Crazy Kalyanam Review: క్రేజీ కళ్యాణం రివ్యూ- అనుపమ పరమేశ్వరన్, నరేష్, తరుణ్ భాస్కర్ పెళ్లి, ఎమోషనల్ డ్రామా ఆకట్టుకుందా?

Crazy Kalyanam Review And Rating In Telugu: దసరా పండుగ కానుకగా థియేటర్లలోకి వచ్చిన అనుపమ పరమేశ్వరన్, నరేష్ వీకే, తరుణ్ భాస్కర్‌ల ‘క్రేజీ కళ్యాణం’ సినిమా రివ్యూ ఇక్కడ చూద్దాం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ తండ్రీకూతుళ్ల ఎమోషన్, పెళ్లి డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 16, 2026, 10:50:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Crazy Kalyanam Movie Review And Rating In Telugu: బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, సీనియర్ నటుడు వీకే నరేష్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన రూరల్ కామెడీ డ్రామా సినిమా క్రేజీ కళ్యాణం. ఈ ముగ్గురు ప్రధాన పాత్రలతో పెళ్లిపై తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్ రాజ్ మరో కీలక పాత్ర పోషించాడు.

క్రేజీ కళ్యాణం రివ్యూ- అనుపమ పరమేశ్వరన్, నరేష్, తరుణ్ భాస్కర్ పెళ్లి, ఎమోషనల్ డ్రామా ఆకట్టుకుందా?
క్రేజీ కళ్యాణం రివ్యూ- అనుపమ పరమేశ్వరన్, నరేష్, తరుణ్ భాస్కర్ పెళ్లి, ఎమోషనల్ డ్రామా ఆకట్టుకుందా?

భద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన క్రేజీ కళ్యాణం సినిమా ఇవాళ (అక్టోబర్ 16) థియేటర్లలో విడుదలైంది. పల్లెటూరి నేపథ్యం, ఆడపిల్ల చదువు, పెళ్లి, తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ తిరిగే ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా వెండితెరపై ఎలా ఆకట్టుకుందో నేటి క్రేజీ కళ్యాణం రివ్యూలో చూద్దాం.

కథ:

పర్వతాలు (నరేష్ వీకే) ఊరిలో పరువుగా బ్రతికే సగటు గ్రామీణ తండ్రి. పెద్ద కూతురిని అన్న చూసిన సంబంధం అని బాలరాజు (తరుణ్ భాస్కర్)కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే బాలరాజు తాగుడుకు బానిసై ఊరంతా అప్పులు చేస్తూ, ఇంటిపైకి గొడవలు తెస్తూ పర్వతాలు పరువు తీస్తుంటాడు. ఈ బాధ నుంచి కోలుకోవడానికి తన చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్)కి మంచి ఆస్తిపాస్తులున్న, గుణగణాలున్న అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు.

ఇందుకోసం తన అన్న కూతురికి వచ్చిన ఎన్నారై సంబంధాన్ని కూడా తప్పుపట్టించి, తన కూతురికి సెట్ చేస్తాడు. మరోవైపు కీర్తి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి, తను ప్రేమించిన ఉదయ్ (అఖిల్ రాజ్)ని పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంది. అదే విషయం తండ్రికి చెబితే పర్వతాలు పెళ్లికి ఒప్పుకోడు.

తండ్రి పరువు.. కూతురి ఆశయం!

ఆ తర్వాత ఏమైంది? తండ్రి కూతురు మధ్య ఎలాంటి సంఘర్షణ మొదలైంది?, చివరికి కీర్తి పెళ్లి ఎవరితో జరిగింది? ఈ పెళ్లికి బాలరాజు చేసిన క్రేజీ పనులేంటీ? కీర్తికి సహాయం చేశాడా? సమస్యలు తీసుకొచ్చాడా? వంటి విషయాలు తెలియలాంటే? వెండితెరపై ఈ క్రేజీ కళ్యాణం చూడాల్సిందే.

విశ్లేషణ:

తెలంగాణ గ్రామీణ వాతావరణంలో తండ్రీకూతుళ్ల బంధాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు భద్రప్ప గాజుల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆడపిల్ల పెళ్లికి చేసే ఖర్చులో పదో వంతు వారి చదువుపై పెడితే వాళ్ల భవిష్యత్తు బాగుపడుతుందనే మంచి సందేశాన్ని ఎంచుకున్నారు.

మొదటి భాగంలో పర్వతాలు కుటుంబం, తాగుబోతు అల్లుడి హంగామాతో చాలా కామెడీగా కథ మొదలవుతుంది. కీర్తి, ఉదయ్ లవ్ ట్రాక్ మొదలయ్యాక కథ కాస్త నెమ్మదిస్తుంది. ప్రథమార్థంలో లవ్ సీన్స్ సాధారణంగా సాగినా, ఇంటర్వెల్‌లోని ఎమోషనల్ సీన్స్ బాగా కుదిరాయి.

ప్రీ క్లైమాక్స్ నుంచి అలా

సెకండాఫ్‌లో కథనం కొంత గాడి తప్పినట్లు అనిపిస్తుంది. పెళ్లిని అడ్డుకోవడానికి హీరోహీరోయిన్లు చేసే ప్రయత్నాలు అంతగా బలంగా లేకపోవడంతో డ్రామా తగ్గింది. మధ్యలో వచ్చే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ సన్నివేశాలు బాగానే మెప్పిస్తాయి. ప్రీ-క్లైమాక్స్ నుంచి సినిమా మళ్లీ వేగం పుంజుకుంటుంది.

కూతురి భవిష్యత్తు కోసం తండ్రి పడే తపన ఏడిపిస్తుంది. పెళ్లి మండపంలో జరిగే గొడవలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌లో ఆడపిల్లల చదువు ప్రాధాన్యతను వివరిస్తూ ముగించిన తీరు బాగుంది. ఆడపిల్ల చదువు, పెళ్లి అనే అంశాలను కామెడీగా గ్రామీణ నేపథ్యంలో చెప్పిన తీరు మెప్పిస్తుంది.

ఎవరెలా చేశారంటే?

కీర్తి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ ఎంతో సహజంగా నటించింది. తెలంగాణ యాసను స్పష్టంగా పలుకుతూ, ఎమోషనల్ సీన్స్‌లో జీవిచేంసింది. తండ్రి పాత్రలో వీకే నరేష్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచారు. కూతురిపై ప్రేమ, పరువు కోసం తపించే సగటు తండ్రిగా ఆయన తన నటనానుభవంతో ఎంతో మెప్పించారు. తాగుబోతు అల్లుడు బాలరాజుగా తరుణ్ భాస్కర్ తన మార్కు కామెడీతో నవ్వించాడు. అఖిల్ రాజ్ తన పాత్ర పరిధి మేర నటించాడు.

సురేశ్ బొబ్బిలి సంగీతంలో 'అలచంద్ర వంక' పాట ఆకట్టుకుంటుంది. బీజీఎమ్ కూడా సన్నివేశాలకు తగినట్లుగా అలరిస్తుంది. శ్యామ్ దూపాటి కెమెరా పనితనం గ్రామీణ అందాలను, పెళ్లి సంబరాలను తెరపై అందంగా చూపించింది. నిర్మాణ విలువలు కథకు తగినట్లుగా ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే స్టోరీ రొటీన్ అనిపించిన నవ్వించే కామెడీ, ఏడిపించే ఎమోషన్‌తో మంచి సందేశం ఇచ్చే క్రేజీ కళ్యాణం సినిమాను ఓసారి చూడొచ్చు.

రేటింగ్: 3/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More