...
...
Next Story

అశ్వవాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దివ్య కటాక్షం

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. స్వామివారు అశ్వవాహనంపై కల్కి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తజనుల భజనలు, కోలాటాలు.. కర్పూర హారతులతో తిరుమల కొండపై ఆధ్యాత్మిక వైభవం నెలకొంది.

Published on: Oct 19, 2026, 21:25:40 IST
Advertisement

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రాత్రి అశ్వవాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. గజరాజుల గంభీర నడకలు, మంగళవాయిద్యాల మధురనాదాలు, భక్తజనుల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోషతో అశ్వవాహన సేవ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు

అశ్వవాహనంపై స్వామివారు
అశ్వవాహనంపై స్వామివారు

సనాతన ధర్మంలో అశ్వం వేగానికి, శక్తికి, చైతన్యానికి ప్రతీక. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలతో పోల్చి, వాటిని అదుపులో ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను బోధించాయి. అశ్వవాహనంపై విహరించే శ్రీమహావిష్ణువు సమస్త ఇంద్రియాలకు నియామకుడని, మనిషి తన ఇంద్రియాలను నియంత్రించుకుంటూ ధర్మమార్గంలో పయనించాలని ఈ వాహనసేవ ఆధ్యాత్మిక సందేశాన్నిస్తుంది.

కలియుగంలో అధర్మాన్ని రూపుమాపి, ధర్మాన్ని పునఃప్రతిష్ఠించే శ్రీమహావిష్ణువు కల్కి అవతార స్వరూపాన్ని ఈ అలంకారం స్ఫురింపజేస్తుంది. కలిదోషాలకు దూరంగా ఉంటూ, భగవన్నామ స్మరణ, నామసంకీర్తన, ధర్మాచరణను ఆశ్రయిస్తే ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చనే సందేశాన్ని స్వామివారి అశ్వవాహన సేవ భక్తులకు అందిస్తుంది. ధర్మరక్షణ, దుష్టశిక్షణ, శిష్టరక్షణలో పరమాత్మ సంకల్పాన్ని స్మరింపజేస్తూ భక్తులలో భక్తి, ధర్మనిష్ఠలను పెంపొందిస్తుంది.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో ప్రభల గోపీనాథ్, బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, పూర్ణ సాంబశివరావు, ఆనంద్ సాయి, నరేష్ కుమార్, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీవారి చక్రస్నానం

పుష్కరిణిలో ఒకేసారి సుమారు 9,450 మంది భక్తులు స్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల రాకపోకల కోసం 7 ప్రవేశ ద్వారాలు, 10 నిష్క్రమణ ద్వారాలు కలిపి మొత్తం 17 గేట్లు ఏర్పాటు చేశారు. బారికేడ్ల ద్వారా రద్దీని క్రమబద్ధీకరిస్తూ, భక్తులు సురక్షితంగా స్నానాలు ఆచరించేలా చర్యలు తీసుకున్నారు.

టీటీడీ విజిలెన్స్, పోలీసులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. పుష్కరిణిలో ఈతగాళ్లు, బోటును అందుబాటులో ఉంచారు. అశ్విని ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య బృందాలు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచి అత్యవసర వైద్య సేవలు అందించనున్నారు. పుష్కరిణి నీటి నాణ్యతను పరీక్షించి, నీరు కలుషితం కాలేదని నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు.

చక్రస్నానానికి విచ్చేసే భక్తులకు, విధుల్లో పాల్గొనే సిబ్బందికి అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. భక్తులు చక్రస్నానాన్ని వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. చక్రస్నానం రోజున రోజంతా పవిత్ర ఘడియలు ఉంటాయని, భక్తులు తొందరపడకుండా అధికారుల సూచనల మేరకు క్రమపద్ధతిలో పుష్కరిణిలో స్నానాలు ఆచరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. నిర్దేశించిన మార్గాలు, గేట్ల ద్వారానే రాకపోకలు సాగిస్తూ సిబ్బందికి సహకరించాలని కోరింది. క్రమశిక్షణతో, సురక్షితంగా పుష్కరిణిలో స్నానాలు ఆచరించి శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks