దసరా పండుగ సీజన్లో ప్రయాణికుల తాకిడి పెరగడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగకు సొంతూర్లకు వెళ్లేవారికి, తిరుగు ప్రయాణమయ్యే వారికి ఇబ్బందులు కలగకుండా విజయవాడ - పలాస మార్గంలో ప్రత్యేక జనసాధారణ్ (అన్రిజర్వ్డ్) రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు దక్షిణ కోస్తా రైల్వే వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు విడతల్లో రాకపోకలు సాగిస్తాయి.
రైళ్ల టైమింగ్స్ - వివరాలు :
- విజయవాడ - పలాస (రైలు నంబర్ 07452): ఈ జనసాధారణ్ స్పెషల్ రైలు అక్టోబర్ 17 (శనివారం), అక్టోబర్ 18 (ఆదివారం) తేదీల్లో విజయవాడ నుంచి బయలుదేరుతుంది. రెండు రోజుల్లోనూ సాయంత్రం 17:30 గంటలకు (5:30 PM) విజయవాడలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 04:05 గంటలకు పలాస చేరుకుంటుంది.
- పలాస - విజయవాడ (రైలు నంబర్ 07451): తిరుగు ప్రయాణంలో ఈ సర్వీసు అక్టోబర్ 18 (ఆదివారం), అక్టోబర్ 19 (సోమవారం) తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 04:45 గంటలకు పలాసలో బయలుదేరి, అదే రోజు సాయంత్రం 16:00 గంటలకు (4:00 PM) విజయవాడ చేరుకుంటుంది.
రైలు ఆగే స్టేషన్లు (హాల్ట్లు)

విజయవాడ - పలాస మధ్య ఉన్న కీలకమైన స్టేషన్లలో ఈ రైలుకు స్టాపేజీలు కల్పించారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం రోడ్, నౌపడ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
ఈ రైలు మొత్తం 11 కోచ్లతో నడుస్తుంది. ఇందులో 9 జనరల్ క్లాస్ (సాధారణ) కోచ్లు, 2 సెకండ్ క్లాస్ సిట్టింగ్ కమ్ లగేజ్ కోచ్లు ఉంటాయి. ఇవన్నీ అన్రిజర్వ్డ్ కోచ్లు కావడం వల్ల ముందస్తు రిజర్వేషన్ అవసరం లేకుండా సాధారణ టికెట్తోనే ప్రయాణించవచ్చు. దసరా పండుగ రద్దీ సమయంలో ఈ రైళ్లు ప్రయాణికులకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి.