Avengers Doomsday: రిలీజ్‌కు 23 రోజుల ముందే 50 కోట్ల కలెక్షన్స్- ఇండియాలో డూమ్స్‌డే సంచలనం- 20 కోట్ల టికెట్స్ అవుట్!

Avengers Doomsday Advance Booking In India: హాలీవుడ్ క్రేజీ మూవీ అవెంజర్స్: డూమ్స్‌డే విడుదలకు ఇంకా 3 వారాలకు పైగా సమయం ఉండగానే భారత బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన వారం రోజుల్లోనే 8 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై ఏకంగా రూ. 50 కోట్ల మార్కును దాటేసింది.

Published on: Nov 24, 2026, 22:40:45 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Avengers Doomsday Advance Booking In India: హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్, భారీ స్క్రీన్లలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. ఇప్పుడు మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 'అవెంజర్స్: డూమ్స్‌డే' సినిమా విడుదలకు ముందే భారత బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది.

రిలీజ్‌కు 23 రోజుల ముందే 50 కోట్ల కలెక్షన్స్- ఇండియాలో డూమ్స్‌డే సంచలనం- 20 కోట్ల టికెట్స్ అవుట్!
రిలీజ్‌కు 23 రోజుల ముందే 50 కోట్ల కలెక్షన్స్- ఇండియాలో డూమ్స్‌డే సంచలనం- 20 కోట్ల టికెట్స్ అవుట్!

థియేటర్లలోకి రావడానికి ఇంకా 23 రోజుల సమయం ఉండగానే అవెంజర్స్ డూమ్స్‌డే దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు 8 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.

వారం రోజుల్లోనే రికార్డుల మోత.. తొలి రోజే రూ. 22 కోట్లు!

భారత అభిమానులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా #OpenDoomsdayBookings హ్యాష్‌ట్యాగ్‌తో పెద్ద ఎత్తున ట్రెండ్ చేయడంతో, మార్వెల్ స్టూడియోస్ నవంబర్ 17 అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా టికెట్ బుకింగ్స్ తెరిచింది. అప్పటి నుంచి టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో రౌండ్ ది క్లాక్ షోలు వేస్తున్నా, ప్రారంభ రోజు అర్ధరాత్రి షోలు గంటల వ్యవధిలోనే హౌస్‌ఫుల్ అయ్యాయి.

బుకింగ్స్ మొదలై వారం పూర్తయిన మంగళవారం (నవంబర్ 24) ఉదయానికి అన్ని రోజులకు కలిపి రూ. 50 కోట్ల గ్రాస్ వసూలైనట్లు ప్రముఖ ట్రేడ్ సంస్థ వెల్లడించింది. ఇందులో ఒక్క మొదటి రోజు వసూళ్లే రూ. 22 కోట్లు ఉండటం విశేషం. గడిచిన ఐదు రోజుల్లోనే ఏకంగా రూ. 20 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి.

ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' చిత్రం తొలి రోజు ప్రీ-సేల్స్‌లో రూ. 25 కోట్లు రాబట్టింది. విడుదలకింకా మూడు వారాలకు పైగా గడువున్న 'డూమ్స్‌డే' ఆ మార్కుకు చేరువలో నిలిచి, భారత్‌లో హాలీవుడ్ ఆల్-టైమ్ అడ్వాన్స్ బుకింగ్ రికార్డును తిరగరాయడానికి సిద్ధమైంది.

రామాయణ, ధురంధర్ 2 చిత్రాలను దాటేసిన వేగం

సాధారణంగా భారతీయ భారీ సినిమాలకు కూడా విడుదలకు మూడు వారాల ముందు రూ. 50 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ రావడం అరుదు. బాలీవుడ్ చరిత్రలోనే భారీ చిత్రాలుగా నిలిచిన 'రామాయణ', 'ధురంధర్ 2' (ధురంధర్ ది రివెంజ్) సినిమాలు సైతం విడుదలకు వారం లోపు మాత్రమే రూ. 50 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మార్కును చేరుకున్నాయి.

కానీ 'అవెంజర్స్: డూమ్స్‌డే' ఏకంగా 23 రోజుల ముందే ఆ ఘనత సాధించి బాలీవుడ్ దిగ్గజాలను సైతం వెనక్కి నెట్టింది. అయితే భారత్‌లో ఆల్-టైమ్ తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ రికార్డు మాత్రం ఇప్పటికీ మన తెలుగు సినిమా 'పుష్ప 2: ది రూల్' పేరు మీదే పదిలంగా ఉంది. 2024లో విడుదలైన అల్లు అర్జున్ చిత్రం మొదటి రోజు ప్రీ-సేల్స్‌లో ఏకంగా రూ. 91 కోట్లు కొల్లగొట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది.

మూడు విశ్వాల సంగమం.. భారీ తారాగణం!

2019లో సంచలనం సృష్టించిన 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' తర్వాత ఏడేళ్ల విరామం అనంతరం వస్తున్న అసలైన అవెంజర్స్ చిత్రమిది. ఆంటోనీ రుస్సో, జో రుస్సో ద్వయం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఐరన్ మ్యాన్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ స్టార్ హీరో రాబర్ట్ డౌనీ జూనియర్ ఈసారి అత్యంత శక్తిమంతమైన విలన్ 'డాక్టర్ డూమ్' పాత్రలో కనిపించనుండటం సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. మూడు వేర్వేరు విశ్వాలకు చెందిన సూపర్ హీరోలు ఒకే చోటకు చేరి డాక్టర్ డూమ్ రూపంలో ఎదురయ్యే పెను ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొన్నారన్నది ఈ కథలో ప్రధానాంశం.

ఈ చిత్రంలో క్రిస్ ఎవాన్స్, క్రిస్ హెమ్స్‌వర్త్, పెడ్రో పాస్కల్, పాల్ రూడ్, ఆంథోనీ మాకీ, ఫ్లోరెన్స్ పగ్, వెనెస్సా కిర్బీ, టామ్ హిడిల్‌స్టన్, ఇయాన్ మెక్కెల్లన్, పాట్రిక్ స్టీవర్ట్, చానింగ్ టాటమ్, సిము లియు, సెబాస్టియన్ స్టాన్, డేవిడ్ హార్బర్ సహా భారీ తారాగణం నటించింది.

బాక్సాఫీస్ వద్ద 'డూన్స్‌డే' పోరు.. భారత్‌లో ఒకరోజు ముందే!

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 18న విడుదల కానుంది. సరిగ్గా అదే రోజున వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'డ్యూన్' మూడో భాగం కూడా థియేటర్లలోకి వస్తోంది. ఈ రెండు భారీ చిత్రాల బాక్సాఫీస్ పోరును సినీ విశ్లేషకులు 'డూన్స్‌డే' (Dunesday)గా అభివర్ణిస్తున్నారు.

అయితే భారతీయ సినీ అభిమానులకు మార్వెల్ ఒక తీపి కబురు అందించింది. ప్రపంచవ్యాప్త విడుదలకు ఒక రోజు ముందే, అంటే డిసెంబర్ 17నే భారత్‌లో 'అవెంజర్స్: డూమ్స్‌డే' థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే, విడుదల నాటికి ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలన రికార్డులు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.