...
...
Next Story

Kara Movie Review: కర రివ్యూ: దొంగతనం మానేసినోడు మళ్లీ బ్యాంక్ రాబరీలు చేస్తే? ధనుష్, మమితా బైజు మూవీ ఎలా ఉందంటే?

Kara Movie Review In Telugu And Rating: బ్యాంకు మోసాలు, పేదల భూములు, ఆకలి చావులు.. వీటన్నిటి నేపథ్యంలో వచ్చిన ధనుష్, మమితా బైజు చిత్రం కర. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో నేటి కర రివ్యూలో చూద్దాం.

Published on: Apr 30, 2026, 17:11:30 IST
Advertisement

Kara Movie Review In Telugu And Rating: తమిళ స్టార్ హీరో ధనుష్, బ్యూటిపుల్ హీరోయిన్ మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కర. రాబరీ నేపథ్యంతో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. కర మూవీ ఇవాళ (ఏప్రిల్ 30) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి కర మూవీ రివ్యూలో తెలుసుకుందాం.

కర రివ్యూ: దొంగతనం మానేసినోడు మళ్లీ బ్యాంక్ రాబరీలు చేస్తే? ధనుష్, మమితా బైజు మూవీ ఎలా ఉందంటే?
కర రివ్యూ: దొంగతనం మానేసినోడు మళ్లీ బ్యాంక్ రాబరీలు చేస్తే? ధనుష్, మమితా బైజు మూవీ ఎలా ఉందంటే?

టైటిల్: కర

నటీనటులు: ధనుష్, మమితా బైజు, సూరజ్ వెంజరమూడ్, కెఎస్ రవికుమార్, జయరామ్, కరుణాస్, శ్రీజ రవి, పృథ్వీరాజన్ తదితరులు

దర్శకత్వం: విఘ్నేశ్ రాజా

కథ: ఆల్ఫ్రెడ్ ప్రకాష్, విఘ్నేశ్ రాజా

సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: థెని ఈశ్వర్

ఎడిటింగ్: స్రీజిత్ సారంగ్

నిర్మాత: ఇషారి కె గణేష్

విడుదల తేది: ఏప్రిల్ 30, 2026

కథ:

ఒకప్పుడు గజదొంగగా పేరుగాంచిన కరస్వామి (ధనుష్), తన ప్రేమించి పెళ్లిచేసుకున్న మల్లి (మమితా బైజు)కి ఇచ్చిన మాట కోసం దొంగతనాలు మానేసి రామనాథపురంలో సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఓ హోటల్ పెట్టుకుని జీవించాలనుకుంటాడు. కానీ, అందుకోసం డబ్బు అవసరమై పొలం కాగితాల కోసం ఎన్నో సంవత్సరాల తర్వాత తండ్రి (కేఎస్ రవికుమార్) దగ్గరికి వెళ్తాడు కరస్వామి. కానీ, అనుకోని పరిస్థితుల్లో తండ్రి చనిపోతాడు.

ఆ తర్వాత ఏమైంది? కరస్వామి మళ్లీ ఎందుకు దొంగతనాలు మొదలుపెట్టాడు? కేవలం ముత్తు సెల్వన్ (జయరామ్)కు చెందిన పంచవన్ యూనిన్ బ్యాంకులను మాత్రమే కరస్వామి ఎందుకు దోచుకున్నాడు? అసలు కరస్వామి ఎవరు? తండ్రికి దూరంగా ఎందుకు బతుకుతున్నాడు? కరను ఎలాగైనా పట్టుకోవాలనుకున్న డీఎస్పీ భరతన్ (సూరజ్ వెంజరమూడ్) ఏం చేశాడు? అతనికి, కరకు ఉన్న విరోధం ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే కర చూడాల్సిందే.

విశ్లేషణ:

వర్షం కురుస్తున్న రాత్రి ఒక ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం చేసే సీన్, ఆ తర్వాత పోలీస్ లాకప్ నుంచి తప్పించుకోవడం వంటి దృశ్యాలను చాలా సహజంగా చిత్రీకరించారు. లైటింగ్, సౌండ్ డిజైన్ సినిమాకు వెన్నెముకలా నిలిచాయి. కేవలం దొంగతనం మాత్రమే కాకుండా, అప్పటి సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు.

బలం.. బలహీనత

సినిమాకు ప్రధాన బలం ఎమోషన్స్. ఒక సాధారణ దొంగ లోకల్ లెజెండ్‌గా ఎలా మారాడు అనే కోణాన్ని చక్కగా చూపించారు. అయితే, ధనుష్ గత సినిమాలు 'రాయన్', 'ఇడ్లీ కడై' తరహాలోనే ఇందులో కూడా భూమి, తండ్రి సెంటిమెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కొంత 'రిపీటెడ్' ఫీలింగ్ కలుగుతుంది.

సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు ఊహించేలా ఉండటం, డ్రామా ఎక్కువ అవడంతో ల్యాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. రైతు సమస్యలు, గల్ఫ్ యుద్ధం వంటి అంశాలను బాగా చూపించారు. క్లైమాక్స్ పర్వాలేదు. కొంత వర్గానికి అంతలా కనెక్ట్ కాకపోవచ్చు.

టెక్నికల్ అంశాలు

ఇక సినిమాకు మరో బలంగా జీవీ ప్రకాష్ అందించిన నేపథ్య సంగీతం నిలిచింది. సినిమా మూడ్‌ను సరిగ్గా క్యారీ చేసేలా బీజీఎమ్ ఉంది. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. రాబరీకి సంబంధించిన సీన్లు విజువల్‌గా చాలా బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. ఇంకాస్తా జాగ్రత్త తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

నటీనటుల ప్రతిభ: ధనుష్ విశ్వరూపం

ఇక ధనుష్ నటన గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కరస్వామి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. తండ్రి మీద ప్రేమ, భూమి పోతుందన్న ఆవేదన, దొంగగా మారినప్పటి తెగింపు.. ఇలా అన్ని భావాలను అద్భుతంగా పండించారు ధనుష్. ఇక డీఎస్పీ భరతన్ పాత్రలో సూరజ్ వెంజారమూడు మెప్పించారు.

ఆయన కరస్వామిని పట్టుకోవాలనుకోవడం కేవలం ధర్మం కోసం కాదు, తాను ఫేమస్ అవ్వాలనే స్వార్థం కూడా ఉండటం పాత్రను ఆసక్తికరంగా మార్చింది. బ్యాంకు మేనేజర్‌గా జయరామ్ నటన సినిమాకు ఒక కొత్త కోణాన్ని ఇచ్చింది. మమితా బైజు పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో బాగుంది.

ఫైనల్‌గా చెప్పాలంటే

కర మూవీతో కొత్తగా ఏమీ ప్రయోగం చేయలేదు కానీ, ఉన్న కథను నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశారు. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి ఎమోషన్ కోరుకునే వారికి ఈ సినిమా తప్పక నచ్చుతుంది. రొటీన్ స్టోరీ అయిన తీర్చిదిద్దిన విధానం మెప్పించే కర.

రేటింగ్: 3/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe