Hyderabad : మరో 2 చెరువులకు 'హైడ్రా' పునరుజ్జీవం - ప్రారంభ తేదీలు ఖరారు

నగరంలోని పలు చెరువులను పునరుజ్జీవం పోస్తున్న హైడ్రా…తాజాగా మరో 2 చెరువులను సిద్ధం చేసింది. ఈ నెల 8వ తేదీన బ‌మృకున్ - ఉద్‌- దౌలా చెరువును సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. 9వ తేదీన కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల‌చెరువు కూడా అందుబాటులోకి రానుంది.

Published on: Mar 5, 2026, 18:20:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మ‌రో రెండు చెరువులు హైదరాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానున్నాయి. పాత‌బ‌స్తీలోని బ‌మృకున్ - ఉద్‌- దౌలా చెరువుతో పాటు.. కూక‌ట్ ప‌ల్లిలోని న‌ల్ల చెరువు ప్రారంభానికి సిద్ధ‌మ‌య్యాయి. ఈ నెల 8వ తేదీన బ‌మృకున్ - ఉద్ - దౌలా చెరువును ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించ‌నున్నారు. 9వ తేదీన కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువును కూడా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగానే ప్రారంభించి.. ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు.

మ‌రో రెండు చెరువులు సిద్ధం....!
మ‌రో రెండు చెరువులు సిద్ధం....!

హైడ్రా మొద‌ట విడ‌త చేప‌ట్టిన 6 చెరువుల్లో ఇప్ప‌టికే అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ కుంట గ‌తేడాది సెప్టెంబ‌రు 28న‌ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. మ‌రో మూడు చెరువులు నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. వీటికి తోడు రెండో విడ‌త మ‌రో 14 చెరువుల‌ను హైడ్రా అభివృద్ధి చేయ‌డానికి క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇలా న‌గ‌రంలో మురికి కూపాలుగా మారిన చెరువుల రూపురేఖ‌లు మార్చే ప‌నిలో హైడ్రా నిమ‌గ్న‌మైంది.

పాతబ‌స్తీకి మ‌ణిహారం..బ‌మృకున్ - ఉద్‌- దౌలా చెరువు

పాత‌బ‌స్తీలో నిజాంల నాటి చారిత్ర‌క చెరువు( చారిత్ర‌క బ‌మృకున్ - ఉద్‌- దౌలా చెరువు )కు హైడ్రా ప్రాణం పోసింది. క‌బ్జాల‌ను తొల‌గించి… ఆక్ర‌మ‌ణ‌ల‌తో ఆన‌వాళ్లే కోల్పోయిన చెరువును బ‌తికించింది. చరిత్ర‌ను త‌వ్వితీసిన మాదిరి చెరువును రూపొందించి చారిత్ర‌క వైభ‌వాన్ని హైడ్రా చాటింది.

ఒక‌వైపు ఉన్న నాటి క‌ట్ట‌ను మ‌రింత ప‌టిష్టం చేసి వాకింగ్ ట్రాక్‌ను హైడ్రా నిర్మించింది. క‌ట్ట‌పై ఓపెన్ జిమ్‌ను పెట్టి అన్ని వ‌య‌సుల‌వారి ఆరోగ్యానికి బాట‌లు వేసింది. చెరువు లోప‌లి వైపు ఫెన్సింగ్ ప‌నుల‌ను పూర్తి చేసింది. చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ప్లే ఏరియాలను అభివృద్ధి చేశారు. వృద్ధులు సేద దీరే విధంగా అక్క‌డ గ‌జ‌బోలు న‌లువైపులా నిర్మించారు.

చెరువుకు మూడు వైపులా ప్ర‌వేశ మార్గాల‌ను అందుబాటులోకి తెచ్చారు. నిజాంల కాలంలో ఈ చెరువుకు ఎంతో చ‌రిత్ర ఉంద‌ని.. దానిని పున‌రావృతం చేసేలా.. చుట్టూ ఔష‌ధ‌గుణాలున్న మొక్క‌ల‌తో పాటు.. చ‌ల్ల‌టి నీడనిచ్చే చెట్ల‌ను నాటారు. సీసీటీవీ కెమేరాల‌ను ఏర్పాటు చేసి.. హైడ్రా ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి ప‌ర్య‌వేక్షించేలా ఏర్పాట్లు చేశారు.

  • 1770లో మూడ‌వ నిజాం సికంద‌ర్ జాహ్ పాల‌న‌లో అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న న‌వాబ్ రుక్న్ - ఉద్ - దౌలా ఈ చెరువును నిర్మించార‌ని.. అందుకే బ‌మృకున్ - ఉద్‌- దౌలా చెరువు పేరు వ‌చ్చింద‌ని చారిత్ర‌క ఆధారాలు చెబుతున్నాయి.
  • తాగు నీటి అవ‌స‌రాల‌ను త‌ర్చేలా 104 ఎక‌రాల మేర ఈ చెరువు విస్త‌రించి ఉంద‌ని చ‌రిత్ర చెబుతోంది.
  • కాల‌క్ర‌మంలో చెరువు విస్తీర్ణం త‌గ్గుతూ హెచ్ ఎం డీ ఏ ఈ చెరువును 17.05 ఎక‌రాలుగా నిర్ధారించింది. చివ‌రికి 4.12 ఎక‌రాలుగా మిగిలిపోయింది. హైడ్రా 2024 ఆగ‌స్టులో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. హెచ్ ఎం డీ ఏ పేర్కొన్న విధంగా పూర్తి స్థాయిలో భూమి అందుబాటులోకి తెచ్చింది.

రాజేంద్ర‌న‌గ‌ర్‌, ఆరాంఘ‌ర్‌, కాటేదాన్ ప్రాంతాల నుంచి వ‌చ్చే వ‌ర‌ద ఈ చెరువుకు చేరేద‌ని పలువురు చెబుతున్నారు. నిజాంల‌ కాలంలో మీరాలం ట్యాంక్‌ను రాజులు, బ‌మృకున్ - ఉద్‌- దౌలా చెరువును రాణులు స్నానాల‌కు వినియోగించేవార‌ని అంటున్నారు. ఎంతో చ‌రిత్ర ఉన్న ఈ చెరువు మ‌ళ్లీ పున‌రుద్ధ‌ర‌ణ‌కు నోచుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని ప‌లువురు సంబురప‌డుతున్నారు.

నల్లచెరువుకు పునరుజ్జీవం…!

కాంక్రీట్ జంగిల్‌గా మారిన ప్రాంతంలో కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల‌చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురై బిక్కుబిక్కుమంటున్న త‌రుణంలో హైడ్రా దృష్టి ఆ చెరువుపై ప‌డింది. మురుగు నీటితో దుర్గంధ‌భ‌రితంగా మారిన ఈ చెరువును అభివృద్ధి చేయాల‌ని హైడ్రా నిర్ణ‌యించింది. 2024 సెప్టెంబ‌రులో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించిన‌ప్పుడు ఎన్నో అవ‌రోధాలు ఎదుర‌య్యాయి. రెవెన్యూ, గ్రామ రికార్డులు, చెరువుకు సంబంధించిన స‌మాచారంతో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించే ప‌నిని హైడ్రా చేప‌ట్టింది.

చెరువ‌లోకి జ‌రిగి ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో నిర్మించిన 16 వ్యాపార షెడ్డుల‌ను హైడ్రా తొల‌గించింది. చెరువులో పోసిన నిర్మాణ వ్య‌ర్థాల‌తో పాటు ద‌శాబ్దాలుగా పేరుకుపోయిన పూడిక‌ను పూర్తిగా తొల‌గించ‌డ‌మే కాకుండా.. 3 మీట‌ర్లకు పైగా మ‌ట్టిని కూడా తొల‌గించింది. అప్పుడు కాని దుర్గంధం దూర‌మ‌వ్వ‌లేదు. ఇప్పుడు చెరువు విస్తీర్ణం దాదాపు రెట్టింపు అయ్యింది. 16 ఎక‌రాల‌కు కుంచించుకుపోయిన చెరువు 30 ఎక‌రాలకు విస్త‌రించుకుంది.

కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల‌చెరువును హైడ్రా అభివృద్ధి చేసిన త‌ర్వాత అక్క‌డి ప‌రిస‌రాలు ఆహ్లాదంగా మారాయి. 5 కిలోమీట‌ర్ల దూరం నుంచి ఈ చెరువు చెంత సేద దీరేందుకు, వాకింగ్‌కు, పిల్ల‌ల‌ను ఆడించేందుకు వ‌స్తున్నామ‌ని సంద‌ర్శ‌కులు చెబుతుంటే చాలా ఆనందంగా ఉంద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ తెలిపారు.

ఇటీవలే చెరువు అభివృద్ధి ప‌నుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. “కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువు చుట్టూ నివాస ప్రాంతాలున్నాయి. వ‌ర్షం ప‌డితే .. చెరువులోకి వెళ్ల‌డానికి దారి లేక వ‌ర‌దంతా నివాస ప్రాంతాల‌ను ముంచెత్తేది. ఇప్పుడు న‌ల్ల చెరువులోకి 7 ఇన్‌లెట్ల ద్వారా చేరుతోంది. చెరువు నిండితే సుల‌భంగా వెళ్లేందుకు గ‌తంలో ఉన్న ఔట్‌లెట్‌ల‌ను అభివృద్ధి చేశాం. మురుగు నీరు క‌ల‌వ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. చెరువులో జీవ వైవిధ్యం ఉండేలా ఐల్యాండ్స్ నిర్మించాం. బోర్లు జీవం పోసుకున్నాయి. చెరువు చుట్టూ దాదాపు కిలోమీట‌రున్న‌ర పాత్ వే అందుబాటులోకి వ‌చ్చింది. ఆదివారం అయితే ఇది పెద్ద పిక్నిక్ స్పాట్‌లా మారింది. ఆరోగ్య ప‌రంగా మంచి సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నాం. మ‌ల్టీ ప‌ర్ప‌స్‌గా దీనిని త‌యారు చేస్తున్నాం” అని క‌మిష‌న‌ర్ వివరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More