10 జిల్లాల్లో 20కు పైగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి ప్రతిపాదనలు.. అతిపెద్ద ఉద్యాన క్లస్టర్‌గా రాయలసీమ

10 జిల్లాల్లో 20కు పైగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి ప్రతిపాదనలు చేసింది ఏపీ ప్రభుత్వం. పూర్వోదయ నిధులతో సమగ్రాభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

Published on: Jan 27, 2026, 17:46:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

10 జిల్లాలను ఉద్యాన రంగానికి కేంద్ర బిందువుగా చేపట్టే సమీకృత అభివృద్ధి ప్రణాళికలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. దానికి అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పతులను పండించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం సూచించారు.

చంద్రబాబు సమావేశం
చంద్రబాబు సమావేశం

త్వరగా పూర్తి చేయాలి

'పూర్వోదయ, సాస్కీ, రాష్ట్ర ప్రభుత్వ నిధుల వినియోగంలో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఇదే సమయంలో సీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.' అని చంద్రబాబు ఆదేశించారు.

వెలిగొండ ఈ ఏడాది పూర్తి చేయాలి

చాలా వరకు ప్రాజెక్టులను గతం ప్రభుత్వం పెండింగులో పెట్టేసిందని మంత్రులు నిమ్మల, పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. 10 జిల్లాల పరిధిలో ప్రాధాన్యతల వారీగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని... అలాగే తక్కువ నిధులను కేటాయిస్తే త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులను తొలుత చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

గాలేరు-నగరి ప్రాజెక్టు

గాలేరు-నగరి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను కడప వరకు తీసుకెళ్లే అంశంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ దిశగా సుమారు 20కు పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. మొత్తంగా ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 8.87 లక్షల ఎకరాల ఆయకట్టు, అలాగే 4.30 లక్షల ఎకరాల స్థిరీకరణకు నీళ్లు అందించవచ్చని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా

'సీమ ప్రాజెక్టులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ప్రాజెక్టులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. పోలవరం కుడి కాల్వ పనులు పూర్తి అయితే గోదావరి జలాలను ఉత్తరాంధ్ర వరకు తీసుకెళ్లవచ్చు. అప్పుడు పోలవరం-వంశధార నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టవచ్చు. ఈలోగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రాధాన్యతల వారీగా నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి.' అని ముఖ్యమంత్రి సూచించారు.

అతిపెద్ద ఉద్యాన క్లస్టర్‌గా రాయలసీమ

ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఉద్యాన పంటల సాగు అపారంగా పెరిగే అవకాశం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. మొత్తం 10 జిల్లాల్లోని 201 క్లస్టర్లు, 303 మండలాల్లో ఉద్యాన పంటలను అభివృద్ధి చేసేలా ప్రతిపాదించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రికి తెలిపారు. ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని మూడేళ్లల్లో 8.41 లక్షల హెక్టార్ల నుంచి 14.41 లక్షల హెక్టార్లకు విస్తరించేలా ప్రణాళికలు చేపట్టినట్టు వివరించారు. రాయలసీమ ప్రాంతం ఉద్యాన ఉత్పత్తుల విషయంలో దేశంలోనే అగ్ర స్థానంలో ఉందని... ప్రపంచంలోనే అతిపెద్ద క్లస్టర్ గా రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాలను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.

కనెక్టివిటీ మెరుగుపరచాలి

దుబాయికి చెందిన డీపీ వరల్డ్ సంస్థ ఏపీలో ఉద్యాన క్లస్టర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని ముఖ్యమంత్రి సమావేశంలో వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో రాయలసీమ ప్రాంతం ఉద్యాన రంగంలో అభివృద్ధి చెందడానికి ఆస్కారం మెండుగా కన్పిస్తోందని.. దీనికి అనుగుణంగా ఎకో సిస్టం డెవలప్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. దీంట్లో భాగంగా అంతర్జాతీయ విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. అలాగే స్థానికంగా ఉద్యాన రంగ అభివృద్ధికి అవసరమైన రూరల్ రోడ్ నెట్ వర్క్, లాజిస్టిక్స్, మార్కెట్ కనెక్టివిటీ, గ్లోబల్ కనెక్టివిటీ వంటి అంశాలపై ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.

పూర్వోదయ ద్వారా వచ్చే నిధులతో పాటు ఉద్యాన రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను సాధించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పోర్ట్ కనెక్టివిటీ, గోదాములు, కోల్డ్ చైన్ తదితర లాజిస్టిక్స్ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

10 జిల్లాల్లో ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయనున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు

  • వెలిగొండ ప్రాజెక్ట్
  • కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
  • పాలేరు రిజర్వాయర్
  • మల్లెమడుగు లిఫ్ట్-రిజర్వాయర్
  • శ్రీ బాలాజీ రిజర్వాయర్
  • కుప్పం బ్రాంచ్ కెనాల్
  • పుంగనూరు బ్రాంచ్ కెనాల్
  • మూలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
  • హంద్రీ-నీవా ప్రధాన కాల్వ పనులు
  • అట్లూరుపాడు-మెర్లపాక ఎస్ఎస్ఎల్సీ
  • నీవా బ్రాంచ్ కెనాల్ పనులు
  • జీడిపల్లి-భైరవానితిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ పథకం
  • జీడిపల్లి-అప్పర్ పెన్నార్ ఎత్తిపోతలు
  • అనంతలో కమ్యూనిటీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్
  • మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులు
  • పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
  • కడప, కోడూరు వరకు గాలేరు-నగరి సుజల స్రవంతి
  • అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్దరణ పనులు
  • పశ్చిమ కర్నూలుకు నీళ్లిచ్చేలా వేదవతి-అలగనూరు-గాజులదిన్నె ప్రాజెక్టులు
  • ఏడు జిల్లాల్లో 1011 మైనర్ ఇరిగేషన్ చెరువుల అభివృద్ధి
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More