Sanjay Dutt: నిర్మాతలకు 400 శాతం లాభాలు తెచ్చిన మూవీ.. 32 ఏళ్ల తర్వాత సంజయ్ దత్ ఖల్ నాయక్ సీక్వెల్.. బల్లు బలరామ్ బ్యాక్
Sanjay Dutt: సంజయ్ దత్ ఐకానిక్ క్యారెక్టర్ 'బల్లు బలరామ్' మళ్ళీ తెరపైకి వస్తోంది. 1993 నాటి కల్ట్ క్లాసిక్ 'ఖల్ నాయక్'కు సీక్వెల్‌గా 'ఖల్ నాయక్ రిటర్న్స్'ను మేకర్స్ ప్రకటించారు. ముంబైలో జరిగిన ఈవెంట్‌లో దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.
Sanjay Dutt: బాలీవుడ్ వెండితెరపై ఒకప్పుడు సంచలనం సృష్టించిన యాంటీ హీరో పాత్ర 'బల్లు బలరామ్' మళ్లీ ప్రాణం పోసుకుంటోంది. సంజయ్ దత్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన 'ఖల్ నాయక్' చిత్రానికి సీక్వెల్ వస్తోంది. 'ధురంధర్' చిత్రం తర్వాత సంజయ్ దత్ నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పేరు 'ఖల్ నాయక్ రిటర్న్స్'.

ఖల్ నాయక్ ప్రభంజనం
సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో 1993, ఆగస్టు 6న విడుదలైన 'ఖల్ నాయక్' అప్పట్లో ఒక సంచలనం. సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమాగా నిలిచింది.
400 శాతం
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, అప్పట్లోనే రూ. 21 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి నిర్మాతలకు 400 శాతం లాభాలను తెచ్చిపెట్టింది. హిందీలోనే కాకుండా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో కూడా రీమేక్ చేశారు.
పాటలకు నేటికీ క్రేజ్
ఖల్ నాయక్ సినిమా విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. 'ఖల్ నాయక్ హై తూ', 'చోళీ కే పీచే క్యా హై' వంటి పాటలు నేటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. అప్పట్లో ఈ సినిమా ఆడియో క్యాసెట్లు ఏకంగా 10 మిలియన్ల కాపీలు అమ్ముడై రికార్డు సృష్టించాయి. 'చోళీ కే పీచే క్యా హై' పాట ఎంత వివాదాస్పదమైందో, అంతకంటే ఎక్కువ ప్రజాదరణ పొందింది. ఈ పాటను ఇటీవల విడుదలైన 'క్రూ' సినిమాలో రీమిక్స్ చేయడం గమనార్హం.
జైలులో ఆలోచన
ముంబైలో జరిగిన ఖల్ నాయక్ రిటర్న్స్ టీజర్ లాంచ్ కార్యక్రమంలో సంజయ్ దత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 1993 బాంబు పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే తనకు 'ఖల్ నాయక్' సీక్వెల్ ఆలోచన వచ్చినట్లు ఆయన వెల్లడించాడు.
"జైలులో ఉన్నప్పుడు బల్లు కథను ముందుకు తీసుకెళ్తే చూస్తారా అని అక్కడ ఉన్న సుమారు 4,000 మంది ఖైదీలను అడిగాను. వారంతా తప్పకుండా చూస్తామని చెప్పారు. వారందరినీ ఈ కథ ఎలా ఉండాలో ఒక పేజీలో రాసివ్వమని అడిగాను. ఆ 4,000 పేజీలను చదవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఆ తర్వాత పెరోల్‌పై బయటకు వచ్చినప్పుడు సుభాష్ ఘాయ్ గారిని కలిసి ఈ విషయం చెప్పాను. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది" అని 66 ఏళ్ల సంజయ్ దత్ వివరించారు.
కొత్త అవతారంలో బల్లు
'ఖల్ నాయక్ రిటర్న్స్' కోసం సంజయ్ దత్ తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశారు. ఈ టీజర్‌లో ఆయన చాలా రఫ్ అండ్ రగ్డ్ లుక్‌లో కనిపిస్తున్నారు. సుభాష్ ఘాయ్ నుంచి సంజయ్ దత్, అక్ష కాంబోజ్ ఈ చిత్ర హక్కులను కొనుగోలు చేశారు. సీక్వెల్‌లో కూడా సుభాష్ ఘాయ్ భాగస్వామ్యం ఉంటుందని సంజయ్ స్పష్టం చేశారు. పాత కథలో నేరస్థుడిగా ఉండి చివర్లో లొంగిపోయిన బల్లు, ఇప్పుడు కొత్త అధ్యాయంలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: ఖల్ నాయక్ రిటర్న్స్ చిత్రానికి సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహిస్తున్నారా?
జవాబు: సుభాష్ ఘాయ్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉంటారని సంజయ్ దత్ తెలిపాడు. అయితే దర్శకత్వం ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ప్రశ్న: అసలు ఖల్ నాయక్ సినిమా ఎప్పుడు విడుదలయ్యింది?
జవాబు: ఒరిజినల్ 'ఖల్ నాయక్' చిత్రం 1993, ఆగస్టు 6న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.
ప్రశ్న: ఈ సీక్వెల్ కథ దేని గురించి ఉండబోతోంది?
జవాబు: బల్లు బలరామ్ పాత్ర జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత సాగే ప్రయాణం చుట్టూ ఈ కథ తిరుగుతుందని సమాచారం.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


