Mahendragiri Varahi Review: మహేంద్రగిరి వారాహి రివ్యూ-200 ఏళ్ల శాపం, ట్విస్టులు- సుమంత్, ఐశ్వర్య, సిద్ధు జొన్నలగడ్డ మూవీ
Mahendragiri Varahi Review And Rating In Telugu: సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన డివోషనల్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’ నేడు రిలీజ్ అయింది. 200 ఏళ్ల రాజవంశ శాపం, ఊహించని క్లైమాక్స్ ట్విస్టులతో సాగే ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో నేటి మహేంద్రగిరి వారాహి రివ్యూలో చూద్దాం.
Mahendragiri Varahi Review And Rating In Telugu: దైవిక అంశాలు, మూఢనమ్మకాలు, వాటి వెనుక దాగున్న రహస్యాలను ఛేదించే కాన్సెప్ట్‌లతో వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు టాలీవుడ్‌లో ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. 'కార్తికేయ', 'సుబ్రహ్మణ్యపురం' తరహాలో అమ్మవారి మహిమలకు శాస్త్రీయ దృక్పథాన్ని జోడించి తెరకెక్కించిన చిత్రం 'మహేంద్రగిరి వారాహి'.

సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్ర
సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం శుక్రవారం అంటే ఇవాళ (సెప్టెంబర్ 11) థియేటర్లలోకి వచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్, బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో నేటి మహేంద్రగిరి వారాహి రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
200 ఏళ్ల క్రితం మహేంద్రగిరి సంస్థానపు రాజుకు ఎదురైన ఒక సంఘటనతో ఆయన తన 33వ ఏట ప్రాణాలు కోల్పోతాడు. ఆ రోజు నుంచి ఆ రాజవంశంలో పుట్టిన ప్రతి మగబిడ్డకూ 33 ఏళ్లు నిండగానే మరణం సంభవిస్తుంది. ఇది అమ్మవారి శాపమని ఆ రాజవంశం భయపడుతుంటుంది. 1993లో రాజేంద్ర వర్మ (సిద్ధూ జొన్నలగడ్డ) ఈ శాపాన్ని కొట్టిపారేసినప్పటికీ, అతను కూడా ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూస్తాడు.
ప్రస్తుత కాలానికి వస్తే.. అదే వంశానికి చెందిన వారసుడు నరేంద్ర వర్మ (వంశీ చాగంటి)కి కూడా ఈ గండం పొంచి ఉందని పూజారులు హెచ్చరిస్తారు. మరోవైపు దేవుళ్లు, దెయ్యాల పేరిట సాగే మోసాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎండగట్టే సిద్ధార్థ్ (సుమంత్), తన అన్నయ్య రాజీవ్ (కమల్ కామరాజు) పెళ్లి దోష నివారణ పూజ కోసం మహేంద్రగిరి వారాహి ఆలయానికి వెళ్తాడు.
సరిగ్గా నరేంద్ర వర్మ 33వ పుట్టినరోజు నాడే ఆ గుడిలో ఊహించని ఘటన జరుగుతుంది. ఒక దున్నపోతు దాడిలో నరేంద్ర వర్మతో పాటు అతడిని కాపాడేందుకు యత్నించిన రాజీవ్ కూడా ప్రాణాలు కోల్పోతాడు. తన అన్న చావు వెనుక ఉన్న నిజాన్ని, ఆ రాజవంశపు శాపం వెనుకున్న రహస్యాన్ని ఛేదించేందుకు సిద్ధార్థ్ పరిశోధన ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? 200 ఏళ్ల క్రితం నిజంగా ఏం జరిగింది అనేది వెండితెరపై చూడాల్సిందే.
కథనం ఎలా ఉందంటే?
కార్తికేయ, మురారి చిత్రాల ఛాయలు ఉన్నప్పటికీ, ద్వితీయార్థంలో వచ్చే ఊహించని పరిణామాలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ప్రథమార్థం (ఫస్ట్ హాఫ్) రాజవంశ శాపం నేపథ్యం, హీరో పాత్ర పరిచయం, కుటుంబ సన్నివేశాలతో కాస్త నెమ్మదిగా సాగుతుంది. కామెడీ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో పండకపోవడం, సుమంత్-కమల్ కామరాజు అన్నదమ్ముల జోడీ అంతగా ఆకట్టుకోదు.
అయితే, సెకండ్ హాఫ్‌లో కథ వేగం పుంజుకుంటుంది. 200 ఏళ్ల క్రితం నాటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, చావుల వెనుక దాగి ఉన్న అసలు నిజాన్ని హీరో అన్వేషించే తీరు ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపుతాయి. సినిమా చివరిలో వచ్చే రెండు ట్విస్టులు కథను ఊహించని మలుపు తిప్పుతాయి. ఏఐ (AI), అత్యాధునిక గ్రాఫిక్స్ సాయంతో తెరకెక్కించిన వారాహి అమ్మవారి దృశ్యాలు విజువల్ ట్రీట్‌లా అనిపిస్తాయి.
నటీనటులు, సాంకేతిక ప్రతిభ
మూఢనమ్మకాలను ప్రశ్నించే పరిశోధకుడి పాత్రలో సుమంత్ నటన ఆకట్టుకుంటుంది. సీనియర్ నటి మంజు భార్గవి రాజవంశపు పెద్దగా తన నటనతో గంభీరత తీసుకొచ్చారు. పూజారి పాత్రలో బ్రహ్మానందం సరికొత్త లుక్‌తో అలరించగా, వెన్నెల కిషోర్ నటన కామెడీతో ఉపశమనం ఇస్తుంది.
సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్ అతిథి పాత్రలు కథకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. వారి పాత్రల్లో వారు బాగా మెప్పించారు. ఇక సాంకేతిక విభాగంలో ఆర్ట్ డిపార్ట్‌మెంట్, సినిమాటోగ్రఫీ పనితనం మెప్పించింది. నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని సస్పెన్స్‌ను మరింత రెట్టింపు చేసింది.
ట్విస్టులతో క్లైమాక్స్
ప్రథమార్థంలో కొన్ని సాగదీత సన్నివేశాలను ఎడిటింగ్‌లో కట్ చేసి ఉంటే సినిమా గ్రాఫ్ ఇంకా పెరిగేది. ఫైనల్‌గా చెప్పాలంటే 200 ఏళ్ల క్రితం నాటి శాపం, దాని వెనుక ఉన్న రహస్యాల చుట్టూ సాగే డివోషనల్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ 'మహేంద్రగిరి వారాహి'. రొటీన్ ఫస్ట్ హాఫ్ పక్కన పెడితే.. ఆకట్టుకునే సెకండ్ హాఫ్, బ్రహ్మాండమైన క్లైమాక్స్ ట్విస్టుల కోసం ఈ సినిమాను థియేటర్లలో హ్యాపీగా చూడవచ్చు.
రేటింగ్: 3/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


