Mandadi Review: మండాడి రివ్యూ.. తమిళ ఎంట్రీలో విలన్‌గా తెలుగు హీరో సుహాస్ విశ్వరూపం.. పడవ రేసులతో సాగే మూవీ ఎలా ఉందంటే?
Mandadi Review: తెలుగులో హీరోగా, విలన్ గా అదరగొట్టిన సుహాస్ ఇప్పుడు తమిళంలో అడుగుపెట్టాడు. సూరితో కలిసి అతను చేసిన తమిళ మూవీ ‘మండాడి’ ఇవాళ రిలీజైంది. మరి కోలీవుడ్ డెబ్యూలో సుహాస్ అదరగొట్టాడా? పడవ రేసుల నేపథ్యంలో సాగే మూవీ మెప్పించిందా? అనేది మండాడి రివ్యూలో చూసేయండి.
Mandadi Review:

సినిమా పేరు : మండాడి
నటీనటులు : సుహాస్, సూరి, మహిమా నంబియార్, సత్యరాజ్ తదితరులు
దర్శకుడు : మదిమారన్ పగళేంది
రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 10, 2026
తెలుగులో 'కలర్ ఫోటో', 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' వంటి చిత్రాలతో ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు సుహాస్. ఇప్పుడు అతను తమిళంలోకి అడుగుపెట్టాడు. తమిళంలో తన అడుగును ఒక పవర్‌ఫుల్ నెగెటివ్ పాత్రతో వేశాడు. సుహాస్, సూరి కలిసి నటించిన మూవీ ‘మండాడి’ ఇవాళ థియేటర్లకు వచ్చింది.
'విడుదల', 'గరుడన్' చిత్రాలతో నటుడిగా తానో సరికొత్త ఎత్తుకు ఎదిగానని నిరూపించుకున్న సూరి.. ‘మండాడి’లో సరికొత్త గెటప్‌లో కనిపించాడు. మరి 'వెట్రిమారన్' శిష్యుడు పుగళేంది మతిమారన్ తెరకెక్కించిన మూవీ అలరించిందా? సుహాస్ నటన ఎలా ఉంది? అనేది మండాడి రివ్యూలో తెలుసుకుందాం.
స్టోరీ ఏమిటంటే?
కళింగపట్నం సముద్ర తీరంలో నివసించే ముత్తుకాళి (సూరి), సట్టపులి (సుహాస్) ప్రాణస్నేహితులు. అలాగే అత్యంత ప్రతిభావంతులైన పడవల రేసర్లు కూడా. అయితే ఓ ఘటనతో వీళ్ల జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ప్రాణ స్నేహితులు కాస్త బద్ధ శత్రువులవుతారు. ఆ వివాదం కారణంగా ముత్తుకాళి ఆ క్రీడను, గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతాడు.
సట్టపులి ఏమో ఆ ఊరిపై తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతాడు. ఇరవై ఏళ్ల తర్వాత ఊరి సర్పంచ్ (సత్యరాజ్) చొరవతో మళ్లీ గ్రామంలో ప్రతిష్టాత్మకమైన పడవల పోటీలు ప్రారంభమవుతాయి. ఈ పోటీ ముత్తుకాళి, సట్టపులిల మధ్య ఉన్న పగను, ఈగోను ఎలా రగిల్చింది? చివరకు వీరిద్దరి మధ్య జరిగిన హై-వోల్టేజ్ పోరులో ఎవరు నెగ్గారు అనేది 'మండాడి' స్టోరీ.
విశ్లేషణ
మండాడి మూవీ ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయం, కళింగపట్నం జీవన విధానం, ముత్తుకాళి, సట్టపులి మధ్య పెరిగే ఉద్రిక్తతలతో వేగంగా సాగిపోతుంది. అయితే సెకండాఫ్ లో కథ బాగా ప్రెడిక్టబుల్‌గా మారుతుంది. ఇరవై ఏళ్ల పగ వెనుక ఉన్న అసలు కారణాన్ని మరింత బలంగా చూపించి ఉంటే క్లైమాక్స్ రేసుకు మరింత ఎమోషనల్ వెయిట్ వచ్చేది.
ముత్తుకాళి, సట్టపులి మధ్య స్నేహాన్ని ఫ్లాష్ బ్యాక్ లోనూ పూర్తిగా చూపించలేదనిపించింది. అందుకే క్లైమాక్స్ లో ఎమోషనల్ డెప్త్ లోపించిందనిపించింది. ఇక సీనియర్ నటుడు సత్యరాజ్ పాత్రను మరింత సమర్థవంతంగా వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆయన పాత్ర పరిమితంగానే ఉండిపోయింది.
ఎవరెలా చేశారంటే?
కథాంశం పరంగా మండాడికి ప్రధాన బలం దాని రా అండ్ రియలిస్టిక్ టేకింగ్. సముద్రంలో పడవల రేసింగ్ అనే కాన్సెప్ట్ తెలుగు, తమిళ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. సూరి తన పాత్రలో జీవించేశాడు. భారీ డైలాగులు లేకుండా కేవలం కళ్లలోని భావాలు, మౌనంతోనే ముత్తుకాళి పడే ఆవేదనను అద్భుతంగా పండించాడు.
ఇక తెలుగు ప్రేక్షకులకు షాకింగ్ సర్ ప్రైజ్ సుహాస్ అని చెప్పొచ్చు. నెగెటివ్ షేడ్స్ ఉన్న 'సట్టపులి' పాత్రలో సుహాస్ చూపించిన మ్యానరిజమ్స్, గంభీరమైన గొంతు, కళ్లలో కనిపించే క్రూరత్వం సినిమాకు ఆత్మలా నిలిచాయి. అతను నట విశ్వరూపం చూపించాడు. ఇద్దరి మధ్య వచ్చే మైండ్ గేమ్‌లు, ప్రీ-ఇంటర్వెల్ ఫైట్ సీన్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయి.
టెక్నికల్ గా
టెక్నికల్ గా మండాడి మూవీ హై లెవల్ లో ఉంది. జి.వి.ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం, ముఖ్యంగా సముద్రంలో పడవల రేస్ సీన్లలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌ను వేరే స్థాయికి తీసుకెళ్లింది. ఎస్.ఆర్. కథిర్ కెమెరా పనితనం సముద్రాన్ని, రఫ్ అండ్ టఫ్ వాతావరణాన్ని చాలా నేచురల్‌గా ఆవిష్కరించింది. ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్ రెండో భాగంలో కొంచెం గ్రిప్పింగ్ ఉంటే సినిమా ఇంకా బెటర్ గా ఉండేది.
ఫైనల్ గా
ఫైనల్ గా చెప్పాలంటే.. 'మండాడి' మూవీ అనేది ఒక డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. సూరి, సుహాస్‌ల మైండ్ గేమ్స్, జీవి ప్రకాష్ మ్యూజిక్ కోసం ఈ చిత్రాన్ని థియేటర్లలో కచ్చితంగా ఒకసారి చూడవచ్చు. అయితే ఎమోషన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే మూవీ వేరే లెవల్ ఉండేది.
హెచ్‌టీ తెలుగు రేటింగ్: 3/5
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


