ఆంధ్రప్రదేశ్‌లో స్లీపర్ బస్సులను దశలవారీగా నిషేధించాలి : ప్రభుత్వానికి నివేదిక

Sleeper Buses : ఆంధ్రప్రదేశ్‌లో స్లీపర్ బస్సులను దశలవారీగా నిషేధించాలని ఓ నివేదిక పేర్కొంది. ఎందుకు వాటిని నిషేధించాలని వివరిస్తూ.. రాష్ట్రప్రభుత్వానికి రిపోర్ట్ వెళ్లింది.

Updated on: Apr 19, 2026, 10:45:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రైవేటు స్లీపర్ బస్సులు వరుసగా తీవ్ర ప్రమాదాలకు గురవుతున్న విషయం తెలిసిందే. నేపథ్యంలో ఈ ప్రమాదాల వెనుక గల కారణాలపై విచారణ జరపాలని, ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి అవసరమైన చర్యలపై సిఫార్సులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ అభ్యర్థన మేరకు.. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) సమగ్ర దర్యాప్తు జరిపి, స్లీపర్ బస్సులను దశలవారీగా పూర్తిగా నిషేధించాలని సిఫార్సు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది.

స్లీపర్ బస్సు
స్లీపర్ బస్సు

రాష్ట్రంలో స్లీపర్ బస్సులపై నిషేధం విధించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఇప్పటికే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా పేర్కొన్నారు.

నివేదిక ప్రకారం.. వరుస ఘోర ప్రమాదాల నేపథ్యంలో స్లీపర్ బస్సులపై దశలవారీ నిషేధాన్ని విధించాలని ఏఎస్‌సీఐ సిఫార్సు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన ఈ నివేదిక, తీవ్రమైన భద్రతాపరమైన ఆందోళనలను ఎత్తి చూపుతోంది. 22 నెలల్లోగా స్లీపర్ బస్సు సర్వీసులను పూర్తిగా తొలగించాలని పిలుపునిచ్చింది.

ఈ అధ్యయనం అంతర్జాతీయ పద్ధతులతో పోలికలు చేసింది. చైనా 2012లో స్లీపర్ బస్సులను నిషేధించగా, అనేక ఐరోపా దేశాలు వాటిలో అంతర్లీనంగా ఉన్న భద్రతా ప్రమాదాల కారణంగా 2004లోనే ఇలాంటి నిషేధాలను అమలు చేశాయని పేర్కొంది.

ఏఎస్‌సీఐ పరిశోధనలు స్లీపర్ బస్సులలోని కీలకమైన డిజైన్ లోపాలను స్పష్టం చేస్తున్నాయి. వాటిలో కింద, పైన బెర్త్‌లు ఉండటం కూడా సరిగా లేదని స్పష్టం చేసింది. బస్సు బోల్తా పడే ప్రమాదం పెరగడం, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా ప్రయాణికులను ఖాళీ చేయించడానికి ఇబ్బంది అవుతుంది. స్లీపర్ బస్సులో ఉన్న బెర్త్‌ల మధ్య ఒకరే ఇబ్బందిగా నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే.. వెంట వెంటనే అందరూ బయటకు రాలేకపోతున్నారు. గందరగోళం నెలకొని మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది.

కర్నూలు జిల్లా చిన్నటేకూరు నాయకల్లు ఫ్లైఓవర్ సమీపంలో ప్రమాదంపై జరిపిన దర్యాప్తులో తీవ్రమైన లోపాలు బయటపడ్డాయి. ప్రమాదానికి గురైన బస్సును మోటార్ వెహికల్స్ చట్టం కింద అనుమతి లేకుండా, 53 సీట్ల బస్సు నుండి 43 బెర్త్‌ల స్లీపర్‌గా అక్రమంగా మార్చారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలను మూసేశారు. డ్రైవర్ డోర్‌కు శాశ్వతంగా బోల్టు వేశారు. లోపల అగ్ని నిరోధకత లేని పదార్థాలను ఉపయోగించారు. ఆ వాహనంలో ఎల్‌పీజీ సిలిండర్, లిథియం-అయాన్ బ్యాటరీలతో సహా ప్రమాదకరమైన వస్తువులు ఉన్నట్లు కూడా దర్యాప్తు అధికారులు కనుగొన్నారని నివేదిక పేర్కొంది.

చట్టవిరుద్ధమైన మార్పులు చేసినప్పటికీ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ జారీ చేయడం, వాహన్ డేటాబేస్‌లోని రిజిస్ట్రేషన్ రికార్డులలో వ్యత్యాసాలు ఉండటం వంటి అమలు వైఫల్యాలను కూడా ఈ నివేదిక బయటపెట్టింది. ఒడిశాలో రిజిస్టర్ అయిన ఆ బస్సు, పర్మిట్ నిబంధనలను దుర్వినియోగం చేస్తూ, సరిగా లేకుండా అంతర్రాష్ట్ర మార్గాల్లో నడుస్తోంది.

మరోవైపు రెట్రోఫిట్ వర్క్‌షాప్‌లు సరైన పర్యవేక్షణ లేకుండా పనిచేస్తున్నాయని కూడా నివేదిక పేర్కొంది.

నాలుగు దశల ప్రతిపాదనలు

  • మొదటి దశ ప్రకారం స్లీపర్ బస్సుల తయారీ, మార్పిడిని తక్షణమే నిలిపివేయాలి.
  • రెండో దశలో ప్రస్తుతం ఉన్న స్లీపర్ బస్సుల స్థానంలో 18-24 నెలల వ్యవధిలో సురక్షితమైన సీటర్ బస్సులను క్రమంగా ప్రవేశపెట్టాలి.
  • మూడో దశ హై-స్పీడ్ రైలు కారిడార్లు, తక్కువ ఖర్చుతో కూడిన విమానయానంతో సహా ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థలను విస్తరించడంపై దృష్టి పెట్టాలి.
  • చివరి దశ ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ టెస్టింగ్, అంతర్-రాష్ట్ర సమన్వయం, ఉల్లంఘనలకు రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు భారీ జరిమానాల విధించాలి.
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More