ఏడాదిన్నరలో ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ - సీఎం చంద్రబాబు
ఏడాదిన్నరలో ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేయాలంటే… ప్రతి ఇంటికీ డిజిటల్ కనెక్టివిటీ ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

కీలక ఒప్పందం..
గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో కీలక సహకార ఒప్పందం కుదిరింది. సుమారు 5 లక్షల గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్-ఏబీఎన్‌పీ అమలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీలో ఏబీఎన్‌పీ అమలుకు రూ.2,432 కోట్ల మేర నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
ఏబీఎన్‌పీ కోసం ఆంధ్రప్రదేశ్ భారత్‌నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (APBIL) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం SPV ఏర్పాటు చేసింది. డిజిటల్ భారత్ నిధి-రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అంగీకారంతో నిధులు సమకూర్చి ప్రాజెక్టు అమలు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. సీఎం చంద్రబాబు, కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో డిజిటల్ భారత్ నిధి-ఏపీ ప్రభుత్వం మధ్య MoC కుదుర్చుకున్నారు. డిజిటల్ భారత్ నిధి అడ్మినిస్ట్రేటర్ శ్యామల్ మిశ్రా, రాష్ట్ర ఐ అండ్ ఐ శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు MoCపై సంతకాలు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఇన్ఫ్రా బలోపేతం, గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించేలా సహకార ఒప్పందం చేసుకున్నారు. త్వరిగతిన అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన, క్షేత్ర స్థాయి సమన్వయానికి పూర్తి సహకారం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 13,426 గ్రామ పంచాయతీల్లో ప్రాజెక్టు అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. 1,692 ఫేజ్-I పంచాయతీల్లోని నెట్ వర్క్ అప్ గ్రేడ్ చేయడం, 11,254 ఫేజ్-IIలోని గ్రామాల డిజటల్ కనెక్టివిటీని పూర్తి చేయడం... ఇక కొత్తగా ఏర్పడిన 480 గ్రామ పంచాయతీలకు కనెక్టివిటీ ఇచ్చేలా చర్యలు తీసుకోవడం వంటి వాటిపై ఈ ఏబీఎన్‌పీ ప్రాజెక్టుతో పని చేయనుంది.
3,942 గ్రామాల్లో డిమాండ్ ఆధారంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంచే అంశంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. డిజిటల్ కనెక్టివిటీ ద్వారా డిజిటల్ గవర్నెన్స్, ఆన్‌లైన్ విద్య, టెలిమెడిసిన్, డిజిటల్ చెల్లింపులు, ఈ-గవర్నెన్స్ వంటి సేవలను మరింత బలోపేతం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది.
డిజిటల్ కనెక్టివిటీని పెంచుతాం - సీఎం చంద్రబాబు
ఈ సహకార ఒప్పందం కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...”తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు బాండ్ విడ్త్ పెంచమని బీఎస్ఎన్ఎల్‌ను అడిగాను. పెంచిన బ్యాండ్ విడ్త్‌తో టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్సులు పెట్టేవాడిని. టెలికాం రంగంలో సంస్కరణలు తీసుకురావాలని నాటి ప్రధాని వాజ్ పేయిని కోరాను. అప్పట్లో జాతీయ స్థాయిలో కమిటీ వేస్తే టెలికాం రంగంలో సంస్కరణలు చేపట్టాలని నివేదిక ఇచ్చాం. ఆ తర్వాత దేశవ్యాప్తంగా డి-రెగ్యులేషన్ అమల్లోకి వచ్చింది. భారతదేశంలో డిజిటల్ విప్లవానికి, డిజిటల్ కనెక్టివిటీ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చక్కగా పని చేస్తున్నారు” అని ముఖ్యమంత్రి అన్నారు.
2014-19 మధ్య కాలంలో పైబర్ నెట్ వ్యవస్థను ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. కరెంట్ పోల్స్‌పై ఫైబర్ కేబుల్స్ వేసి కనెక్టివిటీ కల్పించామన్నారు.ఆ తర్వాత 2019లో వచ్చిన ప్రభుత్వం ఫైబర్ నెట్ వ్యవస్థను ఇబ్బందుల్లోకి నెట్టిందని విమర్శించారు. గత ప్రభుత్వం దురుద్దేశ్యంతో చేసిన నిర్వాకం వల్ల కనెక్షన్ల సంఖ్య 3.80 లక్షలకు పడిపోయిందని వ్యాఖ్యానించారు.
“ఇప్పుడు మళ్లీ కేంద్ర సహకారంతో డిజిటల్ కనెక్టివిటీని పెంచుతాం. వికసిత్ భారత్ 2047 దిశగా అడుగులు వేయడానికి ఈ చర్యలు ఉపకరిస్తాయి. ఏఐ-క్వాంటం టెక్నాలజీలకు ప్రధాని చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు.. అందుకే ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు నిర్వహించారు. ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు వివిధ దేశాల నుంచి దిగ్గజ కంపెనీలకు చెందిన ప్రముఖులు వచ్చారు. గ్లోబల్ నాలెడ్జిని గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకురావాలంటే బ్యాండ్ విడ్త్ పెరగాలి...దానికి కేంద్రం సహకరిస్తోంది” అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
"డిజిటల్ కనెక్టివిటీ ఉంటే ప్రజలకు సేవలు కూడా చాలా సులువుగా అందుతాయి. వాట్సాప్ ద్వారా 900కు పైగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. టెక్నాలజీతో పట్టాదార్ పాస్ పుస్తకాలను ముద్రించి భద్రత కల్పిస్తున్నాం. భూ రికార్డులకు బ్లాక్ చైన్ టెక్నాలజీతో సెక్యూర్టీ కల్పిస్తున్నాం. టెక్నాలజీని అనుసంధానించి ప్రజారోగ్య రంగంలో సంజీవని ప్రాజెక్టు అమలు చేయబోతున్నాం. ఏఐ సహకారంతో విద్య, వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. వివిధ ఏఐ అప్లికేషన్లను అందుబాటులోకి తెస్తాం. ఏఐతో ఉద్యోగాలు పోవడం కాదు.. ఉద్యోగాలు క్రియేట్ అయ్యేలా యువతలో నైపుణ్యం పెంచుతున్నాం” అని సీఎం చంద్రబాబు చెప్పారు.
"గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రాబోతోంది. విశాఖ నుంచి ఇతర దేశాలకు సబ్ సీ కేబుళ్ల ద్వారా డేటాను పంపే పరిస్థితి వస్తుంది. ఏపీలో 5 లక్షల మంది వర్క్ ఫ్రం హోం ద్వారా పని చేస్తున్నారు. పారిశ్రామిక విప్లవాన్ని భారత దేశం అందుకోలేకపోయింది.. సర్వీస్ రంగాన్ని అందుకున్నాం... అభివృద్ధి చెందుతున్నాం. ఏపీలో చాలా ప్రముఖ సంస్థలు, జీసీసీలు వస్తున్నాయి. వన్ ఫ్యామిలీ-వన్ ఏఐ ఎక్స్‌పర్ట్ అనే విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఐబీఎం-టీసీఎస్-ఎల్ అండ్ టి కన్సార్షియంతో దేశంలో తొలిసారి క్వాంటం కంప్యూటర్ తెస్తున్నాం. వచ్చే రెండు మూడేళ్లల్లో క్వాంటం కంప్యూటర్లను అమరావతి నుంచి ఉత్పత్తి చేయాలని ఆలోచన చేస్తున్నాం. బ్యూరోక్రసీ కూడా ఏఐలో నైపుణ్యం పెంచుకోవాలి. టెలికాం, టెక్నాలజీ రంగంలో ఎలాంటి ప్రయోగాలు చేయాలన్నా... టెస్ట్ బెడ్‌గా ఉండేందుకు ఏపీ సిద్దం” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

