Tirumala Updates : అక్టోబర్ 26న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ - మాడ వీధుల్లో దర్శనమివ్వనున్న శ్రీమలయప్ప స్వామి

Tirumala Pournami Garuda Seva : తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 26న పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేయనున్నారు.

Published on: Oct 24, 2026, 10:22:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Tirumala Pournami Garuda Seva : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 26వ తేదీన పౌర్ణమి గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వం సిద్ధం చేసింది. పవిత్రమైన పౌర్ణమి ఘడియల సందర్భాన్ని పురస్కరించుకుని ఈ విశేష వాహన సేవను చేపట్టనున్నారు.

తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ
తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

మాడ వీధుల్లో ఊరేగనున్న శ్రీనివాసుడు

అక్టోబర్ 26న రాత్రి 7 గంటల నుంచి 9 గంటల నడుమ పౌర్ణమి గరుడ సేవ కన్నులపండువగా సాగనుంది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు సువర్ణ కాంతులతో భాసిల్లే గరుడ వాహనంపై వేంచేసి తిరుమల తిరుమాడ వీధులలో ఊరేగనున్నారు. ఈ పవిత్ర సమయంలో తిరువీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు.

సప్తగిరీశుడి వాహనాల్లో గరుడ వాహన సేవ అత్యంత విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు. ప్రతి నెల పౌర్ణమి రోజున నిర్వహించే ఈ సేవను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివస్తారు.

గరుడ వాహనంపై విహరించే శ్రీనివాసుడిని దర్శించుకోవడం వల్ల పాపాలు తొలగి, సర్వ శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. గరుడ సేవ నేపథ్యంలో మాడ వీధుల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు, భద్రతా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

న్యూ ఢిల్లీ ఎస్వీ ఆలయంలో పవిత్రోత్సవాలు :

మరోవైపు న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అక్టోబర్ 30 నుండి నవంబర్ 01వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగా 29వ తేదీ గురువారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అక్టోబర్ 30న పవిత్ర ప్రతిష్ఠ, స్నపన తిరుమంజనం, 31న పవిత్ర సమర్పణ, నవంబర్ 01న మహా పూర్ణాహుతి, చక్రస్నానం నిర్వహించనున్నారు. చివరి రోజు సాయంత్రం నాలుగు మాడ వీధులలో స్వామివారి తిరుచ్చి వీధి ఉత్సవం నిర్వహిస్తారు.

ఆలయంలో నిత్యం నిర్వహించే అర్చనలు, ఆర్జిత సేవలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు తదితర వైదిక క్రతువుల్లో తెలిసీ తెలియక సంభవించే దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో అంకురార్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ఠ, విశేష హోమాలు, పవిత్ర సమర్పణ, పూర్ణాహుతి తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. తద్వారా స్వామివారి కృపాకటాక్షాలు భక్తులపై ప్రసరించి, సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More