#Cult Review: #కల్ట్ రివ్యూ-ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ థ్రిల్లర్- విశ్వక్ సేన్ డైరెక్ట్ చేసిన నయా యాక్షన్ మూవీ మెప్పించిందా?
Vishwak Sen #Cult Review And Rating In Telugu: విశ్వక్ సేన్ దర్శకత్వం వహించిన నయా సర్వైవల్ యాక్షన్ స్లాషర్ థ్రిల్లర్ '#కల్ట్' ఇవాళ (అక్టోబర్ 30) థియేటర్లలోకి వచ్చింది. ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు, రవి బస్రూర్ మాస్ సంగీతంతో ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో నేటి #కల్ట్ రివ్యూలో చూద్దాం.
Vishwak Sen #Cult Movie Review And Rating In Telugu:

టైటిల్: #కల్ట్
నటీనటులు: విశ్వక్ సేన్, గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, శ్రీకాంత్ అయ్యంగార్, మురళి శర్మ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విశ్వక్ సేన్
సంగీతం: రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
నిర్మాత: సందీప్ కాకర్ల
విడుదల తేది: 30 అక్టోబర్ 2026
టాలీవుడ్లో సరికొత్త ప్రయోగాలు చేస్తూ సందడి చేస్తుంటాడు 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్. ఈసారి ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ థ్రిల్లర్ అంటూ తెరకెక్కించిన మోస్ట్ వయోలెంట్ యాక్షన్ సినిమా '#కల్ట్'. ఈ సినిమాకు స్వయంగా విశ్వక్ సేన్ దర్శకత్వం వహించడం విశేషం.
సందీప్ కాకరాల నిర్మాతగా.. 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించిన #కల్ట్ సినిమా ఇవాళ (అక్టోబర్ 30) థియేటర్లలో విడుదల అయింది. భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఎలా ఉందో నేటి #కల్ట్ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
గోవా హోంమంత్రి (మురళి శర్మ) కుమారుడు ఎల్విన్ (తారక్ పొన్నప్ప) తన పుట్టినరోజు వేడుకను అత్యంత వైభవంగా నిర్వహిస్తాడు. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులను ఐలాండ్‌లో నిర్వహించే తన పార్టీకి ఆహ్వానిస్తాడు. ఆ పార్టీలో ఓ బొమ్మ కనిపించి గేమ్స్ ఆడాలని చెబుతుంది. చిన్న పిల్లల గేమ్‌లా భావించే ప్రారంభమైన కుర్చీలాట అనుకోకుండా ఒక భయంకరమైన మరణ మృదంగంగా మారుతుంది.
పార్టీలో పెట్టే గేమ్స్ ఆడాలాని, అందులో ఓడిపోయినవాళ్లను చంపాలని రూల్స్ పెడతారు. బయటకు వెళ్లేందుకు వీలు లేకుండా డోర్స్‌కు ఆర్డీఎక్స్ బాంబులు పెడతారు. దాంతో పార్టీలో ఉన్న 300 మందిని కాపాడేందుకు పోలీసులకు కూడా వీలు లేకుండా ఉంటుంది.
కానీ, అదే పార్టీలో ఉన్న డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్)ను రంగంలోకి దింపుతారు. ఆ తర్వాత ఏమైంది? మరి 300 మందిని సంకల్ప్ కాపాడాడా? అసలు ఆ గేమ్స్ ఎవరు ఆడిస్తున్నారు? ఎందుకు ఆడిస్తున్నారు? వాళ్లను సంకల్ప్ కనిపెట్టాడా? అనేదే మిగతా కథ.
విశ్లేషణ:
ఒక సర్వైవల్ థ్రిల్లర్ సినిమాకు అత్యంత కీలకమైనది ప్రేక్షకుల్లో కలిగే భయం, ఉత్కంఠ. వయోలెంట్ దృశ్యాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టే ఉత్కంఠను నెలకొల్పడంలో ఈ సినిమా కాస్తా తడబడింది.
ప్రపంచప్రసిద్ధి చెందిన 'స్క్విడ్ గేమ్' ఓటీటీ సిరీస్ ప్రేరణతో కొన్ని ఘట్టాలను తీర్చిదిద్దినట్లు సినిమాలో పాత్రలే స్వయంగా ఒప్పుకుంటాయి. అయితే ఆ ప్రాణాంతకమైన గేమ్‌లు కొన్నిచోట్ల మాత్రమే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వయోలెన్స్ కూడా కొన్ని చోట్ల థ్రిల్లింగ్‌గా ఆకట్టుకుంటుంది. అయితే, రక్తపాతం తప్పా పెద్దగా ఎమోషన్ కనిపించదు.
విశ్వక్ సేన్ ఎంట్రీ ఇచ్చే వరకు కథనంలో వేగం కనిపించదు. ఇంటర్వెల్ కార్డు పడే సమయానికి గ్రాఫ్ ఒక్కసారిగా పెరుగుతుంది. కానీ, సెకండాఫ్‌లో కొంతవరకు మళ్లీ స్లో అవుతుంది. ఎడిటర్ రవి తేజ గిరిజాల ఇంకాస్తా శ్రద్ధ పెట్టాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ గ్రాండ్‌గా అలరిస్తాయి.
ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అలా
ఇకపోతే సినిమాలో విశ్వక్ సేన్ తనదైన మాస్ యాటిట్యూడ్, స్వాగ్తో అలరించారు. స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా తన బలాలు ఏంటో బాగా తెలిసిన నటుడిగా, యాక్షన్ సన్నివేశాల్లో జీవించారు. ప్రీ-క్లైమాక్స్, ముగింపు సన్నివేశాలు కథకు ప్రాణం పోశాయి. ప్రాణభయంతో ఉన్న అతిథులు ధైర్యం తెచ్చుకుని హంతకులపై ఎదురుదాడి చేసే ఘట్టాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
విలన్ పాత్రలో వివేక్ చేకూరి నటన మెప్పిస్తుంది. తారక్ పొన్నప్ప, గాయత్రి భరద్వాజ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ ఘట్టాలకు భారీతనాన్ని ఇచ్చింది. యాక్షన్ సీన్స్‌లో బీజీఎమ్ అదిరిపోయింది. ప్రొడక్షన్ డిజైన్ మేకింగ్ రిచ్‌గా ఉన్నాయి.
ఫైనల్‌గా చెప్పాలంటే
మొత్తంగా చెప్పాలంటే '#కల్ట్' అనేది యాక్షన్ సన్నివేశాలు, చివరి అరగంట ఆకట్టుకునేలా సాగే ఒక స్లాషర్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్. విశ్వక్ సేన్ నటన, దర్శకత్వ ప్రయత్నం బాగున్నా, కథనంలో కొంతమేర సస్పెన్స్ తగ్గింది. కానీ, డిఫరెంట్ ప్రయోగాలు ఇష్టపడేవారు #కల్ట్ మూవీపై ఓసారి లుక్కేయవచ్చు.
రేటింగ్: 3/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


