మద్యంతోపాటుగా ఎక్కువ ఫుడ్ తీసుకోవడమే ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మృతికి కారణం!
మద్యంతాగి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మృతి చెందిన ఘటన ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో విషయాన్ని పోలీసులు వెల్లడించారు.
అన్నమయ్య జిల్లాలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అధికంగా మద్యం సేవించి మృతిచెందారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే మద్యంతోపాటుగా మరో కారణం కూడా వారు మృతిచెందడానికి కారణమైంది. అధికంగా మద్యం సేవించడం, అతిగా ఆహారం తినడం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మృతి చెందడానికి కారణం అని పోలీసు అధికారి తెలిపారు.

మరణించిన మణి కుమార్ (35), పుష్పరాజ్ (27) జనవరి 17న అదే గ్రామానికి చెందిన తమ నలుగురు స్నేహితులను కలుసుకుని చాలా గంటలపాటు కలిసి బీర్లు తాగారు. 'అన్నమయ్య జిల్లాకు చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు స్నేహితులతో కలిసి మద్యం సేవించిన తర్వాత ఆహారం ఎక్కువగా తినడం కారణంగా మరణించారు.' అని రాయచోటి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ) కృష్ణ మోహన్ పీటీఐకి తెలిపారు.
నలుగురు స్నేహితులు 19 బీర్ సీసాలను కొనుగోలు చేసి మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7.30 గంటల మధ్య వాటిని తాగారు. ఈ సమయంలో వారు ఫుడ్ కూడా అధికంగా తీసుకున్నారు. మణికుమార్ ఆరు బీర్ సీసాలు తాగగా, పుష్పరాజ్ ఐదు సీసాలు తాగాడని పోలీసులు తెలిపారు.
ఇంటికి తిరిగి వస్తుండగా కుమార్ కుప్పకూలిపోయాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత స్నేహితులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ కుమార్ మొదట మరణించగా, పుష్పరాజ్ రాత్రి 10 గంటల ప్రాంతంలో మరణించాడని కృష్ణ మోహన్ చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమార్ బీరు తాగడం కంటే ముందే మద్యం సేవించి ఉన్నాడు. ప్రాథమిక దర్యాప్తులో అధికంగా మద్యం సేవించడం, ఆహారం ఎక్కువ తీసుకోవడం వలన శ్వాసకోశ సమస్య తలెత్తిందని తేలింది.
జనవరి 18న, కుమార్ తండ్రి నరసింహ మరణానికి కారణం తెలియదని పేర్కొంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 కింద కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపామని, ఉపయోగించిన బీర్ సీసాల నమూనాలను ప్రయోగశాల పరీక్ష కోసం పంపామని చెప్పారు. ఇందులో ఎటువంటి మలినాలు లేవని తేలిందని డీఎస్పీ తెలిపారు. మృతుడి రక్తం, ఇతర నమూనాలను మరింత విశ్లేషణ కోసం ప్రయోగశాలకు పంపినట్లు వెల్లడించారు.
సంక్రాంతి పండుగ సమయంలో ఇద్దరు వ్యక్తులు మరణించడం స్థానికంగా కలకలం రేపింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు బీర్లు తాగడంతో డీహైడ్రేషన్‌కు కూడా గురయ్యారు. అధికంగా ఆహారం తీసుకోవడంతో శ్వాస సమస్య తలెత్తిందని పోలీసులు చెబుతున్నారు. మణికుమార్‌కు భార్య, రెండేల్ల కుమారుడు ఉన్నారు. పుష్పరాజ్‌కు ఇంకా పెళ్లి కాలేదు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


