Allu Sirish Complaint: అర్థరాత్రి నిద్ర లేకుండా చేస్తున్నారు.. పోలీసులను ఆశ్రయించిన మెగా హీరో అల్లు శిరీష్.. చివరికి?

Allu Sirish Complaint To Hyderabad Police: హైదరాబాద్ షేక్‌పేటలో అర్థరాత్రి వరకు మోగుతున్న లౌడ్‌స్పీకర్ల హోరుపై మెగా హీరో అల్లు శిరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా అర్థరాత్రి వరకు నిద్రలేకుండా చేస్తున్నారంటూ కంప్లైంట్ ఇచ్చారు అల్లు శిరీష్.

Published on: Sep 28, 2026, 13:25:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Allu Sirish Complaint To Hyderabad Police: నగరాల్లో పెరిగిపోతున్న శబ్ద కాలుష్యం, అర్థరాత్రి వేళల్లో హోరెత్తే లౌడ్‌స్పీకర్ల సమస్య మరోసారి రచ్చకెక్కింది. హైదరాబాద్ షేక్‌పేట పరిధిలో నివాసముంటున్న మెగా హీరో అల్లు శిరీష్ లౌడ్‌స్పీకర్ల మోతపై నగర పోలీసులను సోషల్ మీడియా వేదికగా ఆశ్రయించారు.

అర్థరాత్రి నిద్ర లేకుండా చేస్తున్నారు.. పోలీసులను ఆశ్రయించిన మెగా హీరో అల్లు శిరీష్.. చివరికి?
అర్థరాత్రి నిద్ర లేకుండా చేస్తున్నారు.. పోలీసులను ఆశ్రయించిన మెగా హీరో అల్లు శిరీష్.. చివరికి?

నిద్రలేకుండా చేస్తున్నారు

అల్లు శిరీష్ నివాసం ఉంటున్న ఇంటి సమీపంలో నిద్ర లేకుండా చేస్తున్న మైకుల గోలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. షేక్‌పేట్‌లోని అపర్ణ వన్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసముంటున్న అల్లు శిరీష్, సమీపంలోని వినోబా నగర్ హనుమాన్ ఆలయం నుంచి నిరంతరం వస్తున్న శబ్దాలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఫిర్యాదు చేశారు.

అర్థరాత్రి 3 గంటల వరకు మైకుల హోరు.. ఎక్స్ వేదికగా ఆవేదన

"గత కొన్ని రోజులుగా వినోబా నగర్‌లోని హనుమాన్ ఆలయంలో అర్ధరాత్రి 2, 3 గంటల వరకు మైకులు పెట్టి బిగ్గరగా పాటలు వేస్తున్నారు" అని అల్లు శిరీష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు మించిన శబ్దంతో పాటలు పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

వినాయక నిమజ్జనం ముగిసినా మారని పరిస్థితి

ఈ సమస్యపై తాను ఇప్పటికే ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని శిరీష్ వెల్లడించారు. వినాయక చవితి, నిమజ్జనం ఊరేగింపుల దృష్ట్యా సెప్టెంబరు 25 వరకు వేచి చూడాలని అప్పట్లో పోలీసులు సూచించారని తెలిపారు. అయితే పండుగ ముగిసిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

"వినాయక నిమజ్జనం సెప్టెంబరు 25తో ముగిసింది. పండుగ అయిపోయినా రాత్రివేళల్లో లౌడ్‌స్పీకర్ల మోత మాత్రం ఆగడం లేదు. మా సొసైటీలో ఉన్న చిన్న పిల్లలు, వయోవృద్ధులు, ఉద్యోగులు రాత్రిపూట నిద్రలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు" అని అల్లు శిరీష్ వివరించారు. స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని పోలీసులను కోరారు.

తక్షణమే స్పందించిన నగర పోలీసులు

అల్లు శిరీష్ పోస్టుపై హైదరాబాద్ నగర పోలీసులు వెంటనే స్పందించారు. స్థలాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఫిలింనగర్ ఎస్‌హెచ్‌ఓ (SHO)కు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల తక్షణ స్పందనకు "చాలా ధన్యవాదాలండీ" అని శిరీష్ బదులిచ్చారు. అనంతరం స్థానిక పోలీసులు వినోబా నగర్‌లోని ఆలయ నిర్వాహకులతో మాట్లాడి శబ్దాన్ని తగ్గించాలని సూచించారు.

హైదరాబాద్‌లో శబ్ద కాలుష్య నిబంధనలు

హైదరాబాద్ నగరంలో లౌడ్‌స్పీకర్ల వాడకంపై స్పష్టమైన చట్టాలు ఉన్నాయి. 1963 హైదరాబాద్ సిటీ లౌడ్‌స్పీకర్ల నిబంధనల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మైకులు వాడటానికి ముందస్తు అనుమతి తప్పనిసరి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నివాస ప్రాంతాల్లో పెద్ద శబ్దాలు చేయడం చట్టరీత్యా నేరం.

నిబంధనలు ఉల్లంఘిస్తే సిటీ పోలీస్ యాక్ట్ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. షేక్‌పేట్, గచ్చిబౌలి వంటి ఐటీ ప్రాంతాల్లోని బహుళ అంతస్తుల భవనాలు, సమీప బస్తీల మధ్య ఇలాంటి శబ్ద కాలుష్య సమస్యలు తరచూ వెలుగుచూస్తున్నాయి.

అల్లు శిరీష్ సినీ ప్రయాణం

ఇకపోతే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ సోదరుడైన అల్లు శిరీష్ 2013లో 'గౌరవం' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత 'కొత్త జంట', 'శ్రీరస్తు శుభమస్తు', 'ఒక్క క్షణం', 'ఊర్వశివో రాక్షసివో' వంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు శిరీష్. ఆయన చివరిగా 2024లో వచ్చిన 'బడ్డీ' సినిమాలో కథానాయకుడిగా అలరించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More