Tirumala Swami Pushkarini Closure : కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో అత్యంత పవిత్రమైన స్వామి పుష్కరిణి నీటి శ్సుద్ధి, మరమ్మతు పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సమాయత్తమవుతోంది. ప్రతి ఏటా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పుష్కరిణికి మరమ్మతులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు నెల రోజుల పాటు పుష్కరిణి మరమ్మతు పనులను చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది.

ఈ ఏడాది సెప్టెంబరు 15వ తేదీ నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల నాటికి పుష్కరిణిని సర్వాంగ సుందరంగా, పవిత్రంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పుష్కరిణిలోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి, అడుగున ఉన్న పూడికను తొలగించి… పైపింగ్ వ్యవస్థను పునరుద్ధరించనున్నారు.
40 రోజులు పుష్కరిణి మూసివేత…
సాధారణంగా ఆగస్టు ఆఖరు నాటికి మరమ్మతులు పూర్తయినప్పటికీ, వర్షాకాలం దృష్ట్యా టీటీడీ అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. భారీ వర్షాలు, తుఫాన్లు, ఇతర వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు కూడా పుష్కరిణిని మూసివేయనున్నారు.
ఈ నిర్ణయంతో ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు…. అంటే మొత్తం 40 రోజుల పాటు పుష్కరిణి హారతి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తారు. అదేవిధంగా ఈ 40 రోజుల వ్యవధిలో భక్తులెవరినీ పుష్కరిణిలోకి దిగడానికి గానీ, స్నానాలు చేయడానికి గానీ అనుమతించరు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పును గమనించి, టీటీడీ యాజమాన్యానికి సంపూర్ణంగా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.