మన శంకర వరప్రసాద్ గారు రివ్యూ-వింటేజ్ చిరంజీవి-వెంకీ, చిరు కాంబినేషన్-అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌటైందా?
సంక్రాంతి 2026 రేసులో నిలిచిన సినిమాల్లో అత్యంత హైప్ క్రియేట్ చేసిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్, అందులోనూ వెంకటేష్ ఉండటంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. మరి ఇవాళ రిలీజైన మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేయండి.
టైటిల్: మన శంకర వరప్రసాద్ గారు

నటీనటులు: చిరంజీవి, నయనతార, వెంకటేశ్, కేథరిన్ థెరిసా, సచిన్ ఖేడేకర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, సుదేవ్ నైర్, శరత్ సక్సేనా, మాస్టర్ రేవంత్ తదితరులు
రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల
మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
ఎడిటింగ్: తమ్మిరాజు
రిలీజ్ డేట్: జనవరి 12, 2026
ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. వీళ్ల కాంబినేషన్ అనగానే మన శంకర వరప్రసాద్ గారు మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు, ట్రైలర్ తో హైప్ మరింత పెరిగింది. అనిల్ డైరెక్షన్ లో చిరంజీవి తొలిసారి చేసిన సినిమా కావడంతో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.
సంక్రాంతికి రావడం, హిట్ కొట్టడం అనిల్ రావిపూడికి అలవాటుగా మారింది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సంక్రాంతి హిట్లు అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతి 2026కు వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఎలా ఉంది? మరోసారి మ్యాజిక్ రిపీట్ అయిందా? అన్నది ఈ రోజు మన శంకర వరప్రసాద్ గారు రివ్యూలో చూసేద్దాం.
కథ
ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీలో శంకర వరప్రసాద్ (చిరంజీవి) చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఉంటారు. ఆయన అప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా. కానీ జీవీఆర్ గ్రూప్స్ కంపెనీ బాస్ శశిరేఖ (నయనతార) పరిచయంతో వరప్రసాద్ లైఫ్ టర్న్ తీసుకుంటుంది. ఆమెతో చూస్తుండగానే పెళ్లి అయిపోతుంది. కానీ శశిరేఖ తండ్రి (సచిన్ ఖేడేకర్)కు ఈ పెళ్లి ఇష్టం ఉండదు. అందుకే వరప్రసాద్, శశిరేఖను విడదీస్తాడు. తన పిల్లలకూ వరప్రసాద్ దూరమవుతాడు.
కట్ చేస్తే కేంద్రమంత్రి శర్మ (శరత్ సక్సేనా) సెక్యూరిటీని వరప్రసాద్ చూసుకుంటాడు. శర్మకు వరప్రసాద్ చాలా క్లోజ్ అవుతాడు. ఈ క్రమంలోనే విడిపోయిన భార్య, పిల్లలకు వరప్రసాద్ ను దగ్గర చేయాలని శర్మ అనుకుంటాడు.
ఈ క్రమంలో తన పిల్లలు చదువుతున్న స్కూల్లో పీఈటీగా వెళ్తాడు వరప్రసాద్. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు శశిరేఖ, వరప్రసాద్ ఎందుకు విడిపోయారు? ఇందులో వెంకీ గౌడ (వెంకటేశ్) పాత్రకు ఉన్న సంబంధం ఏమిటన్నదే మన శంకర వరప్రసాద్ గారు మూవీ స్టోరీ.
విశ్లేషణ
ఎలాంటి లాజిక్కులు, గిమ్మిక్కులు లేకుండా ఫ్యామిలీ మొత్తం హాయిగా చూస్తూ నవ్వుకునే సినిమానే మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ ఇది. ఈ పండగకు ఆడియన్స్ కు ఫ్యామిలీతో థియేటర్ కు వెళ్లి కడుపుబ్బా నవ్వుకుని ఎంటర్ టైన్ అయ్యే సినిమాలు కావాలి. మన శంకర వరప్రసాద్ గారు అలాంటి సినిమానే. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఫుల్ మీల్స్ పెట్టి పంపిస్తుంది ఈ మూవీ.
సంక్రాంతి- అనిల్ రావిపూడి అంటేనే బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ పట్టిన డైరెక్టర్ అతను.ఇక చిరంజీవి అభిమానిగా బాస్ ను ఏ రేంజ్ లో చూపించాలో ఆ రేంజ్ లో చూపించాడు మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో. వింటేజీ లుక్ లో చిరు కామెడీ టైమింగ్, యాక్షన్, డ్యాన్స్ అదిరిపోయాయి. నయనతారతో గిల్లికజ్జాలు, పిల్లలతో కామెడీ వర్కౌట్ అయింది.
ఇక మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ను కలిసి బిగ్ స్క్రీన్ పై చూడాలనే ఫ్యాన్స్ కల ఈ మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో తీరింది. వెంకీ మామ ఎంట్రీ ఇచ్చాక సెకండాఫ్ లో సినిమా మరో స్థాయికి వెళ్తుంది. ఫస్టాఫ్ లో తన టీమ్ జ్వాల (కేథరీన్), నారాయణ (హర్షవర్ధన్), ముస్తాఫా (అభినవ్ గోమఠం)తో కలిసి నవ్విస్తాడు వరప్రసాద్. ఇక హుక్ స్టెప్ పాట సినిమాకు జోష్ తీసుకొస్తుంది. భార్యభర్తలుగా నయనతార, చిరంజీవి ట్రాక్ మెప్పిస్తుంది. స్కూల్ లో బుల్లిరాజు (మాస్టర్ రేవంత్) హడావుడి హిలేరియస్ గా ఉంటుంది.
నటీనటుల ప్రదర్శన
పొలిటికల్ కెరీర్ కు గుడ్ బై చెప్పి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన తర్వాత చిరంజీవికి సాలిడ్ హిట్ పడలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, ఆయన పాత తరం అభిమానులు కాస్త నిరాశతోనే ఉన్నారు. ఆ నిరాశను పూర్తిగా తొలగిస్తూ తన ఫ్యాన్స్ కు, ఆడియన్స్ కు అదిరిపోయే ఎంటర్ టైన్మెంట్ అందించారు వరప్రసాద్ గా చిరంజీవి. ఇది మెగాస్టార్ వన్ మ్యాన్ షో. చంటబ్బాయి సినిమాలోలాగా కనిపించారు.
సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ చిరంజీవి మూవీని నడిపించారు. కామెడీ టైమింగ్, డ్యాన్స్, యాక్షన్ వేరే లెవల్. శశిరేఖగా నయనతార కూడా తన నటనతో మెప్పించింది. ఆమె లుక్స్ సినిమాకు అట్రాక్షన్ తెచ్చాయి. ఇక వెంకటేశ్ సినిమాకు కీలకం. ఆయన వచ్చాన సినిమా మరో రేంజ్ కు వెళ్లింది. వెంకీ గౌడ, వరప్రసాద్ చేసే హంగామా, డ్యాన్స్ లు ఫ్యాన్స్ తో విజిల్స్ కొట్టిస్తాయి.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజుగా మెప్పించిన మాస్టర్ రేవంత్ ఈ మన శంకర వరప్రసాద్ గారు మూవీలోనూ అదరగొట్టాడు. కేథరీన్ క్యారెక్టర్ కూడా కీలకం. హర్షవర్దన్, అభినవ్ గోమఠం, రఘుబాబు, సచిన్ ఖేడేకర్, జరీనా వహాబ్ తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం
టెక్నికల్ పరంగా చూసుకుంటే డైరెక్టర్ అనిల్ రావిపూడికి వందకు వంద మార్కులు పడతాయి. చిరంజీవిని ఆయనలా మరో డైరెక్టర్ చూపించలేరనే చెప్పొచ్చు. కమర్షియల్ సినిమాలకు ఫ్యామిలీ ఎమోషన్ యాడ్ చేసి, కామెడీతో బ్లాక్ బస్టర్ కొట్టడం అనిల్ రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం బాగుంది. మీసాల పిల్ల, శశిరేఖ, హుక్ స్టెప్ పాటలు అదిరిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది.
సమీర్ రెడ్డి విజువల్స్ మూవీకి బలం. సెకండాఫ్ లో అక్కడక్కడా సాగదీత సన్నివేశాలు కనిపిస్తాయి. ఎడిటింగ్ లో అవి కాస్త కట్ చేస్తే బాగుండేది. ప్రొడ్యూసర్లు సినిమాను రిచ్ గా తీశారు.
ఫైనల్ గా
ఫైనల్ గా చెప్పాలంటే సంక్రాంతికి కావాల్సిన పండగ సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లలోకి వెళ్లి కచ్చితంగా మూవీని ఎంజాయ్ చేస్తారు. వింటేజీ చిరంజీవి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తాడు. సెకండాఫ్ లో కొన్ని సీన్లు, ఊహించదగిన స్క్రీన్ ప్లే మినహా ఈ మూవీని ఓవరాల్ గా చూసుకంటే ఈ సంక్రాంతి 2026 విన్నర్ అని చెప్పొచ్చు.
రేటింగ్: 3.5/5
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












