Akshara Haasan About High School Fail And Direction: సినిమా పరిశ్రమలో స్టార్ కిడ్స్ ప్రయాణం అనగానే అందరూ పూలబాట అని అనుకుంటారు. కానీ, వారి వెనుక ఎన్నో రకాల సవాళ్లు, సొంత నిర్ణయాలు ఉంటాయి. లోకనాయకుడు కమల్ హాసన్, నటి సారికల చిన్న కుమార్తె, శ్రుతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ ఇటీవల సైరస్ బ్రూచా పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన జీవితానికి సంబంధించిన పలు సంచలన విషయాలను పంచుకున్నారు.
కొరియోగ్రాఫర్‌గా తొలి అడుగులు.. ఆ తర్వాతే నటన!

సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినప్పటికీ, తన ప్రయాణం ఎంతో భిన్నంగా సాగిందని అక్షర వివరించారు. సాధారణంగా సినీ ప్రముఖుల పిల్లలు నేరుగా హీరోలుగా లేదా హీరోయిన్లుగా పరిచయమవుతుంటారు. అక్షర మాత్రం తన ప్రయాణాన్ని కొరియోగ్రాఫర్‌గా ప్రారంభించారు. మొదట స్నేహితుల మ్యూజిక్ వీడియోలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసినట్లు ఆమె తెలిపారు.
"నా మొదటి ఉద్యోగం నటన కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ పని కూడా కాదు.. డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించాను. డైరెక్షన్ చేయాలనే లక్ష్యంతోనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ప్రయత్నించకుండా వద్దని ఎలా చెబుతాం అనే ఉద్దేశంతోనే నటనలోకి అడుగుపెట్టాను. భవిష్యత్తులో కచ్చితంగా మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహిస్తాను" అని అక్షర హాసన్ వెల్లడించారు.
మూడుసార్లు ఫెయిల్.. చదువుకు గుడ్ బై!
నేటి రోజుల్లో సెలబ్రిటీలు తమ పరాజయాలను దాచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అక్షర హాసన్ తన విద్యాభ్యాసం గురించి అత్యంత పారదర్శకంగా మాట్లాడారు. హైస్కూల్ చదువుల్లో తాను అనుకున్నంతగా రాణించలేకపోయానని చెప్పారు.
పాఠశాల విద్య పూర్తి కాకపోయినా, డ్యాన్స్ వంటి కళల్లో శిక్షణ తీసుకుని ఉన్నత విద్య అభ్యసించే అవకాశం ఉందనే అంశంపై స్పందిస్తూ తన అనుభవాన్ని పంచుకున్నారు అక్షర హాసన్. హైస్కూలు (10వ తరగతి) పరీక్షల్లో వరుసగా మూడుసార్లు ఫెయిల్ కావడంతో చదువుపై ఆసక్తి పోయిందని, దాంతో ఇక పాస్ కావడం కష్టమని గ్రహించి చదువుకు స్వస్తి చెప్పినట్లు అంగీకరించారు.
'నటులు కావాలని ఒత్తిడి చేయలేదు'.. తల్లిదండ్రుల ప్రోత్సాహం
కమల్ హాసన్, సారిక వంటి దిగ్గజ నటుల కుమార్తె అయినప్పటికీ తమపై ఇంట్లో ఎలాంటి ఒత్తిడి లేదని అక్షర స్పష్టం చేశారు. నటన వైపు రావడం తమ సొంత నిర్ణయమని చెప్పారు.
{{/usCountry}}కమల్ హాసన్, సారిక వంటి దిగ్గజ నటుల కుమార్తె అయినప్పటికీ తమపై ఇంట్లో ఎలాంటి ఒత్తిడి లేదని అక్షర స్పష్టం చేశారు. నటన వైపు రావడం తమ సొంత నిర్ణయమని చెప్పారు.
{{/usCountry}}"మేము నటుల పిల్లలం కాబట్టి కచ్చితంగా నటులమే కావాలని నా తల్లిదండ్రులు ఎప్పుడూ ఒత్తిడి తేలేదు. నటన ఇష్టం లేకపోతే వేరే రంగంలో స్థిరపడమని చెప్పారు. మీ మనసుకు నచ్చింది చేయమని చెప్పడమే మాపై ఉన్న పెద్ద బరువును దించింది" అని అక్షర హాసన్ పేర్కొన్నారు.
సినిమాల విషయానికొస్తే తమ ఇంట్లో నిర్మొహమాటంగా విమర్శలు చేసుకుంటామని తెలిపారు. నటన బాలేకపోతే "చాలా చెత్తగా నటించావు" అని ముఖం మీదే చెప్పేస్తారని, చిన్న చిన్న తప్పులను తమకే వదిలేసి నేర్చుకోమంటారని వివరించారు.
కెరీర్ మైలురాళ్లు
ఇకపోతే నటిగా మారకముందు అక్షర హాసన్ 2010లో రాహుల్ ధోలాకియా దర్శకత్వంలో వచ్చిన 'సొసైటీ' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సినిమాలో ఆమె తల్లి సారిక నటించారు. కమల్ హాసన్ తెరకెక్కించిన 'శభాష్ నాయుడు' చిత్రానికి సహాయ దర్శకురాలిగా సేవలందించారు అక్షర.
ప్రారంభంలో వచ్చిన అనేక నటన ఆఫర్లను తిరస్కరించారు అక్షర హాసన్. కానీ, 2015లో ఆర్. బాల్కీ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, ధనుష్ కాంబినేషన్‌లో వచ్చిన 'షమితాభ్' చిత్రం ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు అక్షర హాసన్. తమిళంలో అజిత్ కుమార్ సరసన 'వివేగం' (2017) చిత్రంలోనూ నటించారు. ఇటీవల 'సిమ్యులాక్రా' చిత్రంలో కనిపించి మెప్పించారు.