...
...
Next Story

కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ - ఓటు హక్కు వినియోగించుకున్న మేయర్ అభ్యర్థులు, నవంబర్ 3న ఓట్ల లెక్కింపు

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో పలువురు ప్రముఖులు, మేయర్ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరాల అభివృద్ధి కోసం ఓటర్లు తరలివచ్చి ఓటు వేయాలని నాయకులు పిలుపునిచ్చారు. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Published on: Nov 1, 2026, 11:07:28 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికల పోలింగ్‌లో పలువురు రాజకీయ నాయకులు, మేయర్ అభ్యర్థులు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం జరుగుతున్న ఈ ఓటింగ్ ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములై తమ రాజ్యాంగబద్ధమైన హక్కును నెరవేర్చాలని వారు పిలుపునిచ్చారు.

ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు…

ఓటు హక్కును వినియోగించుకున్న మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా
ఓటు హక్కును వినియోగించుకున్న మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా

విశాఖపట్నం ఎంపీడీవో కార్యాలయం పరిధిలోని ఏయూ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి తన ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, సామాన్యుడి చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు అని అభివర్ణించారు. విశాఖ నగరాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ఏజెంట్లకు ఫారాలు అందలేదని ఆరోపించిన కళ్యాణి, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరొకవైపు… విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్‌లో కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. పౌరులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని ఆయన కోరారు.

విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్ (చిన్ని) విజయవాడలోని లోయోలా కాలేజీ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. "ఓటు అనేది కేవలం వేలిపై పడే సిరా చుక్క మాత్రమే కాదు, మన నగర భవిష్యత్తును నిర్ణయించే శక్తివంతమైన నిర్ణయం" అని పేర్కొన్నారు. ఆదివారాన్ని కేవలం సెలవు దినంగా భావించి విశ్రాంతి తీసుకోకుండా, మన ఊరు, మన నగరం ఎలా ఉండాలో కలలు కనే విజన్ ఉన్న నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అభివృద్ధి కోసం పరితపించే ప్రజాప్రతినిధులను ఆలోచించి ఎన్నుకోవాలని, అర్హులైన ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని ఎంపీ పిలుపునిచ్చారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి వసుంధరతో కలిసి శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం చౌడేశ్వరి కాలనీలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలతో కలిపి మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థలలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వానికి ఈ ఎన్నికలు మొదటి ప్రధాన మధ్యంతర రాజకీయ పరీక్షగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎన్నికల్లో ఓటు వేసేందుకు వైసీపీ అధినేత జగన్ పులివెందులకు చేరుకున్నారు. జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించటంతో.. కాసేపు గాల్లోనే జగన్ హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత అనుమతి రావటంతో ల్యాండింగ్ అయింది.

ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం ఎంతంటే..

ఉదయం 9 గంటల వరకు 8.39 శాతం పోలింగ్ నమోదైంది. మార్కాపురంలో 19.47 శాతం పోలింగ్ నమోదు కాగా… రాష్ట్రంలో ప్రస్తుతానిక అత్యల్పంగా గుంతకల్‌లో 2.95 శాతం పోలింగ్ నమోదైంది.

రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న జీవీఎంసీలో 18.37 లక్షల మందికి గాను 61,309 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయవాడలో 8.05 లక్షల మంది ఓటర్లకు గాను 62,740 మంది ఓటింగ్ చేశారు. గుంటూరులో 6.18 లక్షల మంది ఓటర్లకు గాను 32,237 ఓట్లు నమోదు కాగా… కర్నూలులో 53,504 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం తర్వాత పోలింగ్ శాతాలప

నవంబర్ 3న ఓట్ల లెక్కింపు…

నవంబరు 1న పోలింగ్ ముగిసిన తర్వాత… అవసరమైన చోట నవంబరు 2న రీపోలింగ్ నిర్వహిస్తారు. నవంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. నామినేషన్ల ఘట్టంలో అక్కడక్కడా టీడీపీ, వైఎస్సార్‌సీపీ శ్రేణుల మధ్య చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకోవడంతో, పోలింగ్ ఎలాంటి హింస లేకుండా ప్రశాంతంగా ముగిసేందుకు 4,372 పోలింగ్ ప్రాంతాల్లో మొత్తం 36,000 మందికి పైగా పోలీసు బలగాలను భద్రత కోసం మోహరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks