New Ghost Rider: కొత్త ఘోస్ట్ రైడర్ వస్తున్నాడు.. సూపర్ హీరో ప్రపంచంలోకి ర్యాన్ గోస్లింగ్- ఇంట్రెస్టింగ్‌గా భార్య లింక్!

Ryan Gosling As New Ghost Rider: హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గోస్లింగ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లోకి అధికారికంగా అడుగుపెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన 'ఘోస్ట్ రైడర్' పాత్రలో ర్యాన్ గోస్లింగ్ నటించనున్నట్లు శాన్ డియాగో కామిక్-కాన్ వేదికగా మార్వెల్ ప్రకటించింది.

Published on: Jul 26, 2026, 13:55:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ryan Gosling As New Ghost Rider: హాలీవుడ్ సూపర్‌ హీరో సినిమాల ప్రియులకు మార్వెల్ స్టూడియోస్ ఊహించని శుభవార్త అందించింది. గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ప్రచారానికి తెరదించుతూ.. నూతన 'ఘోస్ట్ రైడర్' పాత్రలో ప్రముఖ నటుడు ర్యాన్ గోస్లింగ్ నటిస్తున్నట్లు స్పష్టం చేసింది.

కొత్త ఘోస్ట్ రైడర్ వస్తున్నాడు.. సూపర్ హీరో ప్రపంచంలోకి ర్యాన్ గోస్లింగ్- ఇంట్రెస్టింగ్‌గా భార్య లింక్!
కొత్త ఘోస్ట్ రైడర్ వస్తున్నాడు.. సూపర్ హీరో ప్రపంచంలోకి ర్యాన్ గోస్లింగ్- ఇంట్రెస్టింగ్‌గా భార్య లింక్!

యాంటీ-హీరో పాత్ర

అమెరికాలో జరిగిన ప్రసిద్ధ 'శాన్ డియాగో కామిక్-కాన్' (SDCC) వేదికగా, మార్వెల్ 'హాల్ హెచ్' ప్యానెల్‌లో ఈ కీలక ప్రకటన వెలువడింది. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా ఇండియాలో సైతం మార్వెల్ (MCU) చిత్రాలకు భారీ డిమాండ్ ఉంటుంది.

'అవెంజర్స్' సిరీస్ నుంచి మొన్నటి 'డెడ్‌పూల్' వరకు ఇక్కడి బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు సాధించాయి. ఇప్పుడు మార్వెల్ కామిక్స్‌లో అత్యంత పవర్‌ఫుల్, యాంటీ-హీరో పాత్ర అయిన 'ఘోస్ట్ రైడర్'గా 45 ఏళ్ల ఆస్కార్ నామినీ ర్యాన్ గోస్లింగ్ ఎంపిక కావడంతో అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది.

2028లో రిలీజ్.. 'డెడ్‌పూల్' డైరెక్టర్ చేతిలో బాధ్యతలు

ఈ కొత్త 'ఘోస్ట్ రైడర్' సోలో సినిమాకు ప్రసిద్ధ దర్శకుడు షాన్ లేవీ దర్శకత్వం వహించనున్నారు. 'డెడ్‌పూల్ అండ్ వోల్వరీన్' సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన షాన్ లేవీ.. ప్రస్తుతం ర్యాన్ గోస్లింగ్‌తో కలిసి 'స్టార్ వార్స్: స్టార్‌ఫైటర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఆ సినిమా షూటింగ్ సమయంలోనే 'ఘోస్ట్ రైడర్' పాత్ర చేయడానికి ర్యాన్ గోస్లింగ్‌ను ఒప్పించినట్లు షాన్ లేవీ వేదికపై వెల్లడించారు. 2028 నాటికి ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

"ఈ పాత్రలో నటించాలని నేను చాలా కాలంగా అనుకుంటున్నాను" అని సదస్సులో హర్షధ్వానాలు చేస్తున్న అభిమానులను ఉద్దేశించి ర్యాన్ గోస్లింగ్ ఆనందం వ్యక్తం చేశారు. "ర్యాన్‌తో ఈ క్యారెక్టర్ గురించి చర్చ రాగానే 'పద బైక్ ఎక్కుదాం' అని సిద్ధమైపోయాం. 2028లో మిమ్మల్ని థియేటర్లలో కలుస్తాం" అని దర్శకుడు షాన్ లేవీ పేర్కొన్నారు.

నికోలస్ కేజ్ నుంచి ర్యాన్ చేతికి.. ఒక ఆసక్తికరమైన లింక్!

గతంలో 'ఘోస్ట్ రైడర్' అనగానే ప్రతి ఒక్కరికీ హాలీవుడ్ స్టార్ హీరో నికోలస్ కేజ్ గుర్తుకొచ్చేవారు. 2007లో వచ్చిన 'ఘోస్ట్ రైడర్', 2011లో వచ్చిన 'ఘోస్ట్ రైడర్: స్పిరిట్ ఆఫ్ వెంజియాన్స్' చిత్రాల్లో జానీ బ్లేజ్ (ఘోస్ట్ రైడర్) పాత్రలో నికోలస్ కేజ్ ఎంతగానో మెప్పించారు. ముఖ్యంగా 90స్ కిడ్స్‌లో ఘోస్ట్ రైడర్ క్రేజ్ మాములుగా ఉండదు.

అలాంటి ఘోస్ట్ రైడర్ పాత్రకు ర్యాన్ గోస్లింగ్‌కు ఆసక్తికరమైన లింక్ ఉంది. 2007 ఘోస్ట్ రైడర్ సినిమాలో నికోలస్ కేజ్ సరసన నటించిన హీరోయిన్ ఈవా మెండిస్.. ప్రస్తుతం ర్యాన్ గోస్లింగ్ నిజ జీవిత భాగస్వామి (భార్య) కావడం విశేషం.

ఏమిటీ 'జానీ బ్లేజ్' కథ?

కామిక్ పుస్తకాల ప్రకారం జానీ బ్లేజ్ ఒక ప్రమాదకరమైన బైక్ స్టంట్ మెన్. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తండ్రి ప్రాణాలను కాపాడుకోవడానికి సైతాన్‌తో (డెవిల్) ఒక ఒప్పందం చేసుకుంటాడు. తండ్రి క్యాన్సర్ నుంచి కోలుకున్నప్పటికీ, ఒక బైక్ ప్రమాదంలో మరణిస్తాడు.

ఆ ఒప్పందం కారణంగా జానీ బ్లేజ్ రాత్రి వేళల్లో భయంకరమైన అగ్ని జ్వాలలతో మండే తలతో 'ఘోస్ట్ రైడర్'గా మారుతాడు. శత్రువులను బూడిద చేసే అగ్ని గొలుసులు, ఎదుటివారి పాపాలను గుర్తుచేసి నరకం చూపించే 'పెనెన్స్ స్టేర్' (Penance Stare) అతని ప్రత్యేక శక్తులు.

సూపర్ హీరో ప్రపంచంలోకి ర్యాన్ గోస్లింగ్

సూపర్ హీరో కామిక్ ప్రపంచంలోకి ర్యాన్ గోస్లింగ్‌కి ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. మాస్ యాక్షన్, హై-వోల్టేజ్ బైక్ స్టంట్స్, ఊహించని విజువల్ ఎఫెక్ట్స్‌తో రాబోయే ఈ చిత్రం మార్వెల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లలో సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More