...
...
Next Story

Aakasamlo Oka Tara Review: ఆకాశంలో ఒక తార రివ్యూ- భార్య కల కోసం పాటుపడే భర్త- హత్తుకునేలా దుల్కర్, సాత్విక, శ్రుతి మూవీ!

Aakasamlo Oka Tara Review And Rating In Telugu: తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్ సల్మాన్ తాజాగా ఆకాశంలో ఒక తారతో పలకరించారు. పవన్ సాధినేని దర్శకత్వంలో కొత్తమ్మాయి సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ సిని ఎలా ఉందో నేటి ఆకాశంలో ఒక తార రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Nov 20, 2026, 09:30:55 IST
Advertisement

Aakasamlo Oka Tara Review In Telugu And Rating:

ఆకాశంలో ఒక తార రివ్యూ- భార్య కల కోసం పాటుపడే భర్త- హత్తుకునేలా దుల్కర్, సాత్విక, శ్రుతి మూవీ!
ఆకాశంలో ఒక తార రివ్యూ- భార్య కల కోసం పాటుపడే భర్త- హత్తుకునేలా దుల్కర్, సాత్విక, శ్రుతి మూవీ!

టైటిల్: ఆకాశంలో ఒక తార

నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ శర్మ, మహేష్ ఆచంట, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు.

కథ: పవన్ సాధినేని, వసంత్ జుర్రు

దర్శకత్వం: పవన్ సాధినేని

సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్

ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్

నిర్మాతలు: సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం

నిర్మాణ సంస్థలు: గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా

విడుదల తేది: 20 నవంబర్ 2026

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తుంటారు. అలాంటి దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీనే ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయం కాగా.. శ్రుతి హాసన్, రుహానీ శర్మ, స్వాసిక కీలక పాత్రలు పోషించారు.

పవన్ సాధినేని కథ, దర్శకత్వం వహించిన ఆకాశంలో ఒక తార సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల నడుమ ఇవాళ (నవంబర్ 20) థియేటర్లలో విడుదల కానుంది. అయితే, రిలీజ్‌కు ఒకరోజు ముందు అంటే నవంబర్ 19న ఆకాశంలో ఒక తార ప్రీమియర్స్ షోలు పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి ఆకాశంలో ఒక తార రివ్యూలో చూద్దాం.

కథ:

అయితే ఆడపిల్లకు చదువు ఎందుకనే పాతకాలపు ఆలోచనలున్న తండ్రి శివయ్య (కోట జయరాం), పదో తరగతితోనే కల్పన చదువు ఆపేయిస్తాడు. డ్రైవర్ కావాలని కలలు కనే కృష్ణ (దుల్కర్ సల్మాన్) అనే మెకానిక్‌తో కల్పన పెళ్లి జరిపిస్తాడు. పెళ్లయిన తర్వాత భార్య ఆశయం గురించి తెలుసుకున్న కృష్ణ, ఆమె కలను తన జీవిత లక్ష్యంగా మార్చుకుంటాడు. కుటుంబ సభ్యుల వ్యతిరేకతను ఎదుర్కొని హైదరాబాద్ నగరానికి మకాం మారుస్తాడు.

కల్పనకు ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు వచ్చేలా ప్రోత్సహించడంతో పాటు, ఆమె చదువు ఖర్చుల కోసం తాను గుజరాత్ వెళ్లి రాత్రింబవళ్లు కష్టపడతాడు కృష్ణ. అంతా సజావుగా సాగుతుందనుకున్న తరుణంలో కల్పన చేసిన ఓ రాకెట్ ప్రయోగం విఫలమవుతుంది. ఆ తర్వాత కల్పన జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ప్రైవేట్ స్పేస్ సెంటర్ అధినేత రోహిణి (శ్రుతి హాసన్), గుజరాతీ యువతి బిజిలీ (రుహానీ శర్మ) ఈ ప్రయాణంలోకి ఎలా వచ్చారు? చివరకు కల్పన తన అంతరిక్ష కలను నిజం చేసుకుందా లేదా అన్నదే మిగతా కథ.

విశ్లేషణ:

కొన్నిసార్లు స్టోరీ ఎంత సింపుల్‌గా ఉన్న తెరకెక్కించే విధానంలో వైవిధ్యం, ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయినట్లే. అచ్చం అలాంటి కోవకే చెందుతుంది ఆకాశంలో ఒక తార సినిమా. అయితే, ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడే క్లైమాక్స్ ఎలా ఉంటుంది, స్టోరీ ఏంటీ అనేది ఈజీగా అర్థమైపోతుంది.

ఆ క్లైమాక్స్ చేరుకోడానికి ప్రేక్షకుడుని చివరి వరకు కూర్చొబెట్టగలిగారా అనేదే మెయిన్ టాస్క్. ఆ టాస్క్‌లో డైరెక్టర్ పవన్ సాధినేని సక్సెస్ సాధించారనే చెప్పాలి. ఊహించదగిన స్టోరీని సైతం రెండున్నర గంటలపాటు ఎలాంటి బోర్ కలగకుండా చూడగలిగేలా చేయడం మాములు విషయం. అందులో దర్శకుడు పూర్తిగా విజయం దక్కించుకున్నారు.

స్టోరీకి తగినట్లుగా స్క్రీన్ ప్లే

పెద్దగా కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా బలమైన ఎమోషన్స్, డైలాగ్స్, పాత్రల స్వభావం, పరిస్థితులతో స్ఫూర్తివంతమైన భావోద్వేగపు సినినిమాను అందించారు. ఇలాంటి ఎమోషనల్ జర్నీ మూవీలో కథనం కొన్నిసార్లు మైనస్ అవుతుంది. స్లోగా ఉందనిపించిన అది స్టోరీకి తగినట్లుగా సాగుతుంది. అప్పుడే ఆ ఎమోషన్ వర్కౌట్ అవుతుంది.

ఫస్టాఫ్ అంతా కల్పన నేపథ్యం, పెళ్లి, భార్య కోసం కృష్ణ పడే తపన చుట్టూ భావోద్వేగభరితంగా సాగుతుంది. గుజరాత్‌లో కృష్ణ పడే కష్టాలు, అక్కడ బిజిలీ పాత్రతో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్‌లో వచ్చే రాకెట్ మిషన్ ఫెయిల్యూర్ ఎపిసోడ్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.

దాంతో సెకండాఫ్‌లో శ్రుతి హాసన్ ప్రవేశం కథలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. కృష్ణ, కల్పన, రోహిణి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో ఫ్రెష్‌గా అనిపిస్తాయి. అన్నింటికంటే మిన్నగా చివరి 20 నిమిషాలు సినిమాకు ప్రాణం పోశాయి. తండ్రితో కూతురు మాట్లాడే సన్నివేశం, క్లైమాక్స్ ఎమోషన్స్ కంటతడి పెట్టిస్తాయి.

నటీనటుల ప్రతిభ.. పోటీపడి నటించిన దుల్కర్, సాత్విక

కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్ తన స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి ఒక సామాన్యుడిగా ఒదిగిపోయారు. నిజానికి ఇది కథానాయిక చుట్టూ తిరిగే కథ అయినప్పటికీ, ఒక సహాయక పాత్రలాంటి భర్త క్యారెక్టర్‌ను ఒప్పుకోవడంలోనే దుల్కర్ సగం విజయం సాధించారు. భార్య కల కోసం తన సుఖాలను త్యాగం చేసే భర్తగా ఆయన నటన ఎంతో సహజంగా, హృదయానికి హత్తుకునేలా ఉంది.

ఈ సినిమాకు అసలైన సర్‌ప్రైజ్ కొత్తమ్మాయి సాత్విక వీరవల్లి. తొలి చిత్రమే అయినా ఎక్కడా తడబాటు లేకుండా పల్లెటూరి అమాయకత్వం, లక్ష్యం పట్ల పట్టుదల, వైఫల్యం ఎదురైనప్పుడు కలిగే ఆవేదనను అద్భుతంగా పలికించారు. దుల్కర్ లాంటి అనుభవజ్ఞుడైన నటుడితో పోటీపడి నటించారు.

శక్తివంతమైన పాత్రలో శ్రుతి హాసన్ తన స్క్రీన్ ప్రజెన్స్‌తో మెప్పించారు. బిజిలీగా రుహానీ శర్మ, అక్క పాత్రలో స్వాసిక, ఇతర కీలక పాత్రల్లో నాజర్, మురళీ శర్మ, గౌతమ్ మీనన్ తమ అనుభవాన్ని తెరపై అందంగా ఆవిష్కరించారు.

సాంకేతిక విలువలు.. ప్రాణం పోసిన సంగీతం, మాటలు

సాంకేతిక విభాగంలో జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు వెన్నెముకలా నిలిచింది. భావోద్వేగభరిత సన్నివేశాలను తన బీజీఎమ్‌తో మరో స్థాయికి తీసుకెళ్లారు. పాటలు కథలో భాగంగా సాగుతూ వినసొంపుగా ఉన్నాయి. సుజిత్ సారంగ్ కెమెరా పనితనం చాలా రిచ్‌గా ఉంది. ప్రతి ఫ్రేమ్ ఒక అందమైన పెయింటింగ్‌లా కనిపిస్తుంది.

‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’ వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన గుణ్ణం గంగరాజు అందించిన స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ సినిమాకు బలంగా నిలిచాయి. "నీ కల ఆకాశం అయినప్పుడు ఈ భూమిని ఏం చేసుకుంటాం", "డ్రీమ్స్ డోంట్ ఆస్క్ యువర్ పిన్ కోడ్", "ఆకాశమంత ఎత్తైన మనిషి భుజాల మీద ఎక్కి నేను అంతరిక్షాన్ని అందుకున్నాను" అంటూ సాగే డైలాగులు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయేలా ఉన్నాయి.

ఫైనల్‌గా చెప్పాలంటే

అయితే, నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నప్పటికీ, కొన్ని గ్రాఫిక్స్, ఏఐ విజువల్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. అక్కడక్కడా నెమ్మదించినట్లుగా కనిపించే కథనం, ముందే ఊహించగలిగే మలుపులు అతి చిన్న లోపాలుగా అనిపించినప్పటికీ ఆకాశంలో ఒక తార ఒక అందమైన భావోద్వేగ ప్రయాణంలా ఉంటుంది. మంచి కథలు రావడం లేదని నిరాశపడే తెలుగు సినీ ప్రియులకు, కుటుంబమంతా కలిసి చూడదగిన ఒక హృద్యమైన చిత్రమే ఆకాశంలో ఒక తార.

రేటింగ్: 3.5/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks