Tirumala Special Festivals June 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో వచ్చే జూన్ నెలలో నిర్వహించబోయే విశేష పర్వదినాలు, ఉత్సవాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా జరిగే జ్యేష్టాభిషేకంతో పాటు పలు ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల తేదీలను భక్తుల సౌకర్యార్థం ముందుగానే విడుదల చేశారు. జూన్ నెలలో స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ ఉత్సవాల తేదీలను బట్టి తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
జూన్ నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు :
- జూన్ 11 (గురువారం): సర్వ ఏకాదశి పర్వదినం. ఈ రోజున స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
- జూన్ 13 (శనివారం): మాస శివరాత్రి.
- జూన్ 26 (శుక్రవారం): తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే 'జ్యేష్టాభిషేకం' (అభిధేయక అభిషేకం) ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి.
- జూన్ 27 (శనివారం): శ్రీ నాథమునుల వర్ష తిరు నక్షత్రం మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు.
- జూన్ 28 (ఆదివారం): శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు సాగే జ్యేష్టాభిషేకం ఉత్సవాలు ఈ రోజుతో సమాప్తమవుతాయి.
- జూన్ 29 (సోమవారం): పౌర్ణమి పురస్కరించుకుని రాత్రి వేళ తిరుమల మాడ వీధుల్లో శ్రీవారి 'పౌర్ణమి గరుడ సేవ' వైభవంగా జరగనుంది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి వారు తన వాహనమైన గరుడునిపై అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ విశేష పర్వదినాల సందర్భాల్లో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే దర్శన క్యూలైన్లు, లడ్డూ ప్రసాదం పంపిణీ, తాగునీరు, వసతి తదితర ఏర్పాట్లను టీటీడీ ముందస్తుగా పర్యవేక్షిస్తోంది.
మరోవైపు వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమలలో శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, తాగునీరు, భద్రత తదితర సేవలను సమర్థవంతంగా అందిస్తోంది.
భక్తుల సౌకర్యార్థం నాణ్యమైన మౌలిక వసతులు, ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, ఎప్పటికప్పుడు సమాచారం అందించే విధానం, వర్షాలకు తడవకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి విజిలెన్స్, జిల్లా పోలీసులు, టీటీడీలోని వివిధ విభాగాలు, శ్రీవారి సేవకులు సమన్వయంతో నిరంతరం సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.