వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి.. అన్న దైవ స్తోత్రానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచే తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు శ్రీవారి కృపతో పాటు టీటీడీ నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద సేవ అక్షయ పాత్రలా కొనసాగుతోంది.

తిరుమలలో ఆకలితో ఉన్న భక్తుడికి అన్నం అందించడమే లక్ష్యంగా టీటీడీ అన్నప్రసాదం విభాగం 24 గంటలూ నిరంతరం పనిచేస్తోంది. సాధారణ రోజుల్లో సుమారు 1.80 లక్షల నుంచి 1.90 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుండగా, రద్దీ రోజులు, వారాంతాల్లో ఈ సంఖ్య 3 లక్షలకు మించుతోంది. పానీయాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కలిపి రోజుకు దాదాపు 3 లక్షల సర్వింగ్స్ భక్తులకు అందుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సంకల్పంతో 1985 ఏప్రిల్ 6న తిరుమలలో శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నదాన పథకం ప్రారంభమైంది. అనంతరం 1994 ఏప్రిల్ 1న ఈ పథకాన్ని ట్రస్టుగా మార్చారు. ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సేవలు మరింత విస్తృతంగా కొనసాగుతున్నాయి. తిరుమలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను విస్తరిస్తున్నారు.
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, శ్రీ అక్షయ వంటశాల, వకుళమాత వంటశాలలు 24 గంటలూ పనిచేస్తూ భక్తులకు ఆహారాన్ని అందిస్తున్నాయి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో రోజుకు 80 వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం అందుతోంది. ఇక్కడ ఉదయం ఉప్మా, పొంగలి, చట్నీ, సాంబార్ వంటి అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి అన్నం, కూర, చట్నీ, వడ, సాంబార్, రసం, మజ్జిగ, స్వీట్ పొంగల్ తదితర పదార్థాలను భక్తులకు వడ్డిస్తున్నారు.
శ్రీ అక్షయ వంటశాలలో గోధుమ రవ్వ ఉప్మా, సుజీ రవ్వ ఉప్మా, పొంగలి, సాంబారన్నం, పెరుగన్నం, టమోటా రైస్, సుండలు, పాలు, టీ, కాఫీ తదితరాలను తయారు చేస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే పర్వదినాల్లో మజ్జిగ, బాదం పాలు, బిస్కెట్లు, జ్యూస్ ప్యాకెట్లను కూడా పంపిణీ చేస్తున్నారు.
{{/usCountry}}శ్రీ అక్షయ వంటశాలలో గోధుమ రవ్వ ఉప్మా, సుజీ రవ్వ ఉప్మా, పొంగలి, సాంబారన్నం, పెరుగన్నం, టమోటా రైస్, సుండలు, పాలు, టీ, కాఫీ తదితరాలను తయారు చేస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే పర్వదినాల్లో మజ్జిగ, బాదం పాలు, బిస్కెట్లు, జ్యూస్ ప్యాకెట్లను కూడా పంపిణీ చేస్తున్నారు.
{{/usCountry}}వకుళమాత వంటశాల ద్వారా యాత్రికుల వసతి సముదాయాలు, కేంద్రీయ విచారణ కార్యాలయం, రామ్‌భగీచా అతిథి గృహం, అంజనాద్రి నిలయం తదితర ప్రాంతాల్లోని భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులతో పాటు నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్ల వెలుపల ఏర్పాటు చేసిన కేంద్రాలు, PAC అన్నప్రసాద భవనాలు, వివిధ వసతి సముదాయాల్లోని భోజనశాలల ద్వారా భక్తులకు ఆహారం, పానీయాలు అందిస్తున్నారు.
భక్తులు దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న సమయంలో కూడా ఆకలితో ఇబ్బంది పడకుండా చూడటమే టీటీడీ అన్నప్రసాద విభాగం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది. లక్షలాది మంది భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ ప్రతిరోజూ భారీ స్థాయిలో ముడి పదార్థాలను వినియోగిస్తోంది.
రోజుకు సుమారు 15,788 కిలోల బియ్యం, 3,110 కిలోల సన్‌ఫ్లవర్ ఆయిల్, 2,861 కిలోల కందిపప్పు, 2,832 కిలోల సుజీ రవ్వ, 2,825 కిలోల గోధుమ రవ్వ, 1,729 కిలోల మినప్పప్పు, 1,436 కిలోల ఉప్పు, 1,276 కిలోల బెల్లం, 497 కిలోల చింతపండు వినియోగిస్తున్నారు. అదేవిధంగా రోజుకు సుమారు 4,375 కొబ్బరికాయలు, 430 కిలోల చక్కెర, 309 కిలోల ఎండు మిర్చి, 209 కిలోల ధనియాలు తదితర ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నారు.
2026 జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30వ తేది వరకు తిరుమలలోని వివిధ అన్నప్రసాద కేంద్రాల ద్వారా 9 కోట్లకు పైగా సర్వింగ్స్ భక్తులకు అందించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు తాజాగా నాణ్యమైన, రుచికరమైన అన్న ప్రసాదాలు తయారు చేస్తూ భక్తులకు పంపిణీ చేస్తున్నారు.
భక్తులకు అందించే అన్నప్రసాదం నాణ్యతను పెంచడంతో పాటు సేవలను మరింత విస్తరించేందుకు టీటీడీ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. చట్నీలు, కూరల తయారీలో తాజా కొబ్బరికాయల వినియోగాన్ని ప్రవేశపెట్టింది. 2024లో వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించి అదనంగా 28 ప్రాంతాలకు ఆహార పంపిణీ సేవలను విస్తరించింది.
ఏడాది ముందు ప్రారంభించిన PAC-5 (వెంకటాద్రి నిలయం)లో ఒకేసారి సుమారు 1,500 మంది భోజనం చేసే సామర్థ్యంతో డైనింగ్ హాళ్లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 2 లక్షల మంది భక్తులకు ఆహారం తయారు చేయగల సామర్థ్యంతో కొత్త శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి.
MTVAC కిచెన్‌లో ఆధునిక వంట పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు, భక్తులు సులభంగా విరాళాలు అందించేందుకు క్యూఆర్ కోడ్ ఆధారిత విరాళాల సేకరణ కియోస్క్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల విరాళాలతో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ వద్ద ప్రస్తుతం రూ.2900 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ నిధులపై వచ్చే ఆదాయంతో లక్షలాది మంది భక్తులకు నిత్యం ఉచితంగా నాణ్యమైన అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు.
అన్నదానం మహాదానం అనే భారతీయ సనాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ టీటీడీ నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద కార్యక్రమం భక్తుల సేవలో ఒక మహత్తర ఆధ్యాత్మిక సేవగా నిలుస్తోంది. లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అంతరాయం లేకుండా అన్నప్రసాదాన్ని అందించేందుకు సుమారు వెయ్యి మందికి పైగా అన్నప్రసాద విభాగం సిబ్బంది, మరో వెయ్యి మందికి పైగా శ్రీవారి సేవకులు నిరంతరం సేవలందిస్తున్నారు.
ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు, క్యూలైన్లలోని భక్తుల నుంచి వసతి సముదాయాల్లోని యాత్రికుల వరకు ప్రతి ఒక్కరికీ ఆహారం అందేలా సమన్వయంతో పనిచేస్తున్నారు. శ్రీవారి సన్నిధికి వచ్చే ప్రతి భక్తుడు కడుపు నిండా భోజనం చేసి తృప్తిగా స్వామివారి దర్శనం చేసుకోవాలన్న సంకల్పంతో టీటీడీ కొనసాగిస్తున్న ఈ అన్నప్రసాద సేవ తిరుమలను నిజమైన “అన్నపూర్ణ నిలయం”గా నిలబెడుతోంది.
శ్రీవారి క్షేత్రంలో ఆకలితో వచ్చే భక్తుడికి అన్నం అందించడం కేవలం సేవ మాత్రమే కాదు-భక్తుడిలో భగవంతుడిని చూసే భారతీయ సనాతన సంప్రదాయానికి ప్రత్యక్ష ప్రతిరూపం అని టీటీడీ పేర్కొంది.