AP Govt Nandi Awards : త్వరలోనే నంది అవార్డుల ప్రదానం - వేదిక, తేదీలపై ఏపీ సర్కార్ కసరత్తు
సంస్కృతి ప్రతిబింబించేలా ‘నంది నాటకోత్సవాలు’ నిర్వహిస్తామని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. త్వరలోనే నంది అవార్డులను అందజేస్తామని ప్రకటించారు. ఆ దిశగా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సన్నద్ధం కావాలని సూచించారు.
రాష్ట్రంలో క్రియేటివ్ ఎకానమీ ని ప్రోత్సహించేలా అధికారులు పని చేయాలని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశించారు. పర్యాటక, చలనచిత్ర అభివృద్ధి సంస్థ, డిజిటల్ కార్పొరేషన్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఎఫ్.డి.సి మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్ మరియు అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు.
త్వరలోనే అవార్డులు…
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రతిష్టను చాటి చెప్పే నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు, టీవీ, థియేటర్ అవార్డులను త్వరలోనే ఇస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి జ్యూరీ ఏర్పాటు, వేదికలు, తేదీలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌లను ప్రోత్సహించేలా నూతన ఫిల్మ్ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో షూటింగ్ జరుపుకునే చిత్రాలలో ఆయా పర్యాటక ప్రాంతాల పేర్లను తెరపై ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సినిమా స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రీ-రికార్డింగ్ స్టూడియోల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
స్థానిక కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒక ప్రత్యేక డేటా బ్యాంక్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటు విషయమై ఇప్పటికే పలు దఫాలు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో చర్చించగా వారు సానుకూలంగా స్పందించారని మంత్రి దుర్గేష్ అధికారులకు వెల్లడించారు.
యానిమేషన్, డిజిటల్ మీడియా, ఓటీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించుకుని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఇందుకోసం త్వరలోనే రాష్ట్ర స్థాయిలో ఒక భారీ వర్క్‌షాప్ నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. పర్యాటక రంగానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు ఎఫ్డిసి ద్వారా ఫిల్మ్స్ రూపొందించాలని అధికారులను మంత్రి దుర్గేష్ ఆదేశించారు.

E-Paper












