OTT: సెప్టెంబర్ 1 నుంచి తమిళ సినిమాలు బంద్- నిర్మాతల సంచలన నిర్ణయం- రజనీకాంత్, ధనుష్, కార్తీకి దెబ్బ!
No New Tamil Movie Releases From September 1: ఓటీటీ రిలీజ్ నిబంధనలపై థియేటర్ యజమానులు, పంపిణీదారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంతో తమిళ చిత్రసీమలో తీవ్ర సంక్షోభం నెలకొంది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల విడుదలలతో పాటు షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు నిర్మాతల మండలి సంచలన ప్రకటన చేసింది.
No New Tamil Movie Releases From September 1st: దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరోసారి నిర్మాతలు, ఎగ్జిబిటర్ల నడుమ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఓటీటీ వేదికలపై కొత్త సినిమాల స్ట్రీమింగ్ సమయాన్ని నిర్దేశిస్తూ థియేటర్ల యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయం కోలీవుడ్‌లో పెను తుఫాను రేపింది.

సెప్టెంబర్ 1 నుంచి బంద్
వచ్చే నెల సెప్టెంబర్ 1 నుంచి అంటే వచ్చే వారం నుంచి థియేటర్లలో ఏ ఒక్క కొత్త తమిళ సినిమాను విడుదల చేయబోమని, అంతేకాకుండా నిర్మాణంలో ఉన్న సినిమాల షూటింగ్‌లను, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తమిళ సినీ నిర్మాతల మండలి స్పష్టం చేసింది.
గొడవకు కారణమైన ఆ ఎనిమిది వారాల నిబంధన!
ఇటీవల తమిళనాడు థియేటర్ ఓనర్ల అసోసియేషన్, పంపిణీదారుల సంఘం కలిసి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాయి. థియేటర్లలో విడుదలయ్యే ప్రతి తమిళ సినిమా ఎనిమిది వారాల (2 నెలలు) వ్యవధి పూర్తయిన తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ కావాలని షరతు విధించాయి. దానికి తోడు కొత్త సినిమాలకు ఇచ్చే ముందస్తు అడ్వాన్సులను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
అయితే, ఈ నిర్ణయాలపై తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC), తమిళనాడు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తమతో ఎలాంటి చర్చలు జరపకుండా ఏకపక్షంగా నిబంధనలు విధించడాన్ని ఏమాత్రం సహించేది లేదని భీష్మించుకున్నాయి.
ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే ఎలా?
"నిర్మాతలతో కనీసం సంప్రదించకుండా పంపిణీదారులు, థియేటర్ యజమానులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే మేం ఎలా అంగీకరిస్తాం? అందుకే సెప్టెంబర్ 1 నుంచి కొత్త చిత్రాల విడుదలలు నిలిపివేయాలని నిర్ణయించాం" అని నిర్మాతల మండలి తమ అధికారిక ప్రకటనలో తెగేసి చెప్పింది.
షూటింగ్స్ బంద్.. రంగంలోకి ప్రభుత్వం రావాలని వినతి!
కేవలం సినిమాల విడుదలలు ఆపడమే కాకుండా, సెప్టెంబర్ నుంచి సెట్స్‌పై ఉన్న సినిమాల చిత్రీకరణలు, ఎడిటింగ్ సహా అన్ని రకాల పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా బంద్ చేస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వెల్లడించింది.
ఈ హఠాత్ నిర్ణయంతో కోలీవుడ్‌లో వేలాది మంది దినసరి కార్మికులు, సాంకేతిక నిపుణుల జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన నిర్మాతలు, వెంటనే తమిళనాడు ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా గతంలో ఓటీటీ విండో వ్యవధి (4 వారాలు లేదా 8 వారాలు) పై తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. అయితే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో, ఓటీటీ డీల్స్ ద్వారా వచ్చే ఆదాయమే చిన్న, మధ్య తరహా నిర్మాతలకు ప్రధాన మనుగడగా మారింది.
ఈ తరుణంలో ఎనిమిది వారాల గ్యాప్ తప్పనిసరి చేస్తే డిజిటల్ హక్కుల ధరలు పడిపోతాయని కోలీవుడ్ నిర్మాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ సమ్మె ప్రకటనతో సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో థియేటర్లలోకి రావలసిన పలు ఆసక్తికర చిత్రాల విడుదలపై సందిగ్ధత నెలకొంది.
కార్తి 'సర్దార్ 2' సహా ఆ బారీ చిత్రాల విడుదలపై అనుమానాలు!
కార్తి కథానాయకుడిగా తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'సర్దార్ 2' సెప్టెంబర్ 10న ప్రేక్షకు ముందుకు రావాల్సి ఉంది. ఈ బంద్ వల్ల ఈ చిత్రం అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
వీటితో పాటు జీవీ ప్రకాష్ కుమార్ నటించిన 'ఇమ్మోర్టల్', సూరి హీరోగా వస్తున్న 'మందాడి', డిమాంటీ కాలనీ సీక్వెల్స్ రేసులో ఉన్నాయి. అంతేకాకుండా 2026 చివరి నాటికి విడుదల కావాల్సిన రజినీకాంత్ 'జైలర్ 2', ధనుష్ 'ఓం', విజయ్ సేతుపతి 'బథా', అలాగే రాజ్‌కమల్ ఫిలింస్ బ్యానర్‌లో ప్రారంభమైన జేసన్ సంజయ్ డెబ్యూ మూవీ 'సిగ్మా' వంటి పెద్ద ప్రాజెక్టుల షూటింగ్‌లపై ఈ సమ్మె ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.
వచ్చే వారం నుంచే
మరి థియేటర్ల యజమాన్యాలు వెనక్కి తగ్గుతాయో లేక ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహిస్తుందో చూడాలి. ఏది ఏమైనా వచ్చే వారం నుంచి మాత్రం ఏ ఒక్క తమిళ సినిమా విడుదల కాబోదని తెలుస్తోంది. ఈలోపే ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటే పరిస్థితులు మారే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


