ఏపీలో పీఎం సూర్య ఘర్ సోలార్ పవర్‌ను డిస్కమ్‌లు కొనుగోలు చేస్తాయి : మంత్రి గొట్టిపాటి

PM Surya Ghar Solar Power : ఏపీలో పీఎం సూర్య ఘర్ సోలార్ పవర్‌ను డిస్కమ్‌లు కొనుగోలు చేస్తాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సౌర విద్యుత్తు వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రణాళికలు వేస్తున్నట్టుగా తెలిపారు.

Published on: Mar 30, 2026, 22:32:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన లబ్ధిదారులు ఉత్పత్తి చేసే అదనపు విద్యుత్తును గృహ, వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ పంపిణీ సంస్థలు(DISCOMs) కొనుగోలు చేస్తాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రకటించారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో కలిసి భీమవరంలోని ఒక లబ్ధిదారుని నివాసంలో ఏర్పాటు చేసిన రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌ను మంత్రి రవి కుమార్ లాంఛనంగా ప్రారంభించారు.

పీఎం సూర్య ఘర్
పీఎం సూర్య ఘర్

లబ్ధిదారులను ఉద్దేశించి మంత్రి రవి కుమార్ మాట్లాడుతూ, PM-KUSUM పథకం కింద రైతులకు పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన సౌర విద్యుత్తు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించినట్టుగా తెలిపారు. సౌర విద్యుత్తు వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 2,000 సోలార్ కనెక్షన్లు, అలాగే వెనుకబడిన, ఇతర కులాలకు చెందిన కుటుంబాలకు 6,000 కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి రవి కుమార్ పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విద్యుత్ పనుల్లో వేగం పెంచాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా పీఎం సూర్యఘర్‌ కనెక్షన్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. భీమవరంలో పర్యటించిన మంత్రి.. ఏపీఈపీడీసీఎల్‌ ఉన్నతాధికారులతో వర్చువల్‌గా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వాడలో పీఎం సూర్యఘర్‌ పథకాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. అదే సమయంలో సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటులో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని అధికారులకు తెలిపారు.

ఈపీడీసీఎల్‌ పరిధిలో పీఎం కుసుమ్‌ ద్వారా 220 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో అవసరమైన భూ కేటాయింపుల నిమిత్తం జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.

వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి పెండింగ్ వ్యవసాయ కనెక్షన్లు పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఎస్‌ఎస్‌ పనులను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే 68 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఈ ఏడాది రైతులకు 11,719 వ్యవసాయ కనెక్షన్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు.

రానున్న గోదావరి పుష్కరాలకు ఈపీడీసీఎల్‌ అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టం చేశారు. పుష్కరాల సమయంలో విద్యుత్‌ శాఖకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనలో ఎక్కడా రాజీ పడొద్దని పేర్కొన్నారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ గోదావరి పుష్కరాలను జయప్రదం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More