108 ఎమర్జెన్సీ సర్వీస్ సంవత్సరానికి ఎన్ని లక్షల కాల్స్‌కు స్పందిస్తుందో తెలుసా?
ఏపీలో 108 సేవలు ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నాయి. 108 సర్వీస్ జూన్ 2025 నుండి మే 2026 మధ్య కాలంలో రికార్డు స్థాయిలో 7,78,799 కేసులను విజయవంతంగా నిర్వహించింది.
ఆంధ్రప్రదేశ్‌లో అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తూ, ప్రభుత్వం 108 అంబులెన్స్ సేవలను అత్యాధునిక సాంకేతికతతో ఆధునీకరించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన స్పందన, మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేశారు.

ఒక అధికారిక ప్రకటన ప్రకారం... 108 సర్వీస్ జూన్ 2025 నుండి మే 2026 మధ్య కాలంలో రికార్డు స్థాయిలో 7,78,799 కేసులను విజయవంతంగా నిర్వహించింది. ప్రమాదాలు జరిగినప్పుడు అత్యంత కీలకమైన 'గోల్డెన్ అవర్'లో బాధితులకు సకాలంలో వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసింది.
సరికొత్తగా రూపుదిద్దుకున్న 108 అంబులెన్స్ వాహనాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి, ఆసుపత్రులతో మెరుగైన సమన్వయం కోసం పలు సాంకేతికతలను జోడించారు. జీపీఎస్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్.. అంబులెన్స్ ఎక్కడ ఉందో ఖచ్చితంగా పర్యవేక్షించడం, రియల్-టైమ్ ట్రాఫిక్ నావిగేషన్, డిజిటలైజ్డ్ పేషెంట్ రికార్డ్స్ వంటి సాంకేతికతను 108 అందిపుచ్చుకుంది.
గడిచిన ఏడాది కాలంలో 108 సేవలు అందుకున్న వివిధ రకాల అత్యవసర కేసుల వివరాలు చూస్తే.. రోడ్డు ప్రమాదాలు 1,13,764, గర్భిణీల కేసులు 1,05,786, శ్వాసకోశ ఇబ్బందులు 97,118, గాయాలు 49,342, గుండె సంబంధిత సమస్యలు 45,951, స్పృహ తప్పి పడిపోవడం 40,553, కడుపు నొప్పి 34,532, విషప్రయోగం / పురుగుల మందు తాగడం 32,858, ఫిట్స్ / మూర్ఛ వ్యాధి 29,485, పక్షవాతం 20,278, నవజాత శిశువుల అత్యవసరాలు 14,007గా ఉన్నాయి.
కేసుల నిర్వహణ విభజన
ఇంటర్-ఫెసిలిటీ ట్రాన్స్‌ఫర్స్ (IFT): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) నుండి పెద్ద ఆసుపత్రులకు మెరుగైన చికిత్స కోసం 2,53,022 మంది రోగులను తరలించారు.
నాన్-IFT ఎమర్జెన్సీలు: నేరుగా క్షేత్రస్థాయి నుండి అత్యవసరంగా ఆసుపత్రులకు తరలించిన కేసులు 5,25,777.
మాతృత్వ, శిశు మరణాల తగ్గింపులో కీలక పాత్ర
సకాలంలో వైద్య సేవలు అందేలా చూడడం ద్వారా రాష్ట్రంలో మాతృత్వ, శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించడంలో 108 సేవలు కీలక పాత్ర పోషించాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా 1.05 లక్షలకు పైగా గర్భిణీలను సురక్షితంగా ఆసుపత్రులకు చేర్చడం విశేషం.
అంబులెన్స్‌లలో అడ్వాన్స్‌డ్ కార్డియాక్ కేర్
గుండెపోటు వచ్చే రోగుల కోసం 108 అంబులెన్స్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటిలో అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్స్ (AED) అందుబాటులో ఉంచారు. అంబులెన్స్ ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనే, అందులోని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు రోగి ఈసీజీ (ECG), ఇతర కీలక ఆరోగ్య సమాచారాన్ని నేరుగా ఆసుపత్రి వైద్యులకు చేరవేసే కమ్యూనికేషన్ టెక్నాలజీని ఇందులో ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ఈ అత్యవసర సేవలను విస్తరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కుటుంబాలకు 24 గంటల పాటు అండగా నిలుస్తూ, భరోసానిస్తున్న ఈ అప్‌గ్రేడెడ్ 108 సేవలపై ప్రజల నుండి విశేష ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


