Vijayawada Night Boating : పర్యాటక రంగానికి మరింత ఊపునిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని కృష్ణా నదిలో రాత్రివేళ బోటు షికారు (నైట్ క్రూజింగ్) చేసేందుకు పర్యాటక శాఖకు జలవనరుల శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు (GO) జారీ అయ్యాయి.

ఈ కొత్త నిర్ణయంతో పర్యాటకులు అమరావతి రాజధాని ప్రాంతం, పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ పరిసరాల్లో రాత్రి 10 గంటల వరకు కృష్ణా నదిలో హాయిగా విహరించవచ్చు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) ఆధ్వర్యంలో ఈ బోటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
భద్రత విషయంలో కఠిన నిబంధనలు
పర్యాటకుల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ఈ అనుమతులతో పాటు అనేక కఠిన నిబంధనలను విధించింది. నది పరివాహక ప్రాంతం, నీటి విడుదల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తూనే ఈ విహారానికి అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.
- ప్రకాశం బ్యారేజ్ గేట్ల నిర్వహణ, నీటి ప్రవాహ నియంత్రణకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో లేదా నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు బోటింగ్ సేవలను తక్షణమే నిలిపివేస్తారు.
- వరద ప్రమాదం, ప్రతికూల వాతావరణం లేదా జలవనరుల శాఖ హెచ్చరికలు జారీ చేసిన సమయంలో రాత్రిపూట బోటింగ్ నిర్వహించడానికి వీల్లేదు.
- బోట్లు ప్రయాణించే మార్గాన్ని ప్రకాశవంతమైన వెలుగులు చిమ్మే లైటింగ్ సూచికలు , బ్లింకర్లతో స్పష్టంగా గుర్తించాలి. ఈ కేటాయించిన మార్గం దాటి బోట్లు మరెక్కడికీ వెళ్లకూడదు.
- కృష్ణా నదిపై ఆధారపడి జీవించే స్థానిక మత్స్యకారుల హక్కులకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలి. వారి చేపల వలలకు ఎలాంటి నష్టం కలగకుండా పర్యాటక శాఖ తగిన జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.
- ప్రకాశం బ్యారేజీకి ఎగువన 1000 మీటర్ల (1 కిలోమీటరు) పరిధిలో ఎలాంటి బోట్లనూ అనుమతించబోరు.
ఈ నిబంధనలన్నీ కచ్చితంగా పాటిస్తూ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ రాత్రి శోభను, కృష్ణా నది అందాలను తిలకించాలనుకునే వారికి ఇది నిజంగా మంచి అవకాశమని చెప్పవచ్చు.
{{/usCountry}}ఈ నిబంధనలన్నీ కచ్చితంగా పాటిస్తూ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ రాత్రి శోభను, కృష్ణా నది అందాలను తిలకించాలనుకునే వారికి ఇది నిజంగా మంచి అవకాశమని చెప్పవచ్చు.
{{/usCountry}}