TGSRTC : సంక్రాంతికి 6,431 స్పెషల్ బస్సులు.. ఛార్జీలు కూడా పెంపు, ఎంతంటే?
సంక్రాంతి రద్దీ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ 6,431 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టుగా ప్రకటించింది. వీటిలో అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నట్టుగా అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సంక్రాంతి సందర్భంగా రాష్ట్రం అంతటా, పొరుగు రాష్ట్రాలకు 6,431 ప్రత్యేక బస్సుల నడపనుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తమ స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులకు సురక్షితమైన, ఇబ్బంది లేని ప్రయాణానికి ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నది.

జనవరి 9, 10, 12, 13 తేదీలలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తూ, డిమాండ్ ఆధారంగా అదనపు సర్వీసులను మోహరించాలని రవాణా సంస్థ అనుకుంటోంది. ఇక జనవరి 18, 19 తేదీలలో తిరుగు ప్రయాణ రద్దీకి కూడా ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ఆర్టీసీ అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్‌బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయినపల్లి, గచ్చిబౌలి వంటి రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు నడుపుతారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలనుకునే ప్రయాణికులకు తగిన విధంగా బస్సులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ.
ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడానికి టీజీఎస్ఆర్టీసీ ఈ బోర్డింగ్ పాయింట్ల వద్ద తాత్కాలిక షెల్టర్లు, షామియానాలు, సీటింగ్ ఏర్పాట్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లు, తాగునీటి సౌకర్యాలు, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తుంది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూస్తోంది.
ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండటానికి ప్రధాన పండుగల సమయంలో ప్రత్యేక సర్వీసులు నిత్యం నడుపుతామని ఆర్టీసీ యాజమాన్యం మరోసారి స్పష్టం చేసింది. తిరుగు ప్రయాణంలో, కొన్ని ప్రత్యేక బస్సులు తక్కువ రద్దీతో నడిచినప్పటికీ, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని, రద్దీ ఆధారంగా ఖాళీ బస్సులను అధిక డిమాండ్ ఉన్న మార్గాలకు మారుస్తామని ఆర్టీసీ చెబుతోంది.
సవరించిన బస్సు ఛార్జీలు
2003లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు నంబర్ 16 ప్రకారం, అదనపు ఇంధనం, నిర్వహణ ఖర్చులను భరించేందుకు పండుగలు, ప్రత్యేక సందర్భాలలో నడిచే ప్రత్యేక బస్సులకు టికెట్ ఛార్జీలను 1.5 రెట్లు వరకు సవరించడానికి కార్పొరేషన్‌కు అనుమతి ఉంది. దీని ప్రకారం ఇతర రాష్ట్రాలకు నడిచే బస్సులతో సహా, సంక్రాంతి ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరించిన ఛార్జీలు (1.5x వరకు) అమలు చేస్తారు. అంటే రూ.100 రూపాయల టికెట్‌కు రూ.150 వరకు వసూలు చేస్తారు. 50 శాతం అదనపు ఛార్జీలు ఉంటాయి.
సవరించిన ఛార్జీలు జనవరి 9, 10, 12, 13 తేదీల్లో, జనవరి 18, 19 తేదీల్లో మాత్రమే వర్తిస్తాయి. సాధారణ బస్సులు సాధారణ ఛార్జీలతో నడుస్తాయని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.
మహిళలకు ఫ్రీ బస్సులు
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద, సంక్రాంతి పండుగ సమయంలో కూడా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం యథావిధిగా కొనసాగుతుంది. ప్రయాణికులు అధికారిక వెబ్‌సైట్ www.tgsrtcbus.in ద్వారా ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
సంక్రాంతి ప్రత్యేక సర్వీసుల గురించి పూర్తి సమాచారం కోసం ప్రయాణికులు 040-69440000 లేదా 040-23450033 నంబర్లలో ఆర్టీసీ కాల్ సెంటర్లను సంప్రదించవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


