Sapthami Gowda: హీరోయిన్లను ఆ యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తున్నారు.. మా బాడీ పార్ట్‌ల మీదే మీ ఫోకసా: కాంతార హీరోయిన్ సీరియస్
బహిరంగ కార్యక్రమాల్లో హీరోయిన్లను అసభ్యకరమైన యాంగిల్స్‌లో చిత్రీకరిస్తున్న కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్ల తీరుపై కాంతార నటి సప్తమి గౌడ (Sapthami Gowda) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం శరీర భాగాలపైనే జూమ్ చేస్తూ వారిని ఒక వస్తువులా చూడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆమె తేల్చి చెప్పింది.
'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి సప్తమి గౌడ తాజాగా ఒక సామాజిక అంశంపై గళం విప్పింది. సినిమా ఫంక్షన్లు లేదా పబ్లిక్ ఈవెంట్లలో ఫోటోగ్రాఫర్లు, కెమెరా ఆపరేటర్లు హీరోయిన్లు, ఇతర నటీమణుల పట్ల ప్రవర్తిస్తున్న తీరును ఆమె తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ను షేర్ చేసింది.

అసభ్యకరమైన జూమ్-ఇన్స్ వద్దు
కాంతార మూవీ ఫేమ్ సప్తమి గౌడ లేటెస్ట్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది ఇండస్ట్రీలోని హీరోయిన్లు, ఇతర నటీమణులందరి సమస్య అని ఆమె చెబుతోంది. ఈవెంట్లలో తమ బాడీ పార్ట్‌లనే లక్ష్యంగా చేసుకొని కెమెరామెన్ అవసరం లేని జూమ్ ఇన్స్ చేస్తున్నారని ఆమె మండిపడింది.
"చిత్ర పరిశ్రమలోని మహిళలందరి తరపున నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను. పబ్లిక్ ఈవెంట్లలో మా పనిని కాకుండా, మా శరీర భాగాలపై అసంబద్ధంగా జూమ్ చేస్తూ ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. ఇది చాలా అసౌకర్యంగా ఉండటమే కాకుండా.. మమ్మల్ని అవమానించడమే అవుతుంది. కొంతమంది వ్యక్తులు చేస్తున్న ఇటువంటి పనులు ఏమాత్రం సహించరానివి" అని సప్తమి స్పష్టం చేసింది.
మేము ఇక్కడ ఉన్నది నటన కోసం
"మేము ఇక్కడ ఉన్నది మా వృత్తి కోసం, మా నటన కోసం. గౌరవప్రదమైన హద్దులను దాటి ప్రవర్తించడం సభ్యత అనిపించుకోదు. ఇది మా హుందాతనాన్ని దెబ్బతీసే చర్య. మీడియా మిత్రులు ప్రొఫెషనలిజం పాటించాలని, కనీస గౌరవం ఇవ్వాలని మేము ఆశిస్తున్నాము" అని ఆమె తన నోట్‌లో స్పష్టం చేసింది. దీనికి 'నటీనటులం.. వస్తువులం కాదు' (Actors not objects) అనే క్యాప్షన్‌ను జతచేసింది.
ఈ సమస్య ఇప్పటిది కాదు
సప్తమి కంటే ముందు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, నోరా ఫతేహి వంటి తారలు కూడా పాపరాజీల తీరును తప్పుబట్టారు. డ్రెస్సులను, నడకను అసభ్యకరంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం వాడుకోవడం పట్ల వారు గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. సప్తమి గౌడ తాజాగా ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చి, మహిళా నటీమణులందరూ ఈ విషయంలో ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చింది.
సప్తమి గౌడ 'పాప్‌కార్న్ మంకీ టైగర్' సినిమాతో కెరీర్ ప్రారంభించి, 'కాంతార'తో స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. ఇటీవల ఆమె వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన 'ది వ్యాక్సిన్ వార్', కన్నడ మూవీ 'యువ'లో నటించింది. ఆమె లేటెస్ట్ మూవీ 'ది రైజ్ ఆఫ్ అశోక' బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.

ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


