విశాఖ సీఐఐ సమ్మిట్ : 3 రోజుల్లో 613 ఎంఓయూలు - రూ. 13,25,716 కోట్ల పెట్టుబడులు

విశాఖ వేదికగా నిర్వహించిన సీఐఐ భాగస్యామ్య సదస్సు ముగిసింది. 12 రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. గడిచిన 3 రోజుల్లో రూ. 13,25,716 కోట్ల పెట్టుబడులు రాగా.. 613 ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు పేర్కొంది.

Published on: Nov 16, 2025, 07:05:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విశాఖ వేదికగా తలపెట్టిన సీఐఐ భాగస్యామ్య సదస్సుకు అంచనాలకు మించిన స్థాయిలో పెట్టుబడులపై ఎంఓయూలు కుదిరాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో ఎంఓయూలు కుదిరాయి. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదే స్థాయిలో ఉద్యోగాల కల్పనపై కంపెనీల నుంచి హామీలు వచ్చాయి.

విశాఖ సమ్మిట్ బిగ్ హిట్
విశాఖ సమ్మిట్ బిగ్ హిట్

మూడు రోజుల పాటు కుదుర్చుకున్న ఒప్పందాల విలువ రూ. 13,25,716 కోట్ల పెట్టుబడులు కాగా వీటి ద్వారా 16,31,188 ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశాలు కన్పిస్తున్నాయి. వాస్తవానికి భాగస్వామ్య సదస్సులో భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ముందుగానే అంచనా వేసింది. రెండు రోజుల్లో సుమారుగా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావించింది. కానీ ప్రభుత్వ అంచనాల కంటే ఎక్కువ ఒప్పందాలు కుదిరాయి. వీటి ఒప్పందాల విలువ రూ. 13 లక్షల కోట్లకు పైగా చేరింది. దీంతో ప్రభుత్వ వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది.

అంచనాలకు మించి….!

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ పారిశ్రామికాభివృద్ధి మీద ఫోకస్ పెట్టింది. ప్రతి 15 రోజులకోసారి కెబినెట్ సమావేశాలు పెట్టుకున్న తరహాలో ఎస్ఐపీబీ సమావేశాలు పెట్టుకుంది. వివిధ సంస్థలకు పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో విశాఖ భాగస్వామ్య సదస్సు నాటికే సుమారుగా రూ. 10 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏపీపై పారిశ్రామిక వర్గాల్లో నమ్మకం కలగడానికి ఇదే నిదర్శనం అని ప్రభుత్వం వివిధ సందర్భాల్లో చెబుతూనే ఉంది.

దీన్ని మరింతగా కొనసాగించాలని... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చేలా చూడాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం విశాఖ తీరాన భాగస్వామ్య సదస్సును చేపట్టాలని ప్లాన్ చేసింది. దీనికి అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్, యూఏఈ, లండన్ వంటి దేశాల్లో పర్యటించారు. అక్కడి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు.

పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. దీంతో భాగస్వామ్య సదస్సు నిర్వహించిన రెండు రోజుల్లో భారీగా పెట్టుబడులు వచ్చేలా ఉన్నాయని ప్రభుత్వం కూడా అంచనాతో ఉంది. అయితే మూడు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ రూ. 13 లక్షల కోట్లకు పైగా చేరడంతో అంచనాలను 100 శాతం చేరుకోవడంతోపాటు... అదనంగా మరో 30 శాతం మేర పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా మార్గం సుగమం అయింది.

సీఎం సమక్షంలోనే 123 ఎంఓయూలు…

మూడు రోజుల పాటు జరిగిన ఒప్పందాల్లో మొత్తంగా రూ. 13,25,716 కోట్ల ఒప్పందాలు జరిగితే... అందులో సగానికి పైగా ఒప్పందాలను ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగాయి. మూడు రోజుల పాటు చంద్రబాబు సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ రూ.7,63,210 పెట్టుబడులు. 123 ఎంఓయూల ద్వారా ఈ పెట్టుబడులు వచ్చాయి.

మూడు రోజుల పాటు జరిగిన ఎంఓయూల మేళాలో తొలి రోజున రూ. 3,65,304 కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. రెండో రోజున రూ. 3,49,476 కోట్లు... ఇక చివరి రోజున రూ.48,430 కోట్ల మేర ఎంఓయూలు కుదిరాయి. ఇక ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా భారీ ఎత్తునే పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొత్తంగా మంత్రులందరూ కలిసి 490 ఎంఓయూల ద్వారా రూ. 5,62,506 కోట్ల మేర పెట్టుబడులు కుదుర్చుకున్నారు.

మూడు రోజుల పెట్టుబడులపై జరిగిన వరుస సమావేశాలు.. భేటీల్లో అటు ముఖ్యమంత్రి.. ఇటు మంత్రులంతా కలిసి చేసుకున్న ఒప్పందాల ద్వారా 12 రంగాలకు పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడుల్లో టాప్-3లో ఇంధన రంగం, పరిశ్రమలు, మౌళిక వసతుల రంగాలు నిలిచాయి.

మొత్తంగా రూ. 13.25 లక్షల కోట్ల మేర పెట్టుబడుల్లో అధిక భాగం ఇంధన రంగానికి వచ్చాయి. ఈ రంగంలో రూ. 5,33,351 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత పరిశ్రమల రంగానికి రూ. 2,80,384 కోట్లు, మౌళిక వసతుల రంగానికి రూ. 2,01,758 కోట్లు వచ్చాయి. ఇక ఉద్యోగాల కల్పనకు సంబంధించి టాప్-3లో పరిశ్రమలు, మౌళిక వసతులు. ఐటీఈ అండ్ సీ రంగాలున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More