TGGENCO Yadadri Power Plant : తెలంగాణ రాష్ట్ర ఇంధన రంగంలో మరొక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) విద్యుత్ ఉత్పత్తి దిశగా ఒక అద్భుతమైన మైలురాయిని దాటింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) పర్యవేక్షణలో నడుస్తున్న ఒడిశాలోని ప్రతిష్టాత్మక 'నైనీ' బొగ్గు గని నుండి సేకరించిన అత్యంత నాణ్యమైన బొగ్గుతో కూడిన మొదటి రైల్వే రేక్ (మాల్‌గాడి) మంగళవారం ప్లాంట్‌కు చేరుకుంది. సుమారు 4,000 టన్నుల లోడుతో వచ్చిన ఈ తొలి బొగ్గు రైలుకు టీజీజెన్‌కో అధికారులు ఘన స్వాగతం పలికారు.

నైనీ బ్లాక్ నుండి వచ్చిన ఈ బొగ్గు అత్యధిక ఉష్ణ సామర్థ్యం (High-Calorific Value) కలిగి ఉంటుంది. రాష్ట్ర ప్రజల ఇంధన అవసరాలను తీర్చడానికి మరియు ప్లాంట్‌లో గరిష్ట సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు.
1,050 కిలోమీటర్ల సుదూర రవాణా….
ఒడిశాలోని నైనీ గని నుండి యాదాద్రి ప్లాంట్‌కు సుమారు 1,050 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ఉంది. అంతటి సుదూర ప్రయాణం చేసి బొగ్గును రవాణా చేయడం సవాలుతో కూడుకున్నప్పటికీ…. ఈ బొగ్గులోని విశిష్ట గుణాలు ఆ వ్యయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాయని నిపుణులు తెలిపారు. ఈ బొగ్గు వాడటం వల్ల బాయిలర్ల పనితీరు గణనీయంగా మెరుగుపడటమే కాకుండా, విద్యుత్ ఉత్పత్తి సమయంలో వచ్చే బూడిద సమస్యలు చాలావరకు తగ్గుతాయి. టీజీజెన్‌కో, సింగరేణి , భారతీయ రైల్వేల మధ్య నెలకొన్న అద్భుతమైన సమన్వయం వల్ల ఈ సుదూర బొగ్గు రవాణా సాఫీగా సాధ్యమైందని అధికారులు కొనియాడారు.
రాబోయే రోజుల్లో నైనీ మైన్ నుండి నిరంతరాయంగా రోజువారీ బొగ్గు రేకులు యాదాద్రి ప్లాంట్‌కు రానున్నాయి. దీనివల్ల వైటీపీఎస్‌లో ఎల్లప్పుడూ తగినంత బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంటాయి. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, గృహ అవసరాలకు ఎలాంటి కోతలు లేకుండా నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడానికి పూర్తి గ్యారెంటీ లభించిందని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.