత్త కనెక్షన్ నుంచి బిల్లుల చెల్లింపుల వరకు...! మొబైల్ యాప్‌తో డిజిటల్ సేవలు

తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) వినియోగదారుల కోసం సరికొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యుత్ బిల్లుల చెల్లింపులు, కొత్త కనెక్షన్లు, ఫిర్యాదుల నమోదు వంటి సేవలను ఈ యాప్ ద్వారా సులభంగా పొందవచ్చు.

Published on: Jun 5, 2026, 10:00:20 IST
Advertisement

తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలను అందించేందుకు తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) సరికొత్త డిజిటల్ విప్లవానికి తెరలేపింది. వినియోగదారులు పదే పదే విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా…. తమ స్మార్ట్‌ఫోన్ ద్వారానే అన్ని రకాల సేవలను పొందేలా సరికొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. "మీ చేతిలోనే మీ విద్యుత్ కార్యాలయం" అనే నినాదంతో రూపొందించిన ఈ యాప్ ద్వారా ఇంట్లో కూర్చునే విద్యుత్ సేవలను సులభంగా నిర్వహించుకోవచ్చు.

యాప్‌లోని ముఖ్యమైన సేవలు:

  • సులభమైన బిల్లు నిర్వహణ
  • విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడే అవసరం లేకుండా ఈ యాప్ సమయాన్ని ఆదా చేస్తుంది.
  • వినియోగదారులు తమ యూనిక్ సర్వీస్ కనెక్షన్ (USC) నంబర్‌ను సులభంగా యాప్‌లో జోడించుకోవచ్చు లేదా అవసరం లేకుంటే తొలగించవచ్చు.
  • ప్రతి నెలా వచ్చే విద్యుత్ బిల్లును ఆన్‌లైన్‌లోనే నేరుగా చెల్లించే సదుపాయం ఉంది.
  • గతంలో చెల్లించిన బిల్లుల చరిత్రను (Bill History) ఎప్పుడైనా చూసుకునే వీలు కల్పించారు.
  • సమస్యలపై తక్షణ ఫిర్యాదులు

TGSPDCL మొబైల్ యాప్‌తో డిజిటల్ సేవలు!
TGSPDCL మొబైల్ యాప్‌తో డిజిటల్ సేవలు!

విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు ఏర్పడినా యాప్ ద్వారా ఫిర్యాదు చేసి వెంటనే స్పందన పొందవచ్చు. ముఖ్యంగా కింది సమస్యలపై వినియోగదారులు ఫిర్యాదులు నమోదు చేయవచ్చు.

  • కరెంట్ కోతలు, వోల్టేజ్ హెచ్చుతగ్గులు (లో వోల్టేజ్ / హై వోల్టేజ్).
  • ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలు, కాలిపోయిన మీటర్లు, మీటర్ లోపాలు.
  • రోడ్లపై తెగిపోయిన విద్యుత్ తీగలు, లూజ్ లైన్లు, స్తంభాలకు తగిలిన చెట్టు కొమ్మలు.
  • విద్యుత్ స్తంభం షాక్ కొట్టడం లేదా స్తంభాలు దెబ్బతినడం, వంగిపోవడం వంటి అత్యవసర సమస్యలు.
  • తప్పుగా వచ్చిన బిల్లులు, సకాలంలో బిల్లు జారీ కాకపోవడం వంటి రెవెన్యూ సమస్యలు.
  • కొత్త కనెక్షన్లు, సేవల దరఖాస్తులు

నూతనంగా ఇళ్లు లేదా వ్యాపార సముదాయాలు నిర్మించుకునే వారికి ఈ యాప్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం యాప్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. పర్యావరణ హితం కోసం రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు, గ్రీన్ ఎనర్జీకి తోడ్పడేందుకు గ్రీన్ టారిఫ్ సేవ కోసం ఇక్కడే దరఖాస్తు పెట్టుకోవచ్చు.

ప్రస్తుతం ఉన్న కనెక్షన్లలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా విద్యుత్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కనెక్షన్ పేరు మార్పిడి (Name Change), చిరునామా సవరణ, కేటగిరీ మార్పు (గృహ అవసరాల నుండి కమర్షియల్‌కు మార్చడం వంటివి)తో పాటు అదనపు లోడ్ మంజూరు లేదా లోడ్ తగ్గింపు అభ్యర్థనలు చేసుకోవచ్చు.

ఈ యాప్‌లో వినియోగదారుల సమాచారం కోసం మరికొన్ని వినూత్న ఫీచర్లను చేర్చారు. అత్యవసర సహాయం కోసం 1912 కాల్ సెంటర్‌కు నేరుగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనితో పాటు TGSPDCL వాట్సాప్ చాట్‌బాట్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. స్థానిక ఫ్యూజ్ కాల్ ఆఫీస్ (FCO), సర్కిల్ కంట్రోల్ రూమ్, సెక్షన్ ఆఫీసర్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

ఇంట్లో విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసేందుకు 'ఎనర్జీ కాలిక్యులేటర్', TGERC టారిఫ్ ధరల వివరాలు…. విద్యుత్ పొదుపు చేయడానికి అవసరమైన ముఖ్యమైన సూచనలు ఇందులో ఉన్నాయి. ఎక్కడైనా కరెంట్ దొంగతనం జరుగుతుంటే, దానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసే సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఈ డిజిటల్ సేవల ద్వారా వినియోగదారులకు కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తగ్గడమే కాకుండా, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ వేగవంతం అవుతుంది. విద్యుత్ శాఖ పనుల్లో పారదర్శకత పెరిగి…. వినియోగదారులకు పూర్తి స్థాయి సంతృప్తి కలుగుతుందని TGSPDCL ఓ ప్రకటన ద్వారా వివరించింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe