...
...
Next Story

మా ప్రభుత్వానికి పాలసీ పెరాలసిస్ లేదు.. మంచి ఆలోచనతో వస్తే పోత్సహిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

జనాభా శాతాన్ని మించి తెలంగాణ రాష్ట్రం జీడీపీకి తన వాటా అందిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నట్లుగా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పాలసీ పెరాలసిస్‌ లేదని తెలిపారు.

Published on: Oct 14, 2026, 15:23:32 IST
Advertisement

హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ మీట్-2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ అంతర్జాతీయ వాణిజ్య సదస్సును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రాన్ని ఆర్థికంగా అగ్రపథంలో నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. 2025లోనే తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించామని గుర్తుచేసిన ఆయన రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ డాలర్లకు, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సమతుల్య అభివృద్ధి సాధించేందుకు తెలంగాణను మూడు ప్రధాన ఆర్థిక మండలాలుగా వర్గీకరించినట్లు సీఎం వివరిస్తూ.. వాటి ప్రత్యేకతలను తెలియజేశారు. CURE (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని ఐటీ, అత్యాధునిక సాంకేతికత, సేవా రంగాలు, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.

PURE (పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ) ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతాన్ని తయారీ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌ల కోసం కేటాయించామని సీఎం చెప్పారు. RARE (రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ) గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తూ గ్రామీణ ఉపాధిని పెంపొందించనున్నట్టుగా వెల్లడించారు.

నారీ శక్తి భాగస్వామ్యం ఉన్న దేశాలే ఆర్థికంగా బలంగా ఎదుగుతాయని స్పష్టం చేసిన సీఎం.. తెలంగాణలో మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే మహిళా సంఘాలకు రూ. 61,000 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను అందించామని, అంతేగాక ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను మహిళలకే అప్పగిస్తూ వారిని యజమానులుగా తీర్చిదిద్దామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సమాఖ్య కూడా యువతతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను విశేషంగా ప్రోత్సహించాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి పాలసీ పెరాలసిస్ లేదా నిరోధకాలు ఉండవని, పరిశ్రమలకు లాభదాయకమైన ఉత్తమ విధానాలతో వచ్చే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. నాలుగు వందల ఏళ్ల క్రితం చార్మినార్ విదేశీ వ్యాపారులకు ఎలాగైతే కేంద్ర బిందువుగా ఉండేదో, నేటి ఆధునిక యుగంలో హైటెక్ సిటీ వ్యాపార రంగానికి ల్యాండ్‌మార్క్‌గా మారిందని కొనియాడారు. కేవలం విదేశీ కార్పొరేట్ కంపెనీలకు సేవలు అందించే స్థాయికే పరిమితం కాకుండా, మన దేశీయ పారిశ్రామికవేత్తలు సొంతంగా పెట్టుబడులు పెట్టి గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ అంతర్జాతీయ సదస్సులో అమెరికా, బ్రిటన్, యూఏఈ, ఈయూ దేశాల రాయబారులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సమాఖ్య ప్రతినిధులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks