...
...
Next Story

తెలంగాణలోని ఈ జిల్లాల్లో వైన్ టూరిజం.. స్థానికంగా ఉపాధి అవకాశాలు!

తెలంగాణలో వైన్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు పరిశీలిస్తున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వైన‌రీల‌ ఏర్పాటుకు అవ‌కాశం ఉందన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

Published on: Jul 31, 2026, 17:58:13 IST
Advertisement

తెలంగాణలో వైన్ టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలోని లీస్‌బర్గ్‌లో ఉన్న స్టోన్ టవర్ వైనరీని మంత్రి సందర్శించారు. సెల్లార్ టూర్‌లో పాల్గొని వైనరీ నిర్వహణ, వైన్ తయారీ ప్రక్రియను అధ్యయనం చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

వైనరీ ప్రతినిధులతో మాట్లాడి ద్రాక్ష సాగు, వైన్ తయారీకి అనువైన రకాలు, ప్రాసెసింగ్, ఫెర్మెంటేషన్, నిల్వ, బాట్లింగ్, నాణ్యతా ప్రమాణాలు, మార్కెటింగ్ తదితర అంశాలపై ఆరా తీశారు. ద్రాక్ష తోటలు, వైనరీలను పర్యాటకంతో అనుసంధానిస్తూ గైడెడ్ టూర్లు, హాస్పిటాలిటీ, సందర్శకులకు ప్రత్యేక అనుభూతులను కల్పిస్తున్న విధానాన్ని పరిశీలించారు.

హైదరాబాద్‌కు సమీపంలోని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ద్రాక్ష తోటలు, వైనరీల ఆధారిత పర్యాటక అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు, ద్రాక్ష సాగుకు అనుకూలత, స్థలాల ఎంపిక, పెట్టుబడి నమూనాలను అధ్యయనం చేసి ముందుకు వెళ్తామని స్ప‌ష్టం చేశారు.

వైన్ టూరిజం ద్వారా పర్యాటకులకు వినూత్న అనుభూతిని అందించడంతో పాటు ద్రాక్ష రైతులకు ప్రోత్సాహం, ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణ, స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనకు అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ పర్యాటక విధానం 2025–30లో భాగంగా రాష్ట్రంలో వినూత్న పర్యాటక ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తెలంగాణ టూరిజం కాన్‌క్లేవ్‌లో రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో పలు పర్యాటక ప్రాజెక్టులకు ఒప్పంద ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చాయని, వాటిలో రాష్ట్రంలోనే తొలిసారిగా వైనరీ వాక్‌థ్రూ అనుభూతితో కూడిన వైన్‌యార్డ్ రిసార్ట్ కూడా ఉందన్నారు. ఇందులో ద్రాక్ష సాగు, వైన్ తయారీ, బాట్లింగ్ వరకు మొత్తం ప్రక్రియను సందర్శకులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించడంతో పాటు సంప్రదాయ పద్ధతిలో ద్రాక్షను తొక్కే ‘గ్రేప్ స్టాంపింగ్’ అనుభూతిని కూడా పొంద‌వ‌చ్చ‌న్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe