AI summit 2026 : ఏఐ విప్లవంలో భారత్ సరికొత్త బెంచ్‌మార్క్ - ప్రధాని మోదీ

దిల్లీలోని భారత మండపం వేదికగా జరుగుతున్న ఏఐ సమిట్​ 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఏఐతో మనిషి సామర్థ్యం పెరుగుతోందన్నారు. ప్రధాని కన్నా ముందు ఫ్రాన్స్​ అధ్యక్షుడు మాక్రాన్​, గూగుల్​ సీఈఓ సైతం ఇదే వేదికగా ప్రసంగించారు.

Published on: Feb 19, 2026 10:58 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవాన్ని భారత్ ముందుండి నడిపిస్తోందని, "అందరి ఆనందం.. అందరి సంక్షేమం" అనేదే ఈ సాంకేతికతలో మన దేశం నిర్దేశించుకున్న ప్రమాణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దిల్లీలోని భారత్​ మండపంలో జరుగుతున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026' నాలుగో రోజున ఆయన ఈ మేరకు కీలక ప్రసంగం చేశారు. ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి, భారీ టెక్ టాలెంట్, టెక్నాలజీ ఆధారిత వ్యవస్థ కలిగిన భారత్ నేడు ప్రపంచానికి దిక్సూచిగా మారిందని ఆయన పేర్కొన్నారు.

ఏఐ సమిట్​లో వివిధ నేతలతో ప్రధాని మోదీ.. (@narendramodi)
ఏఐ సమిట్​లో వివిధ నేతలతో ప్రధాని మోదీ.. (@narendramodi)

ఈ ఈవెంట్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఫ్సాన్స్​ అధ్యక్షుడు మ్మాన్యుయేల్ మాక్రాన్, గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ సహా అనేక మంది నేతలు, టెక్​ లీడర్లు పాల్గొన్నారు.

మానవ నాగరికత గమనాన్ని మార్చేసే కొన్ని కీలక మలుపులు చరిత్రలో ఉంటాయని, ఏఐ అటువంటి ఒక గొప్ప పరివర్తనం అని ప్రధాని అభివర్ణించారు.

"ఏఐ కేవలం యంత్రాలకు తెలివితేటలను ఇవ్వడమే కాదు, మానవ సామర్థ్యాన్ని కొన్ని వేల రెట్లు పెంచుతోంది. ఏఐ ఏం చేయగలదు అన్నది కాదు.. ఏఐ సాయంతో మనిషి ఏం చేయగలడు? అనేది అసలు ప్రశ్న," అని ఏఐ సమిట్​ 2026లో మోదీ స్పష్టం చేశారు.

ఏఐ వినియోగంపై ప్రపంచానికి భారత్ ఒక స్పష్టమైన మార్గదర్శినిని అందించాలని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన 'మానవ్​' (MANAV) పేరుతో ఐదు సూత్రాల దార్శనికతను ఆవిష్కరించారు:

ఎం: నైతిక విలువలతో కూడిన వ్యవస్థ.

ఏ: జవాబుదారీతనంతో కూడిన పాలన.

ఎన్​: జాతీయ సార్వభౌమాధికారం.

ఏ: అందరికీ అందుబాటులో, సమ్మిళితంగా ఉండటం.

వీ: చెల్లుబాటు అయ్యే, చట్టబద్ధమైన విధానం.

భవిష్యత్తులో పనితీరు అనేది మానవ కేంద్రితంగా, నమ్మదగ్గదిగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. స్కిల్లింగ్ (నైపుణ్యం పెంచుకోవడం), రీ-స్కిల్లింగ్ (కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం), నిరంతర అభ్యాసాన్ని ఒక ప్రజా ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. అందరం కలిసి అడుగులు వేస్తే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మానవజాతి శక్తిని మరో స్థాయికి తీసుకెళుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మోదీ ప్రసంగం- లైవ్​ ఏఐ ట్రాన్స్​లేషన్​..

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ఆ మాటలు అప్పటికప్పుడు 'సైన్ లాంగ్వేజ్' (సంజ్ఞా భాష)లోకి అనువాదమయ్యాయి. సాంకేతికత సామాన్యుడికి, ముఖ్యంగా దివ్యాంగులకు ఎంత చేరువవుతుందో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.

ప్రధాని వేదికపై మాట్లాడుతుండగా, ఆయన వెనుక ఉన్న భారీ స్క్రీన్‌పై ఒక ఏఐ ఆధారిత యానిమేషన్ ప్రత్యక్షమైంది. ప్రధాని నోటి నుంచి వచ్చే ప్రతి మాటను ఆ యానిమేషన్ వెంటనే సైన్ లాంగ్వేజ్‌లోకి మారుస్తూ సైగలతో వివరించింది. ఏఐ ఆధారిత 'సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రిటేషన్' టెక్నాలజీని ఉపయోగించి ఇలా ప్రసంగాన్ని ప్రత్యక్షంగా అనువదించడం సదస్సులో పాల్గొన్న ప్రతినిధులను ఆశ్చర్యపరిచింది.

ఏఐ సమిట్​ 2026- ఫ్రాన్స్​ అధ్యక్షుడి ప్రసంగం..

దిల్లీలో జరుగుతున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026'లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గురువారం జరిగిన ఈ సదస్సులో ఆయన తన ప్రసంగాన్ని భారతీయులకు ఎంతో ఇష్టమైన 'నమస్తే'తో ప్రారంభించారు.

"భారతదేశం నేడు సాధించిన అద్భుతం ప్రపంచంలో మరే దేశం వల్ల సాధ్యం కాలేదు," అంటూ భారత్ సాధించిన డిజిటల్ పురోగతిని ఆయన ఆకాశానికెత్తారు. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో వచ్చిన మార్పును వివరించడానికి మాక్రాన్ ఒక ఆసక్తికరమైన ఉదాహరణను చెప్పారు.

"పదేళ్ల క్రితం ముంబైలోని ఒక సామాన్య వీధి వ్యాపారికి కనీసం బ్యాంక్ ఖాతా తెరిచే అవకాశం ఉండేది కాదు. సరైన అడ్రస్ ప్రూఫ్, కాగితాలు లేకపోవడంతో బ్యాంకింగ్ సేవలు అందేవి కావు. కానీ నేడు అదే వ్యాపారి తన ఫోన్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ స్వీకరిస్తున్నాడు. ఇది కేవలం సాంకేతిక విప్లవం మాత్రమే కాదు.. ఇది ఒక నాగరికత సాధించిన గొప్ప విజయం," అని ఆయన కొనియాడారు.

భారత్ తన వద్ద ఉన్న సరికొత్త టెక్నాలజీని సామాన్యులకు ఎలా చేరువ చేసిందో మాక్రాన్ విశ్లేషించారు.

డిజిటల్ గుర్తింపు: 140 కోట్ల మంది ప్రజలకు డిజిటల్ ఐడెంటిటీని అందించడం.

పేమెంట్ వ్యవస్థ: నెలకు 2,000 కోట్లకు పైగా డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న తీరు.

హెల్త్ ఐడీలు: 50 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ ఐడీలను జారీ చేయడం.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ.. "దీన్నే అందరూ 'ఇండియా స్టాక్' అని పిలుస్తారు. ఇది ఓపెన్, సావరిన్ వ్యవస్థ. మనం ఇప్పుడు ఒక భారీ సాంకేతిక వేగంలో ఉన్నాము," అని మాక్రాన్ ప్రశంసించారు.

ఏఐ సమిట్​ 2026- గూగుల్​ సీఈఓ ప్రసంగం..

ఏఐ సమిట్​ 2026లో పాల్గొన్న గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​.. ఇండియాకి రావడం చాలా అద్భుతంగా ఉందన్నారు. “దేశ పురోగతి నన్ను అబ్బురపరుస్తోంది,” అని ఆయన వ్యాఖ్యానించారు.

“నేను ఇండియాకి ఎప్పుడు వచ్చినా, ఇక్కడి అభివృద్ధి నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఈసారి కూడా అదే జరిగింది,” అని సుందర్​ పిచాయ్​ అన్నారు.

“డిజిటల్​ విభజనను ఏఐ విభజనగా మనం మార్చకూడదు. ఏఐ అనేది మన పనిని, పని చేసే విధానాన్ని కచ్చితంగా మార్చేస్తుంది,” అని ఆయన అన్నారు.

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నంలో గ్లోబల్​ ఏఐ హబ్​ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.

“విశాఖపట్నం.. ఒక్కప్పుడు ఇది తీర ప్రాంతం. కానీ ఇప్పుడు అంతర్జాతీయ ఏఐ హబ్​. 15 బిలియన్​ డాలర్ల పెట్టుబడిలో భాగంగా గూగుల్​ ఇక్కడ ఫుల్​ స్టాక్​ ఏఐ హబ్​ని ఏర్పాటు చేస్తుంది,” అని సుందర్​ పిచాయ్​ స్పష్టం చేశారు.

ఏఐ సమిట్​ 2026- టాటా గ్రూప్​ ఛైర్మన్​..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది ఐటీ సేవల రంగానికి ఎదురైన అతిపెద్ద అవకాశమని టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. గురువారం దిల్లీలోని భారత్ మండపంలో జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' ప్రారంభోత్సవంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్​) వంటి అగ్రగామి సంస్థల వ్యాపార నమూనాలనే ఈ ‘ఏఐ సాంకేతికత’ మార్చేస్తున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి

ఐటీ రంగం భవిష్యత్తుపై చంద్రశేఖరన్ స్పందిస్తూ.. "ప్రతి సంస్థ సందర్భాన్ని (కాంటెక్ట్స్​), వాటి అవసరాలను అర్థం చేసుకోవడమే ఐటీ పరిశ్రమ అసలైన విలువ. ఏఐ అనేది ఒక పునాది వంటి సాంకేతికత. గతంలో స్టీమ్​ ఇంజిన్​, విద్యుత్, ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఎలాగైతే ప్రభావితం చేశాయో, ఏఐ కూడా అంతటి లోతైన మార్పులను తీసుకువస్తుంది," అని వివరించారు.

ఏఐ సమిట్​ 2026 గురించి..

దిల్లీ భారత మండపం వేదికగా సోమవారం ప్రారంభమైన ఈ ఏఐ ఇంపాక్ట్​ సమిట్​ 2026 ఆరు రోజుల పాటు (“సార్వజన హిత, సార్వజన సుఖ” థీమ్​తో) సాగనుంది. ఇందులో 20 రాష్ట్రాలు, 100 కంపెనీల సీఈఓలు- ఫౌండర్లు సహా 500 అంతర్జాతీయ ఏఐ లీడర్లు పాల్గొంటున్నారు.