AI Summit 2026 : దిల్లీలో నేటి నుంచి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- షెడ్యూల్, అతిథుల వివరాలు..
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో సరికొత్త చరిత్రకు భారత్ నాంది పలికింది. దేశంలోనే మొట్టమొదటి 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' నేడు ఘనంగా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు, విధానకర్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొని ఏఐ భవిష్యత్తుపై చర్చించనున్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదిగేందుకు భారత్ సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ ఏఐ సదస్సు 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026' నేడు (ఫిబ్రవరి 16, సోమవారం) దిల్లీలోని భారత మండపం వేదికగా ఘనంగా ప్రారంభం కానుంది. ఈ నెల 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులు, దిగ్గజ సంస్థల అధిపతులు, ప్రభుత్వ ప్రతినిధులు హాజరుకానున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ వంటి ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026- రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
ఈ చారిత్రాత్మక సదస్సుకు ప్రత్యక్షంగా హాజరు కావాలనుకునే వారు 'డెలిగేట్'గా పేరు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం.
- అధికారిక వెబ్‌సైట్ లింక్‌ను సందర్శించి మీ వివరాలను నమోదు చేయాలి.
- నమోదు సమయంలో అభ్యర్థి డిజిటల్ ఫోటోను అప్‌లోడ్ చేయడం తప్పనిసరి.
- ఈమెయిల్ వెరిఫికేషన్ కోసం ఓటీపీ ప్రక్రియను పూర్తి చేయాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ ఈమెయిల్‌కు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ప్రవేశం వద్ద భద్రతా సిబ్బంది దీన్ని స్కాన్ చేసిన తర్వాతే అనుమతిస్తారు.
ముఖ్య గమనిక: ఫిబ్రవరి 19న ప్రధాని మోదీ ఈ సదస్సులో పాల్గొనే సమయంలో, భద్రతా కారణాల దృష్ట్యా డెలిగేట్లు కొన్ని ప్రత్యేక సెషన్లకు హాజరవ్వడానికి అనుమతి ఉండదు.
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026: ఐదు రోజుల పూర్తి షెడ్యూల్..
అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 ఐదు రోజుల కార్యాచరణ ఇలా ఉండనుంది:
ఫిబ్రవరి 16 (సోమవారం): కీలక ప్రసంగాలు, విధాన నిర్ణయాలపై ప్యానెల్ చర్చలు, నిపుణుల రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయి. ఇదే రోజున ‘ఇండియా ఏఐ ఎక్స్‌పో’ను కూడా ప్రారంభిస్తారు. దేశీయ అవసరాలు, ఏఐ వ్యూహాలపై నేడు ప్రాథమిక చర్చ జరగనుంది.
ఫిబ్రవరి 17 (మంగళవారం): ప్రాధాన్యత కలిగిన రంగాలపై లోతైన ప్యానెల్ చర్చలు కొనసాగుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం, ఇంధనం, విద్య, వ్యవసాయం, లింగ సాధికారత, వైకల్యాల నివారణ రంగాల్లో ఏఐ వినియోగంపై ప్రభుత్వం రూపొందించిన ఫ్లాగ్‌షిప్ ‘నాలెడ్జ్ కాంపెండియా’ను ఈ రోజు ఆవిష్కరించనున్నారు.
ఫిబ్రవరి 18 (బుధవారం): మూడవ రోజు పూర్తిగా పరిశోధన, ఆచరణాత్మక అంశాలపై దృష్టి సారిస్తారు. రీసెర్చ్ సింపోజియంతో పాటు గ్లోబల్ టెక్ లీడర్లు, స్టార్టప్‌లు తమ వినూత్న పరిష్కారాలను ప్రదర్శించే ఇండస్ట్రీ సెషన్లు జరుగుతాయి.
ఫిబ్రవరి 19 (గురువారం): ఇది సదస్సులో అత్యంత కీలకమైన రోజు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రధాన సదస్సు ప్రారంభోత్సవం జరుగుతుంది. అనంతరం గ్లోబల్ సీఈఓలు, ఇన్వెస్టర్లు, విధానకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. బాధ్యతాయుతమైన ఏఐ, పెట్టుబడుల మార్గాలపై ఇక్కడ చర్చిస్తారు.
ఫిబ్రవరి 20 (శుక్రవారం): ముగింపు రోజున గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జీపీఏఐ) సభ్యుల మధ్య కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి. ఏఐ అభివృద్ధిలో అంతర్జాతీయ సహకారంపై ఇక్కడ తుది నిర్ణయాలు తీసుకుంటారు.
BioAsia 2026 : ఈనెల 17 నుంచి హైదరాబాద్ వేదికగా ‘బయో ఆసియా’ సదస్సు
ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026- అతిరథ మహారథులు వీరే!
సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్‌మాన్‌లతో పాటు టెక్ ప్రపంచంలోని మరికొందరు ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. వారు..
డెమిస్ హసాబిస్ (గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ)
ముకేశ్ అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత)
సలీల్ పరేఖ్ (ఇన్ఫోసిస్ సీఈఓ)
క్రిస్టియానో అమోన్ (క్వాల్‌కామ్ ప్రెసిడెంట్ & సీఈఓ)
కే కృతివాసన్ (టీసీఎస్ సీఈఓ)
జూలీ స్వీట్ (అక్సెంచర్ చైర్ అండ్ సీఈఓ)
డారియో అమోడెయ్ (ఆంత్రోపిక్ సీఈఓ)
సునీల్ భారతి మిట్టల్ (భారతి ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు)
అలెగ్జాండర్ వాంగ్ (మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్)
ఎన్వీడియా వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ అనివార్య కారణాల వల్ల ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












