OTT Movies: ఓటీటీలోని ఈ 5 సినిమాలను మీ భార్యలతో కలిసి అస్సలు చూడకండి.. చూస్తే డేంజరే.. మీ పరువు పోతుంది
ఓటీటీలో (OTT Movies) స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఐదు సినిమాలను మీ భార్యలతో కలిసి చూసే ధైర్యం చేయొద్దు. ఒకవేళ చూశారో మీకు డేంజరే. భర్తగా మీ పరువు పోయే ప్రమాదం ఉంది. మరి ఆ సినిమాలు ఏంటి? ప్రస్తుతం ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూడండి.
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కొన్ని సినిమాలు ఫ్యామిలీతో చూడదగినవే. కానీ వీటిని మీ భార్యలతో చూస్తే మాత్రం కాస్త డేంజరే. వీటిలో డొమెస్టిక్ వయోలెన్స్ కు సంబంధించినవి కొన్ని ఉంటే.. మరికొన్ని భర్తల ఆధిపత్యాన్ని ప్రశ్నించి ఎదురు తిరిగే భార్యల చుట్టూ తిరిగే సినిమాలూ ఉన్నాయి. మరి అలాంటి 5 మూవీస్ ఏవి? వాటిని ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసుకోండి.

ది గ్రేట్ ఇండియన్ కిచెన్ - అమెజాన్ ప్రైమ్ వీడియో
నిమిషా సజయన్, సూరజ్ వెంజరమూడు నటించిన మూవీ ఇది. ఈ సినిమా కేవలం వంటగదికే పరిమితమైన ఒక సాధారణ మహిళ బోరింగ్ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. సమాజంలో ఒక మహిళను కేవలం సేవలు చేసే ఓ యంత్రంగా ఎలా భావిస్తారో ఇందులో చాలా స్పష్టంగా చూపించారు.
ఐఎండీబీలో 8.1 రేటింగ్ ఉన్న ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఇంటి పనుల్లో మీ భార్యకు ఏమాత్రం సాయం చేయకుండా.. ఎప్పుడూ ఆమె మీకు సేవలు చేయాలని భావించే భర్తలైతే మాత్రం ఈ సినిమాను మీ భార్యలతో కలిసి చూడొద్దు.
థప్పడ్ - అమెజాన్ ప్రైమ్ వీడియో
తాప్సీ పన్ను, పావెల్ గులాటీ నటించిన సినిమా ఇది. ఒక సంతోషకరమైన దాంపత్య జీవితం కాస్తా ఒక పార్టీలో భర్త తన భార్యను అనుకోకుండా చెంపదెబ్బ కొట్టినప్పుడు ఎలా తలకిందులవుతుందో ఈ మూవీలో చూడొచ్చు. ఆ చెంపదెబ్బ ఎందుకు కొట్టాడు అనేది ఇక్కడ ముఖ్యం కాదు.. "అది కేవలం ఒకే ఒక్క చెంపదెబ్బ కదా" అని చాలా తేలికగా తీసిపారేయడం ఎంత తప్పో ఈ సినిమా సున్నితంగా చర్చిస్తుంది.
ఐఎండీబీలో 7 రేటింగ్ ఉన్న ఈ మూవీ కూడా ప్రైమ్ వీడియోలో ఉంది. భార్యపై చేయి చేసుకోవడంలో పెద్ద వింతేమీ లేదు అని భావించే మనస్తత్వం ఉన్న భర్తలు ఈ సినిమాను మీ పార్ట్‌నర్ తో కలిసి చూడొద్దు.
జయ జయ జయ జయ హే - జియోహాట్‌స్టార్
దర్శన రాజేంద్రన్, బేసిల్ జోసెఫ్ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ జయ జయ జయ జయహే. ఇదొక అద్భుతమైన డార్క్ కామెడీ సినిమా. ఇందులో జయ అనే అమ్మాయి గృహహింసకు గురవుతుంది. ఆమె భర్త ప్రతి చిన్న విషయానికీ ఆమెను కొడుతుంటాడు. మొదట్లో ప్రతి భార్య విషయంలోనూ ఇలాగే జరుగుతుందేమో అనుకుని జయ అన్నీ భరిస్తుంది.
కానీ ఒక దశలో ఆమె ఇక ఆ దౌర్జన్యాన్ని సహించకూడదని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఆమె సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని, తన భర్తను తిరిగి కొట్టడం ప్రారంభిస్తుంది. ఐఎండీబీలో 7.7 రేటింగ్ ఉన్న ఈ సినిమా జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మధ్యే తెలుగులో ఓం శాంతి శాంతి శాంతి: పేరుతో ఈ మూవీ రీమేక్ వచ్చింది.
ఇంగ్లీష్ వింగ్లీష్ - జియోహాట్‌స్టార్
శ్రీదేవి, ఆదిల్ హుస్సేన్ నటించిన మూవీ ఇది. శశి ఒక సాధారణ గృహిణి చుట్టూ తిరిగే సినిమా. ఆమెకు ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడంతో ఆమె భర్త, కూతురు ఎప్పుడూ ఆమెను తక్కువ చేసి మాట్లాడుతూ అవమానిస్తుంటారు. ఈ అవమానాలను భరించలేక ఆమె ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఒక ఇంగ్లీష్ కోర్సులో చేరుతుంది.
చివరగా ఆమె ఇంగ్లీష్ నేర్చుకుని కోల్పోయిన గౌరవాన్ని ఎలా తిరిగి పొందింది అనేది ఈ కథ. ఐఎండీబీలో 7.8 రేటింగ్ ఉంది. భార్యల్లోని చిన్న చిన్న లోపాలను కూడా ఎత్తి చూపే భర్తలు ఈ సినిమా చూసిన తర్వాత పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన భావించడం ఖాయం.
మిసెస్ - జీ5 ఓటీటీ
సాన్యా మల్హోత్రా, నిశాంత్ దహియా నటించిన హిందీ సినిమా ఇది. ఓటీటీలో విడుదలైనప్పటి నుంచి 'మిసెస్' సినిమా గురించి సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ఒక ప్రతిభావంతురాలైన డ్యాన్స్ టీచర్ కథ ఇది.
పెళ్లి తర్వాత ఆమె గుర్తింపు కేవలం వంటగదికే పరిమితం అవుతుంది. ఒకరోజు ఆమె తన భర్త, మామ జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ఒక సంచలన నిర్ణయం తీసుకుంటుంది. ఐఎండీబీలో 6.7 రేటింగ్ ఉన్న ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


