...
...
Next Story

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదం : విచారణకు హైలెవల్‌ కమిటీ - మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా!

Vizag Steel Plant Tragedy : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మరణించారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై విచారించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.

Published on: Jun 9, 2026, 09:26:07 IST
Advertisement

Visakhapatnam Steel Plant Tragedy : విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో (వైజాగ్ స్టీల్ ప్లాంట్) చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. సోమవారం జరిగిన ఈ దురదృష్టకర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున భారీ ఎక్స్‌గ్రేషియా (పరిహారం) అందజేయనున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రకటించారు. అదేవిధంగా…. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగుల కుటుంబాలకు సైతం రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన వెల్లడించారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదం
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదం

విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎస్‌ఎమ్‌ఎస్-2 (SMS-2), ఎస్‌టీసీ-3 (STC-3) హీట్ ఫెసిలిటీ విభాగాల నుంచి సోమవారం ఒక్కసారిగా భారీ ఎత్తున ద్రవరూప ఉక్కు (మోల్టెన్ స్టీల్) లీక్ కావడంతో ఈ దారుణమైన ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో కనీసం ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమవ్వగా… మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

అండగా ఉంటాం : కేంద్ర మంత్రి కుమారస్వామి

ఈ తీవ్ర విషాదంపై కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. "ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మానసిక ధైర్యాన్ని ప్రసాదించాలని నా అంతరాత్మతో ప్రార్థిస్తున్నాను. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులెవరూ అధైర్యపడొద్దు, భయాందోళనలకు గురికావద్దు. కేంద్ర ప్రభుత్వం మీకు పూర్తి అండగా ఉంటుంది" అని ఆయన భరోసా ఇచ్చారు.

ఆర్థిక పరిహారంతో పాటు బాధితుల కుటుంబాలకు కేంద్ర మంత్రి పలు కీలక హామీలను ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలు, సదరు ఉద్యోగి అసలు రిటైర్మెంట్ వయస్సు వచ్చేంతవరకు ప్రస్తుతం నివసిస్తున్న ప్లాంట్ క్వార్టర్స్‌లోనే నివాసం ఉండేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా…. మరణించిన కార్మికుల పిల్లల చదువుల బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని, మిగిలిన ఉద్యోగుల పిల్లలతో సమానంగా వీరికి కూడా విద్యా సంబంధిత ఆర్థిక సాయాన్ని పూర్తిగా అందిస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు…. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) నీరభ్ కుమార్ ప్రసాద్, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.

ఈ సమీక్షా సమావేశంలో విశాఖ జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి ప్రమాదం జరిగిన తీరును, అక్కడ తీసుకుంటున్న సహాయక చర్యలను నివేదించారు. గాయపడిన కార్మికులకు అందిస్తున్న అత్యవసర వైద్య చికిత్సను, ప్లాంట్ వద్ద ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది మరణించారని, గాయపడిన ఆరుగురిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కలెక్టర్ ముఖ్యమంత్రికి నివేదించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

విచారణ వేగవంతం - హైలెవల్ కమిటీ ఏర్పాటు:

విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో (వైజాగ్ స్టీల్ ప్లాంట్) సంభవించిన ఘోర ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణను వేగవంతం చేశాయి. ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేయడానికి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన రక్షణ చర్యలను సిఫార్సు చేయడానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. ఈ కమిటీ మంగళవారం ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో తన పరిశోధనలను ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు.

ఇవాళ ఉదయం ప్రమాదం జరిగిన ప్లాంట్ పరిసరాలను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ స్వయంగా సందర్శించి, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాద తీవ్రత…. బాధితులకు అందే ఆర్థిక సహాయంపై కీలక వివరాలను వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మరణించగా, ఆరుగురు గాయపడ్డారని ఆయన అధికారికంగా ధృవీకరించారు. గాయపడిన వారిలో ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks