హైదరాబాద్‌ రోడ్లపైకి మరో 65 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చిన టీజీఎస్ఆర్టీసీ!

హైదరాబాద్‌ వాసులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మరో 65 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చింది. వీటిని తాజాగా ప్రారంభించారు.

Published on: Dec 10, 2025, 20:40:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) సహకారంతో ఎవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బుధవారం టీజీఎస్ఆర్టీసీ 500 లో-ఫ్లోర్ సిటీ బస్ ప్రాజెక్ట్ కింద రాణిగంజ్ డిపో నుండి 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించింది. ఈ బస్సుల ఎంట్రీతో హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ మరింత ప్రజలకు చేరువకానుంది. రాణిగంజ్ డిపోకు 100 బస్సుల కేటాయింపులో భాగం ప్రస్తుతం 65 బస్సులు ప్రవేశపెట్టారు.

ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు
ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు

టీజీఎస్ఆర్టీసీ 500 బస్సుల ప్లాన్‌లో 450 నాన్-ఏసీ, 50 ఏసీ లో-ఫ్లోర్ ఎలక్ట్రిక్ సిటీ బస్సులు ఉన్నాయి. ఇప్పటివరకు, 325 బస్సులు డెలివరీ అయ్యాయి. మిగిలిన 175 బస్సులు జనవరి 2026 నాటికి ఇండక్షన్ కోసం షెడ్యూల్ చేస్తారు. దీనితోపాటుగా ఆర్టీసీ విస్తృత మార్పుకు అనుగుణంగా ఎలక్ట్రిక్ బస్సు నెట్‌వర్క్‌ను క్రమంగా విస్తరిస్తోంది.

ఈ సందర్భంగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. 'ఈ కొత్త బస్సులు దాదాపు 373 కాలనీలను కలుపుతాయి. గత రెండు సంవత్సరాలలో బస్సుల సంఖ్య 40 శాతం పెరిగింది. సేవలను బలోపేతం చేయడానికి కొత్త సిబ్బంది నియామకాన్ని కూడా ప్రారంభించాం. ప్రయాణికుల సమస్యలను పరిష్కరించడం, పరిశుభ్రతను నిర్ధారించడం, ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం, ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి కొత్త డిపోలను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఈరోజు 65 కొత్త బస్సులను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇది సిటీ కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది.' అని పొన్నం అన్నారు.

'ఈరోజు బస్సుల ప్రారంభంతో ఇది భారతదేశంలో మా 69వ డిపో, తెలంగాణలో ఐదో డిపో అవుతుంది. దేశవ్యాప్తంగా మేం 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో 3,100 కి పైగా బస్సులను విజయవంతంగా నడుపుతున్నాం. జనవరి 2026 నాటికి మిగిలిన బస్సులను డెలివరీ చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. మా బస్సులన్నీ అద్భుతంగా పనిచేస్తున్నాయి. ప్రయాణీకులకు సజావుగా, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి.' అని ఎవే ట్రాన్స్ సీఈఓ సందీప్ రైజాదా అన్నారు.

36 మంది సీటింగ్ సామర్థ్యంతో, ఈ బస్సులు న్యూమాటిక్ తలుపులు, ఆటోమేటెడ్ అనౌన్స్‌మెంట్‌లు, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, యూఎస్‌బీ ఛార్జింగ్ పాయింట్లు, వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక యాక్సెసిబిలిటీ ఫీచర్లను అందిస్తున్నాయి.

ఈ బస్సులు సికింద్రాబాద్, కొండాపూర్, ఇస్నాపూర్, బోరబండ, రామాయంపేట, గచ్చిబౌలి, మియాపూర్‌లను కనెక్ట్ చేసే ప్రధాన మార్గాల్లో నడుస్తాయి. రోజువారీ ప్రయాణ సౌలభ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి. ఈ కొత్త బస్సులు శబ్దం, ఉద్గారాలను తగ్గిస్తుందని, ఖర్చులను తగ్గిస్తుంది. హైదరాబాద్‌లోని ప్రయాణికులకు నిశ్శబ్ద, సున్నితమైన, పర్యావరణ అనుకూల ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని చెబుతున్నారు.

పర్యావరణపరంగా బాధ్యతాయుతమైన పట్టణ రవాణా వ్యవస్థను నిర్మించడానికి టీజీఎస్ఆర్టీసీ, ఎవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి పని చేస్తు్న్నాయి. హైదరాబాద్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను పెంచుతూనే ఉంది. పర్యావరణానికి ఈ బస్సులు అనకూలంగా ఉంటాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More