ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. సవరించిన షెడ్యూల్ విడుదల.. కొత్త తేదీలు ఇవే

AP Municipal Elections : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికలను వాయిదా వేసిన ఎస్ఈసీ.. కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది.

Published on: Oct 23, 2026, 05:57:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ సవరించిన నూతన షెడ్యూల్‌ను గురువారం రాత్రి అధికారికంగా విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

తాజా షెడ్యూల్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 నగరపాలక సంస్థలు (కార్పొరేషన్లు), 87 పురపాలక సంఘాలు (మున్సిపాలిటీలు)/నగర పంచాయతీలకు నవంబరు 1వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో నవంబరు 2న రీపోలింగ్ పూర్తి చేసి, నవంబరు 3వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.

ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు, భౌతిక దాడులు ఎదుర్కొని నామినేషన్ పత్రాలు చించివేత వంటి అక్రమాల వల్ల కొందరు అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని ఎస్‌ఈసీ గుర్తించింది. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రతి ఒక్కరికీ పోటీ చేసే అవకాశం కల్పించేందుకు గాను మొత్తం 72 వార్డులు/డివిజన్లకు కొత్తగా నామినేషన్లు స్వీకరించాలని నిర్ణయించింది.

గతంలో వాయిదా పడిన మైదుకూరు మున్సిపాలిటీ మున్సిపాలిటీలోని మొత్తం 32 వార్డులకూ నామినేషన్ల గడువు పొడిగించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంతో రాజంపేట మున్సిపాలిటీ 11 వార్డులకు తిరిగి నామినేషన్ల అవకాశం కల్పించారు. కడప కార్పొరేషన్‌లో 11 డివిజన్లలో నూతనంగా నామినేషన్లు స్వీకరిస్తారు. తిరుపతి కార్పొరేషన్ 18 డివిజన్లలో అభ్యర్థులు పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు.

అభ్యర్థుల సౌకర్యార్థం, భద్రత దృష్ట్యా ఈ స్థానాలకు గతంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలతో పాటు, అదనంగా సంబంధిత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణాల్లోనూ నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మిగిలిన స్థానాల్లో నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ క్రింది విధంగా సాగనుంది:

నామినేషన్ల స్వీకరణ: అక్టోబరు 23, 24 తేదీలలో

నామినేషన్ల పరిశీలన: అక్టోబరు 25 ఉదయం

అక్టోబరు 25 నామినేషన్ల ఉపసంహరణకు గడువు, అదే రోజు సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ

పోలింగ్ తేదీ: నవంబరు 1

రీపోలింగ్ (అవసరమైతే): నవంబరు 2

ఓట్ల లెక్కింపు (కౌంటింగ్): నవంబరు 3

తొలివిడతలో 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలకు తొలిసారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అక్టోబరు 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించి, 21న ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. అయితే తమ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారంటూ వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ పిటిషన్‌పై సమగ్ర విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను అక్టోబరు 25 వరకు నిలిపివేయాలని ఆదేశించింది. బాధితులు సమర్పించిన వినతులు, ఎలక్ట్రానిక్ ఆధారాలు, నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎస్‌ఈసీకి స్పష్టం చేసింది. శాంతిభద్రతల సమస్యల వల్ల పోటీకి దూరమైన వారికి కనీసం 48 గంటల సమయం ఇచ్చి నామినేషన్ల స్వీకరణకు పునరుద్ధరించాలని సూచించడంతో ఈ సవరించిన షెడ్యూల్ వెలువడింది.

కోర్టు ఆదేశాల ప్రకారం కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీల నుంచి సమగ్ర నివేదికలు తెప్పించుకున్న ఎన్నికల కమిషన్, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More