SCR Charlapalli Anakapalle Weekly Express : తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. చర్లపల్లి నుంచి ఏపీలోని అనకాపల్లికి కొత్తగా వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనుంది. ఈ మేరకు శాశ్వత ప్రాతిపదికన చర్లపల్లి – అనకాపల్లి – చర్లపల్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వే బోర్డు ఆమోదించింది. మే మొదటి వారం నుంచి ఈ కొత్త సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
టైమింగ్స్ వివరాలు….

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం….. అనకాపల్లి - చర్లపల్లి (నం.17046) రైలు మే 3 నుంచి పట్టాలెక్కుతుంది. అనకాపల్లి నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 5.35 గంటలకు బయల్దేరుతుంది. చర్లపల్లి-అనకాపల్లి (ట్రైన్ నెంబర్.17045) రైలు మే 9 నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి శనివారం రాత్రి 8.05 గంటలకు బయల్దేరుతుంది.
హాల్ట్ స్టేషన్లు ఇవే….
ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు…. తెలంగాణలోని ప్రధాన పట్టణాలైన జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం మీదుగా ఏపీలోని రాయనపాడు (విజయవాడ సమీపంలో), ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి స్టేషన్లలో ఆగుతుంది.
- రైలు నెంబర్ 17045: చర్లపల్లిలో శనివారం రాత్రి 20:05 గంటలకు బయలుదేరి… మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 09:25 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది.
- రైలు నెంబర్ 17046: అనకాపల్లిలో ఆదివారం సాయంత్రం 17:35 గంటలకు బయలుదేరి, సోమవారం ఉదయం 07:20 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
ఈ కొత్త రైల్వే సర్వీసు వల్ల సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, చర్లపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు నేరుగా కోస్తాంధ్రకు వెళ్లేందుకు వెసులుబాటు కలుగుతుంది. ముఖ్యంగా వారాంతాల్లో ప్రయాణించే ఉద్యోగులు…. విద్యార్థులకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.