ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసు.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.
ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం ధ్వంసమైన స్థితిలో శివలింగం కనిపించడం కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితుడు ద్రాక్షారామం భీమేశ్వరాలయం ఉత్తర గోపురం సప్త గోదావరి ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని ధ్వంసం చేశాడు.

భక్తులు గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ కోనేరులో స్నానం చేసి, శివలింగానికి పూజలు చేస్తారు. మంగళవారం ఉదయం ధ్వంసమైన శివలింగాన్ని చూసిన భక్తులు ఆలయ పూజారులకు సమాచారం అందించారు. స్థానికంగా ఈ విషయంపై కలకలం రేగింది. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ మీనా, నిందితుడిని పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. తమ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆలయం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.
నిందితుడిని తోటపేటకు చెందిన శీలం శ్రీనివాస్‌గా గుర్తించారు. డ్రైనేజీ వివాదం నేపథ్యంలో ఆలయ సిబ్బందికి ఇబ్బందులు కలిగించాలనే ఉద్దేశంతో నిందితుడు ఈ ఘటనకు పాల్పడినట్టుగా గుర్తించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు అంతకుముందు ఆధారాలు సేకరించారు. ఘటన స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో చుట్టుపక్కల పరిశీలించారు. నిందితుడు శీలం శ్రీనివాస్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు.
ద్రాక్షారమం భీమేశ్వర ఆలయంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారని, అతడిని అరెస్ట్ చేసినట్టుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. అధికారులు వెంటనే ఆలయంలో నూతన శివలింగాన్ని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు చేపట్టారన్నారు. నంద్యాలలో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి వస్తువులు పెట్టిన విషయంపై కర్నూలు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ను విచారణ అధికారిగా నియమించామన్నారు. వెండి ఆభరణాలు తిరిగి స్వామివారికి చేరే వరకు తప్పు చేసినవారిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు.
'సింహాచలం అప్పన్న స్వామిల ఆలయం ప్రసాదంలో పురుగు రావడాన్ని గుర్తించి తెలిపిన భక్తుడితో ఆలయ ప్రసాదం కౌంటర్ ఉద్యోగి దురుసుగా ప్రవర్తించాడు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈవోను ఆదేశించాం. ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది. ఆలయాల పరిరక్షణ, సామాన్య భక్తుల భద్రత ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.' అని దేవాదాయ శాఖ మంత్రి చెప్పారు.
మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు, మంగళవారం రాత్రి ఆలయ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడినట్లు రామనారాయణ రెడ్డి.. ముఖ్యమంత్రికి తెలిపారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆలయ ప్రాంగణంలో భద్రతను పెంచడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి రామనారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ ఆలయం పురావస్తు శాఖ పరిధిలోకి వస్తుందని, పోలీసులు మరియు పురావస్తు శాఖ మధ్య సమన్వయం కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు. ఆలయాల పవిత్రతను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


