...
...
Next Story

OTT Horror: ఓటీటీలో హారర్ జాతర- వేర్వేరు కథలతో 6 సరికొత్త సినిమాలు- నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ప్రైమ్‌లో-వీకెండ్ పండగే!

OTT Horror Thrillers This Week: రొటీన్ దెయ్యాల కథలకు భిన్నంగా సరికొత్త కాన్సెప్ట్‌లతో 6 హారర్, సైకలాజికల్ థ్రిల్లర్లు ఈ వారం ఓటీటీలోకి అడుగుపెట్టాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ వేదికల్లో తెలుగు సినిమాల నుంచి డీప్‌ఫేక్ టెక్నాలజీ థ్రిల్లర్ల వరకు ప్రేక్షకులను భయపెడుతున్నాయి.

Published on: Nov 22, 2026, 06:14:00 IST
Advertisement

OTT Horror Thrillers This Week: ఓటీటీలో ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ స్ట్రీమింగ్ అవుతూ సినీ ప్రియులను అలరిస్తుంటాయి. అందులోనూ హారర్ థ్రిల్లర్స్ అంటే ఎక్కువమంది అమితంగా ఓటీటీలో చూసేందుకు ఇష్టపడుతుంటారు.

ఓటీటీ హారర్ థ్రిల్లర్స్

ఓటీటీలో హారర్ జాతర- వేర్వేరు కథలతో 6 సరికొత్త సినిమాలు- నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ప్రైమ్‌లో-వీకెండ్ పండగే!
ఓటీటీలో హారర్ జాతర- వేర్వేరు కథలతో 6 సరికొత్త సినిమాలు- నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ప్రైమ్‌లో-వీకెండ్ పండగే!

అలాగే.. పాతకాలపు భవనాలు, దెయ్యాల కథల స్థానంలో ఇప్పుడు సైన్స్ ఫిక్షన్, జానపద గాథలు, ఆధునిక టెక్నాలజీ నేపథ్యంతో సాగే హారర్ థ్రిల్లర్లకు మంచి ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఈ వారం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ ఓటీటీల్లో ఆరు విభిన్నమైన హారర్ థ్రిల్లర్స్ డిఫరెంట్ కాన్సెప్టులతో ఓటీటీలోకి వచ్చాయి.

మెడికల్ కాలేజీ మిస్టరీ

ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహించిన తెలుగు సూపర్ నేచురల్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ '418' నవంబర్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. గ్రామస్తుల వ్యతిరేకతను పక్కకుపెట్టి 15 ఏళ్ల తర్వాత తిరిగి తెరిచిన పాత విమ్స్ (VIMS) మెడికల్ కాలేజీ భవనం చుట్టూ ఈ కథ నడుస్తుంది. క్యాంపస్‌లో అంతుచిక్కని ఘటనలు, అమ్మాయిలకు ప్రవేశం ఉండకపోవడం వంటి అంశాలతో ఉత్కంఠంగా సాగుతుంది.

మంత్రగత్తె వర్సెస్ ఏంజిల్

భారతీయ జానపద గాథలు, వనదేవి ఆలయ సంప్రదాయాల నేపథ్యంలో సాగే మిస్టరీ థ్రిల్లర్ 'ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' నవంబర్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె లేకుండా ఉచితంగా (సబ్‌స్క్రైబర్లకు) అందుబాటులోకి వచ్చింది. సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా, సునీల్ గ్రోవర్ ప్రధాన పాత్రలు పోషించారు. ముంబైలో ఇంజనీర్‌గా పనిచేసే రిషి, వారసత్వంగా వచ్చిన ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుని భూమిని అమ్మేందుకు బిహార్‌లోని తన సొంతూరు దేవాంచల్ వెళ్తాడు. స్థానికుల హెచ్చరికలను పెడచెవిన పెట్టి సూర్యాస్తమయం తర్వాత నిషేధ అటవీ ప్రాంతంలోకి అడుగుపెట్టిన రిషి, అనుకోకుండా అక్కడి ప్రాచీన దైవశక్తిని మేల్కొలుపుతాడు. అడవిని నాశనం చేసి రోడ్డు వేయాలనుకునే స్థానిక రాజకీయ నాయకుడికి, అతీంద్రియ శక్తులకు మధ్య నలిగిపోయిన రిషి తన గ్రామాన్ని ఎలా కాపాడుకున్నాడన్నది ఆసక్తికరంగా సాగుతుంది.

మొసళ్ల బీభత్సం

భారీ మొసళ్ల భయాన్ని ఇష్టపడే ప్రేక్షకుల కోసం హాలీవుడ్ హారర్ చిత్రం 'లేక్ ప్లాసిడ్ 3' (Lake Placid 3) నవంబర్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గతంలో ప్రాణాంతక మొసళ్ల దాడులకు కేంద్రమైన లేక్ ప్లాసిడ్ ప్రాంతానికి ఓ గేమ్ వార్డెన్ తన కుటుంబంతో కలిసి వెళ్తాడు. అక్కడ మొసళ్లు లేవని స్థానికులు భరోసా ఇచ్చినా, వార్డెన్ చిన్న కుమారుడు కొన్ని మొసలి పిల్లలకు ఆహారం వేస్తూ పెంచుతాడు. అవి అనతికాలంలోనే భారీ ఆకారంలోకి పెరిగి వార్డెన్ కుటుంబంతో పాటు సమీప పట్టణంపై విరుచుకుపడటంతో అసలు కథ మొదలవుతుంది.

సర్వైవల్ థ్రిల్లర్..

విమర్శకుల ప్రశంసలు పొందిన అమెరికన్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ 'యెల్లోజాకెట్స్' (Yellowjackets) నాలుగో సీజన్ నవంబర్ 21న జియో హాట్‌స్టార్ (JioHotstar) వేదికగా మొదలైంది. 1996లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు యువతీయువకులు దట్టమైన అడవిలో 19 నెలల పాటు ప్రాణాలు నిలుపుకోవడానికి చేసిన పోరాటాన్ని ఈ ఓటీటీ సిరీస్ ఆవిష్కరిస్తుంది. ప్రాణభయం ఎదురైనప్పుడు మనిషి ఏ స్థాయికి దిగజారగలడో చూపించే ఈ సిరీస్ ముగింపు సీజన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

డీప్‌ఫేక్ భయం

అలాగే సాంకేతికత ఎంత ప్రమాదకరంగా మారుతుందో కళ్లకు కట్టే సైకలాజికల్ టెక్ థ్రిల్లర్ 'అపోఫెనియాక్స్' (Appofeniacs) నవంబర్ 17న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ రిలీజ్ అయింది. మనం చూసేది, వినేది నిజమని నమ్మే బలహీనతను ఆసరాగా చేసుకుని డ్యూక్ అనే యువకుడు డీప్‌ఫేక్ వీడియోలను ఒక సరదా ఆటలా వాడుతుంటాడు. కేవలం తనకు సాధ్యమవుతుందన్న అహంతో అతను సృష్టించే నకిలీ వీడియోలు రక్తపాతానికి దారితీస్తాయి. డ్యూక్ చేసిన పనుల వల్ల కాస్‌ప్లే వీకెండ్ కోసం ఎడారికి వెళ్లే పాపీ, కాస్‌ప్లే పరికరాల తయారీదారు సింటో బింటో (సీన్ గన్) వంటి వారి జీవితాలు ఎలా చిక్కుల్లో పడ్డాయన్నది ఈ చిత్రం ఉత్కంఠభరితంగా చూపిస్తుంది.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks