...
...
Next Story

అమరావతి ల్యాండ్‌ పూలింగ్ కేసు - సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊరట, అప్పీల్ పిటిషన్ డిస్మిస్

Amaravati Land Pooling Case : అమరావతి ల్యాండ్‌ పూలింగ్ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబు, నారాయణపై FIRను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

Published on: Aug 14, 2026, 15:06:45 IST
Advertisement

Amaravati Land Pooling Case : రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్ పథకంలో అక్రమాలు జరిగాయంటూ నమోదు చేసిన కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణలకు దేశ అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ వ్యవహారంలో వారిపై నమోదైన కేసును కొట్టివేస్తూ గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

అమరావతి పూలింగ్ కేసులో చంద్రబాబుకు  ఊరట
అమరావతి పూలింగ్ కేసులో చంద్రబాబుకు ఊరట

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ కీలక పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఏపీ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి తాము సిద్ధంగా లేమని ఈ సందర్భంగా ధర్మాసనం తేల్చిచెప్పింది. అంతేకాకుండా…. ఈ పిటిషన్‌ ఫలితం ఇతర కేసులపై ఎలాంటి ప్రభావం చూపబోదని, ఆయా కేసులను వాటి విశిష్టతల ఆధారంగానే న్యాయస్థానాలు విచారించి నిర్ణయిస్తాయని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అల్లా రామకృష్ణారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ.. అమరావతి పరిధిలోని 25 వేల మందికి పైగా రైతులకు చెందిన సుమారు 30,000 ఎకరాల భూములకు సంబంధించిన ఈ వ్యవహారంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ధర్మాసనానికి వివరించారు.

దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. "రైతుల సంక్షేమం, వారి హక్కులకు సంబంధించిన పెద్ద అంశంలో తాము పూర్తిగా మద్దతుగా ఉంటామని, రైతులకు చట్టబద్ధంగా దక్కాల్సిన ప్రతి ప్రయోజనాన్ని కాపాడుతామని" ధర్మాసనం పేర్కొంది. అయితే… ప్రస్తుత క్రిమినల్ ఫిర్యాదు కేవలం ఒక రాజకీయ ప్రత్యర్థి దాఖలు చేసినదే తప్ప……. ఏ ఒక్క బాధితుడైన రైతు కూడా ఇప్పటివరకు నేరుగా కోర్టు ముందుకు రాలేదని ధర్మాసనం ఎత్తిచూపింది.

2016 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ పథకంలో అక్రమాలు జరిగాయంటూ నాటి ఎమ్మెల్యే అల్లా రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2021 మార్చి 12న అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) కింద కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేసిన సీఐడీ పోలీసులు…. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలతో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చారు. ఐపీసీలోని వివిధ సెక్షన్లతో పాటు ఎస్సీ/ఎస్టీ చట్టం, అసైన్డ్ భూముల చట్టం కింద నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు, నారాయణలు హైకోర్టును ఆశ్రయించగా, గతంలోనే హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణపై స్టే విధించడమే కాకుండా కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగరాభివృద్ధి కోసం రైతుల నుంచి వ్యవసాయ భూములను సేకరించేందుకు నాటి ప్రభుత్వం వినూత్నంగా ల్యాండ్ పూలింగ్ పథకాన్ని తీసుకొచ్చింది. సాంప్రదాయక బలవంతపు భూసేకరణ పద్ధతికి ప్రత్యామ్నాయంగా, భాగస్వామ్య పద్ధతిలో రైతుల భూములను సేకరించారు.

దీని కింద రాజధాని నిర్మాణం కోసం తమ వ్యవసాయ భూములను ఇచ్చే రైతులకు, ప్రతి ఎకరాకు గానూ అభివృద్ధి చేసిన 1,000 చదరపు గజాల నివాస స్థలం మరియు 250 చదరపు గజాల వాణిజ్య స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అధికారిక లెక్కల ప్రకారం అమరావతి నిర్మాణం కోసం 25 గ్రామాలలోని 28,181 మంది భూ యజమానులు తమకు చెందిన 35,215 ఎకరాల సొంత వ్యవసాయ భూములను ప్రభుత్వానికి అందించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe