...
...
Next Story

బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో ఊహించని ట్విస్ట్

సికింద్రాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Published on: Sep 11, 2026, 12:49:44 IST
Advertisement

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మోరీ నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి మాయమైన సంచలన ఘటనను దర్యాప్తు అధికారులు ఎట్టకేలకు ఛేదించినట్టుగా తెలుస్తోంది. ఘటన జరిగిన 11 రోజుల వ్యవధిలోనే మిలటరీ ఇంటెలిజెన్స్, తెలంగాణ పోలీస్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు
మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు

కస్టడీలోకి తీసుకున్న నలుగురిలో ఒకరు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందినవారు కాగా మిగిలిన ముగ్గురు ఇతర ప్రాంతాలకు చెందినవారు. ఆయుధాలను దొంగిలించడం, అక్కడ నుంచి తరలించడం, దాచిపెట్టడంలో వీరి పాత్రలపై పోలీసులు, మిలటరీ అధికారులు తీవ్రంగా విచారిస్తున్నారు.

ఈ సంచలన చోరీ వెనక ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు విచారణలో ఆధారాలు లభించాయి. తన పూర్వపు కమాండింగ్ ఆఫీసర్‌పై ఉన్న తీవ్రమైన వ్యక్తిగత కక్షే ఈ దొంగతనానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆయనను చిక్కుల్లో పడేయాలనే దురుద్దేశంతోనే ఈ చోరీకి ప్లాన్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

విచారణలో వెల్లడైన సమాచారం ఆధారంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఒక ప్రాంతంలో దాచిపెట్టిన ఆయుధాల నిల్వను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన తుపాకులు, మందుగుండు సామగ్రిని ఆర్మోరీ ఇన్వెంటరీ జాబితాతో సరిచూస్తున్నారు. మాయమైన ఆయుధాలన్నీ లభ్యమయ్యాయా లేదా అనేది పూర్తి తనిఖీల అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతానికి నిందితుల అరెస్టును అధికారికంగా నమోదు చేయాల్సి ఉంది.

ఆగస్టు 31న ఉదయం 7:50 గంటల ప్రాంతంలో ఆర్మోరీ తలుపులు తెరిచి ఉండటం, ఆయుధాలు భద్రపరిచే పెట్టెల తాళాలు పగలేసి ఉండటాన్ని సిబ్బంది గమనించడంతో ఈ దొంగతనం బయటపడింది. అంతకుముందు రోజు (ఆగస్టు 30) సాయంత్రం 6 గంటలకు ఆయుధాలను లెక్కించారు. ఆ తర్వాతే చోరీ జరిగింది. నాలుగు ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు, ఒక ఇన్సాస్ (INSAS) రైఫిల్, ఏడు పిస్టళ్లతో పాటు భారీగా మందుగుండు సామగ్రి మాయమైనట్లు గుర్తించారు.

ఘటన జరిగిన సమయంలో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌తో సహా ప్రధాన సైనిక దళం రాజస్థాన్‌లో ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్ కోసం వెళ్లింది. ఈ సమయాన్ని ఆసరాగా చేసుకుని దొంగతనానికి పాల్పడ్డినట్టుగా తెలుస్తోంది. విచారణలో భాగంగా ఆర్మోరీ సంరక్షణ బాధ్యతలు చూసే అధికారులు, కాపలాదారులు, అగ్నివీర్లను దర్యాప్తు బృందాలు విచారించాయి. అలాగే ఆర్మోరీ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలు రాత్రి సమయంలో బంద్ చేసి ఉండటం, దొంగతనాల నిరోధక అలారాలు (Anti-burglary alarms) పనిచేయకపోవడం దర్యాప్తులో గుర్తించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks