'నల్లమల సాగర్'తో తెలంగాణకూ లాభమే - అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

పోలవరం- నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. సాగునీటి రంగంపై శాసనసభలో మాట్లాడిన సీఎం… నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు.వంశధార నుంచి పెన్నా వరకూ రాష్ట్రంలో నదులను అనుసంధానిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని వ్యాఖ్యానించారు.

Published on: Feb 26, 2026, 18:43:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో ప్రతీ ఎకరాకూ నీరందించి తెలుగు తల్లికి జలహారతి ఇవ్వటమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులను పూర్తి చేసే అంశంపై త్వరలోనే బ్లూ ప్రింట్ తయారు చేస్తామని శాసనసభలో వెల్లడించారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

ఇవాళ సాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. 2047 స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా పదిసూత్రాలను రూపొందించుకుని నీటి భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని ఆయన అన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు రావాలన్నా నీటి భద్రత అత్యంత కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.

వచ్చే ఏడాది గోదావరి, మరుసటి ఏడాదిలో కృష్ణా పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహించే బాధ్యత కూటమి ప్రభుత్వానికి వచ్చిందని అన్నారు. ప్రకృతిని, నదులు, నీటి వనరులను ఆరాధించే సంస్కృతి ఉన్న నేపథ్యంలో గోదావరి నదికి అఖండ హారతిని, కృష్ణా నదికి పవిత్ర హారతి ఇచ్చి జలాలను అత్యంత విలువైన వనరులుగా భావించి బాధ్యతగా వ్యవహరిస్తున్నామని సీఎం అన్నారు.

ప్రతీ ఏటా గోదావరి నది నుంచి సగటున 3 వేల టీఎంసీల వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని అన్నారు. అందుకే రాష్ట్రంలోని వంశధార నుంచి పెన్నా వరకూ రాష్ట్రంలోని నదులను అనుసంధానిస్తే నీటి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. దేశంలోనూ గంగా- కావేరి నదుల అనుసంధానం జరగాలన్నది తన బలమైన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గతంలో వాజ్ పేయి ప్రభుత్వంలో గంగా- కావేరీ నదుల అనుసంధాన సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయన్నారు. అందుకే రాష్ట్రంలో నదులు అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

2014-19 మధ్య సాగునీటి రంగానికి రూ.68 వేల కోట్ల వ్యయం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గడిచిన 20 నెలల్లో రూ. 20 వేల కోట్లను ఈ రంగానికి వెచ్చించినట్టు తెలిపారు. 738 కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువను విస్తరించి కుప్పంలో పరమసముద్రం చెరువు వరకూ నీటిని తీసుకెళ్లామని అన్నారు. మడకశిర వరకూ నీటిని తీసుకెళ్లి ఆ ప్రాంత వాసుల దాహార్తిని తీర్చామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల న్నీ టీడీపీ, కూటమి హయాంలో నిర్మించినవేనని సీఎం స్పష్టం చేశారు.

వెలిగొండ పూర్తి చేసి మార్కాపురం, ప్రకాశం జిల్లా సహా వివిధ ప్రాంతాలకు న్యాయం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. 30 ఏళ్లకు ముందు ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని.. ఇప్పుడు ఈ ఏడాది జూలైలోనే మొదటి దశ పూర్తి చేసి నీళ్లు ఇస్తామని అన్నారు. ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఇంకా రూ.2500 కోట్ల మేర వ్యయం చేయాల్సి ఉందని .. బుధవారమే రూ.456 కోట్ల వ్యయంతో ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేసినట్టు వివరించారు.

రాష్ట్రంలోని అన్ని చిన్నా పెద్ద రిజర్వాయర్లలో 1312 టీఎంసీల మేర నిల్వ చేసుకునే అవకాశం ఉందని ప్రస్తుతం 793 టీఎంసీల మేర నీటితో రిజర్వాయర్లు కళకళ లాడుతున్నాయని సీఎం అన్నారు. అందుకే పంట సీజన్ ను ముందుకు జరిపేలా మే 15 నాటికే నారుమళ్లకు నీరు ఇచ్చేలా ప్రణాళిక చేస్తున్నామన్నారు. దీనికి అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధులంతా రైతులను చైతన్యవంతులను చేయాలని స్పష్టం చేశారు. 16 లక్షల హెక్టార్ల మైక్రో ఇరిగేషన్ తో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ ఉందని ముఖ్యమంత్రి వివరించారు.

రెండు రాష్ట్రాలకూ లాభమే - సీఎం చంద్రబాబు

పోలవరం - నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు చెప్పారు. పొరుగు రాష్ట్రం దీనిపై అభ్యంతరాలను తెలియచేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. గోదావరి నుంచి వృధాగా సముద్రంలోకి వెళ్లే వరద జలాలను మాత్రమే తరలించేలా ఈ ప్రాజెక్టు చేపట్టామని అన్నారు. గోదావరిపై ఎగువ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా.. దీనికి తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుతో రెండు తెలుగు రాష్ట్రాలకూ మేలు జరుగుతుందన్నారు.

గత పాలనలో గుండ్లకమ్మ గేట్లు కొట్టుకు పోతే వాటిని పెట్టేందుకు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని.. పోలవరం డయాఫ్రాం వాల్ కొట్టుకు పోయినా దానిని గుర్తించలేని పరిస్థితి సీఎం ఎద్దేవా చేశారు. తాను చేయని తప్పు కు అరెస్ట్ చేసిన తనను 53 రోజుల పాటు జైల్లో పెట్టారని సీఎం అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకూ నీరు ఇవ్వాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. నీటి భద్రతను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. కొందరు రాజకీయం కోసమే నీటి సమస్యల్ని తీసుకువస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతీ ఎకరాకు సాగునీరు, ప్రతీ ఇంటికీ సాగునీరు, పరిశ్రమలకు నీరు ఇచ్చేలా సంకల్పంతో పనిచేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More