మెగాస్టార్ హా మజాకా! రికార్డులు బ్రేక్.. మన శంకర వర ప్రసాద్ గారు బాక్సాఫీస్ దూకుడు.. 8వ రోజు ఎన్ని కోట్లంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 8వ రోజు కూడా ఈ చిత్రం ఇండియాలో అదిరే కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. మరో రికార్డు సొంతం చేసుకుంది. 

Published on: Jan 20, 2026 5:32 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెగాస్టార్ హా మజాకా! 70 ఏళ్ల వయసులోనూ బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా రికార్డుల జోరు కొనసాగుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు చిరు. సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ మూవీ రికార్డుల దుమ్ము దులుపుతోంది.

మన శంకర వర ప్రసాద్ గారులో చిరంజీవి
మన శంకర వర ప్రసాద్ గారులో చిరంజీవి

మన శంకర వర ప్రసాద్ గారు కలెక్షన్లు

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం ఇండియాలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. సక్నిల్క్ ప్రకారం చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం 8 రోజుల్లో దేశీయంగా రూ.165 కోట్లకు పైగా వసూలు చేసింది. 'మన శంకర వర ప్రసాద్ గారు' సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న థియేటర్లలో విడుదలైంది.

ఇండియా వసూళ్లు

నివేదిక ప్రకారం ప్రీమియర్‌ల నుండి మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం రూ.9.35 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు రూ.32.25 కోట్లు, 2వ రోజు రూ.18.75 కోట్లు, 3వ రోజు రూ.19.5 కోట్లు వసూలు చేసింది. 4వ రోజు రూ.22 కోట్లు, 5వ రోజు రూ.19.5 కోట్లు, 6వ రోజు రూ.18.9 కోట్లు, 7వ రోజు రూ.17.65 కోట్లు వసూలు చేసింది. 8వ రోజు ఈ మూవీ ఇండియాలో రూ.7.21 కోట్లు నెట్ వసూలు చేసింది. ఇప్పటివరకు, ఇది ఇండియాలో రూ.165.11 కోట్లు నెట్ కలెక్షన్లు రాబట్టింది.

రికార్డు బ్రేక్

ఇండియాలో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిరంజీవి సినిమాగా మన శంకర వర ప్రసాద్ గారు నిలిచింది. వాల్తేరు వీరయ్య (రూ.161.06 కోట్లు) సినిమాను దాటేసింది. చిరంజీవి గత చిత్రాల జీవితకాల కలెక్షన్లు చూసుకుంటే.. 'భోళా శంకర్' ఇండియాలో రూ.30.63 కోట్లు, 'ఆచార్య' రూ.56.14 కోట్లు నెట్, 'గాడ్ ఫాదర్' రూ.74.03 కోట్లు, 'వాల్తేరు వీరయ్య' రూ.161.06 కోట్లు వసూలు చేశాయి.

ఫస్ట్ మూవీ

ప్రపంచవ్యాప్తంగానూ మన శంకర వర ప్రసాద్ గారు సినిమా కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఏడు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఓ ప్రాంతీయ సినిమా ఇంత వేగంగా రూ.300 కోట్ల గ్రాస్ అందుకోవడం ఇదే తొలిసారని వెల్లడించారు. మన శంకర వర ప్రసాద్ గారులో చిరంజీవి, నయనతార, వెంకటేష్, కేథరిన్ తదితరులు నటించారు.

అనిల్ రావిపూడి ఈ సినిమాకు డైరెక్టర్. ఈ బ్లాక్ బస్టర్ దర్శకుడు మన శంకర వర ప్రసాద్ గారు మూవీతో వరుసగా తొమ్మిదో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి మరియు సుస్మిత కొణిదెల నిర్మించారు.